PM Modi : శాసన వ్యవస్థపై న్యాయ వ్యవస్థ జోక్యమేంటి అన్న ప్రశ్న ఇటీవల ఉత్పన్నమైంది. ఏపీలో ఒక అడుగు ముందుకేసి పాలనలో మీ పెత్తనమేమిటి? అని న్యాయవ్యవస్థనే ప్రశ్నించారు. జడ్జిలపై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. సాక్షాత్ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్ తమ్మినేని సీతారాం వంటి వారు సైతం స్థాయికి మించి వ్యాఖ్యానాలు చేశారు. అయితే ఏపీలో అంత రెచ్చిపోవడానికి కారణం.. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు కారణం. ఆయన మంత్రి పదవి చేపట్టిన తరువాత గతంలో ఎ‘న్నడూ లేని విధంగా న్యాయ వ్యవస్థపై దాడి జరిగింది.
భారత ప్రజాస్వామ్యం, రాజ్యాంగంలో కొలీజియం వ్యవస్థ ఉన్నతమైనది. అటువంటి వ్యవస్థ పైనే రిజుజు అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. జడ్జిలను వారే ఎంపిక చేసుకోవడం ఏమిటని ప్రశ్నించేవారు. జడ్జిల ఎంపికలో కేంద్ర ప్రభుత్వ ప్రాతినిధ్యం కూడా ఉండాలని డిమాండ్ చేసేవారు. కొలీజియం సిఫారసు చేసిన వారికి న్యాయశాఖ మంత్రి హోదాలో ఆమోదముద్ర వేయడంలో కూడా ఎడతెగని జాప్యం చేసేవారు. దీంతో న్యాయ వ్యవస్థ, కేంద్ర ప్రభుత్వం మధ్య ఘర్షణ వాతావరణానికి కారణమయ్యేవారు.

అయితే న్యాయశాఖ మంత్రి రిజుజు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా కేంద్ర పెద్దల నుంచి ఎటువంటి నియంత్రణ చర్యలు లేవు. దీంతో వారి ఆలోచనలకు తగ్గట్టు రిజుజు మాట్లాడుతున్నారని కన్ఫర్మ్ అయ్యింది. అంతటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నా ఆయన్ను మందలించడం వంటివి చేయలేదు. దీంతో ఆయన కూడా అడ్డూ అదుపూ లేకుండా మాట్లాడేవారు. అయితే లోలోపల ఏం జరిగిందో తెలియదు కానీ.. రాత్రికి రాత్రే రిజుజును పదవి నుంచి తొలగించారు. అప్రాధాన్య శాఖను కేటాయించారు.
అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో సెడన్ చేంజ్ కి కారణం ఏంటన్న చర్చ ప్రారంభమైంది. కర్నాటక ఎన్నికల్లో ఓటమి, మిగతా రాష్ట్రాల్లో ప్రతికూల పరిస్థితులు వెరసి ఈ మార్పునకు కారణంగా తెలుస్తోంది. ఇటువంటి సమయంలో న్యాయవ్యవస్థతో పెట్టుకుంటే కొన్నిరకాల ఇబ్బందులు వస్తాయని మోదీ కి తెలుసు. అందుకే రిజుజును తొలగించారు. కొత్త మంత్రిగా రాజస్తాన్ కు చెందిన మేఘ్‌వాల్‌ను నియమించారు. దీని వెనుక రాజకీయ సమీకరణాలు ఉన్నాయా లేవా అన్న సంగతి పక్కన పెడితే.. సుప్రీంకోర్టుతో ఘర్షణ పెట్టుకోవడం కన్నా.. స్మూత్ గా పని చేసుకుంటూ పోవడం మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా కనిపిస్తోందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.