Sleeping Problems: నిత్యం ఎంతసేపు నిద్రపోయామనేదే కాదు… అందులో గాఢనిద్ర ఎంతసేపు అనేది కూడా చాలా ముఖ్యం. రోజూ ఒకే సమయంలో పడుకుంటున్నామా? లేదా ఒకరోజు రాత్రి 11 గంటలకు.. మరో రోజు 12 గంటలకూ.. ఇంకో రోజు అర్ధరాత్రి ఒంటి గంటకూ.. ఇలా క్రమం తప్పి నిద్రిస్తున్నామా? అనేది ఇంకా ముఖ్యమంటున్నారు నిపుణులు. నిద్రలేమి.. గాడితప్పిన నిద్రించే అలవాట్ల కారణంగా గుండెపోటు, మెదడుపోటు, కాలి రక్తనాళాల్లో పూడికల ముప్పు పొంచి ఉందని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ఒత్తిడి, ఆందోళనల వల్ల ఆహారపుటలవాట్లు కూడా క్రమం తప్పుతున్నట్లుగా అధ్యయనాలు గుర్తించాయి. ఈ కారణంగా కూడా హృదయ వైఫల్య సమస్యల బారినపడే అవకాశాలున్నాయని తాజాగా పరిశోధనల్లో వెల్లడైంది.
నిద్రలేకుంటే గుండె లయకు ముప్పే..
నిద్రకూ, రక్తనాళాల్లో పూడికలకు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో అమెరికాకు చెందిన ‘వాండెర్‌బిల్ట్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సెంటర్’ పరిశోధకులు అధ్యయనం చేశారు. దీనికి సంబంధించిన పరిశోధన పత్రం ఇటీవలే ‘అమెరికన్ హార్ట్ అసోసియేషన్’ వైద్య పత్రికలో ప్రచురితమైంది. 45 ఏళ్ల పైబడిన 2000 మందిని మూడు సంవత్సరాలపాటు అధ్యయనం చేశారు. వీరి మణికట్టుకు ఒక పరికరాన్ని కట్టారు. ఏ సమయానికి నిద్రపోతున్నారు? రాత్రిపూట ఎంతసేపు పడుకున్నారు? ఎంతసేపు మెలకువతో ఉన్నారు? వీటినన్నిటినీ ఈ పరికరం నమోదు చేసింది. ఏడు రోజులపాటు వరుసగా వీరందరిలో ఈ అంశాలను నమోదుచేశారు. ఈ పరిశోధనలో ఆసక్తికర అంశాలను కనుగొన్నారు.
– నిత్యం నిద్రపోయే సమయాల్లో కనీసం 90 నిమిషాలకు పైగా వ్యత్యాసం ఉన్నట్లుగా కనుగొన్నారు. అంటే ఒకరోజు 10 గంటలకు పడుకుంటే.. మరో రోజు 11 గంటలకు.. ఇంకో రోజు 12 గంటలకూ.. ఇలా సగటున 90 నిమిషాల కంటే అధిక వ్యత్యాసాన్ని గుర్తించారు.
– నిర్దిష్ఠంగా రోజూ ఒక సమయానికి నిద్రపోకుండా.. వేర్వేరు సమయాల్లో నిద్రపోతున్నట్లుగా తేలింది. ఇలా వారం రోజుల వ్యవధిలో సగటున 90 నిమిషాల కంటే అధిక వ్యత్యాసం ఉన్న వారిని అబ్‌నార్మల్‌గా పరిగణించారు. వారికి పరీక్షలు నిర్వహిస్తే గుండె, మెదడు, కాలి ప్రధాన రక్తనాళాల్లో పూడికలు ఏర్పడినట్లుగా నిర్ధారణ అయింది. తద్వారా గాడితప్పిన నిద్రకూ, రక్తనాళాల్లో పూడికలకు అవినాభావ సంబంధం ఉన్నట్లుగా పరిశోధకులు గుర్తించారు. అధ్యయన ఫలితాల ఆధారంగా నిపుణులు ముఖ్యమైన సూచనలు చేశారు.
ఆరేడు గంటలు నిద్ర తప్పనిసరి..
– రోజుకు కనీసం 6–7 గంటలు నిరంతరాయంగా నిద్ర ఉండడం చాలా అవసరం.
– రోజూ సుమారుగా ఒకే సమయంలో నిద్రపోవడం కూడా చాలా ముఖ్యం.
– రోజూ ఒకే సమయంలో నిద్రపోవడానికి 10–15 నిమిషాలు అటూఇటుగా ఉంటే పర్వాలేదు గానీ.. మరీ 2 గంటలు తేడా ఉండడం అస్సలు మంచిది కాదు.
– ఏ సమయంలో నిద్రించినా నిద్రాభంగం కలగకుండా ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలి.
మానసికి ఒత్తిడి గుండెకు భారం..
– మనం ఏం తింటున్నామనేదే కాదు.. ఎందుకు తింటున్నామనేది కూడా గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనం చెబుతోంది. మనం ఆహారం ఎంత ప్రశాంతంగా తీసుకుంటున్నామనేది కూడా చాలా ముఖ్యమని మరో పరిశోధనలో వెల్లడైంది. ఆకలి వేసినప్పుడు తినడం సాధారణంగా అందరూ చేసేదే. అయితే ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటు ఉన్న కొందరు ఏమీ తోచక ఎప్పుడు పడితే అప్పుడు.. ఎంతబడితే అంత తినేస్తుంటారు. అతి తిండి అనర్థమే..
ఇష్టానుసారం తినడంపై ఫ్రాన్స్‌లోని ‘యూనివర్సిటీ హాస్పిటల్ ఆఫ్ నాన్సీ’ ప్రొఫెసర్లు 1,109 మందిపై అధ్యయనం చేశారు. వీరిలో సగటు వయసు 45 ఏళ్లు. ఈ అధ్యయన పత్రం ఇటీవలే ‘యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ’ వైద్య పత్రికలో ప్రచురితమైంది. సాధారణంగా గుండె రక్తనాళాలు సంకోచిస్తుంటాయి.. వ్యాకోచిస్తుంటాయి. అయితే మానసిక సమస్యల కారణంగా ఇష్టానుసారంగా ఆహారం తీసుకునే వారిలో.. గుండె రక్తనాళాల్లో వ్యాకోచ ప్రక్రియ మందగించింది. తద్వారా వీరిలో రక్తపోటు పెరగడంతోపాటు.. కాలక్రమంలో గుండె వైఫల్య సమస్య కూడా తలెత్తుతోందని గుర్తించారు. 13 ఏళ్ల పాటు జరిగిన పరిశోధనల్లో ఈ కీలక అంశాన్ని నిర్ధారించారు.