Kerala Crime Files Review: ట్రీమింగ్: డిస్నీ ప్లస్ హాట్ స్టార్
తారాగణం: అజు వర్గీస్,లాల్, శ్రీజిత్,నవాస్, సంజు, జిన్స్, రూత్, దేవకి.
దర్శకుడు: అహ్మద్ కబీర్
నిర్మాత: రాహుల్ రిజి నాయర్
సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహెబ్
బ్యానర్: ఫస్ట్ ప్రింట్ స్టూడియోస్
ముందు మాట
సమాజంలో భిన్నమైన వ్యక్తులు ఉంటారు. ఇందులో అందరూ మంచివారు ఉండరు. అలాగని చెడ్డవారు కూడా ఉండరు.. అలాంటి చెడు ప్రవర్తన ఉన్నవారు నేరాలు చేస్తారు.. నేరాలు చేసిన వారు ఎప్పుడూ తప్పించుకోలేరు. వాళ్లు ఎక్కడ ఉన్నా సరే ఆ నేరంతాలకు ఫలితం వెతుక్కుంటూనే వస్తుంది. అయితే ఇలాంటి ఒక నేరస్థుడుని పట్టుకునేందుకు పోలీసులు తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుంది. పై అధికారుల నుంచి ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది. జనం నుంచి వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి అసహనాన్ని, అసంతృప్తిని దిగమింగాల్సి వస్తుంది. ఇక ఇలాంటి నేరాల తాలూకూ కథలతో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. వెబ్ సిరీస్ లు కూడా ఓటిటిని షేక్ చేశాయి. అయితే ఇలాంటి నేపథ్యం ఉన్న కేరళ క్రైమ్ ఫైల్స్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. ఇంతకీ ఇది ఎలా ఉందంటే..
ఇదీ కథ
కేరళలోని ఒక లాడ్జిలో ఒక యువతి హత్యకు గురవుతుంది. అయితే దీనికి సంబంధించిన సమాచారాన్ని లాడ్జి వ్యవహారాలు చూస్తే శరత్ ద్వారా సీఐ కురియన్(లాల్) కు తెలుస్తుంది.. ఆయన ఎస్ఐ మనోజ్ (అజూ వర్గీస్), కానిస్టేబుల్ ప్రదీప్, విను, సునీల్ ద్వారా అక్కడికి చేరుకుంటారు. విచారణ నిర్వహిస్తారు. నల్ల చొక్కా, తెల్ల లుంగీ, మెల్ల కన్నుతో ఉన్న ఒక వ్యక్తి ఆ యువతని లాడ్జికి తీసుకు వచ్చినట్టుగా శరత్ చెబుతాడు. అయితే లాడ్జిలో ఆ వ్యక్తి ఇచ్చిన అడ్రస్ సరైనది కాదని పోలీసులు తెలుసుకుంటారు. అయితే ఈ హత్యకు సంబంధించి పోలీసులు విచారణ చేయడంతో మృతురాలి పేరు స్వప్న అని.. ఆమె ఒక వేశ్య అని తెలుసుకుంటారు. స్వప్నను హత్య చేసింది సిజూ( శ్రీ జిత్ మహాదేవ్) అనే వ్యక్తి అని, ఆమెతో కలిసి అదే వృత్తి చేసే లతిక ( దేవకీ) ద్వారా తెలుస్తుంది. దీంతో సిజూ గురించి తీగలాగుతూ పోలీసులు మరింత ముందుకు వెళ్తారు. అయితే పేరు ఒక్కటే అతనికి అయినా మెల్లకన్ను లేదని కొందరు చెబుతారు. దీంతో పోలీసులు ఒక రకమైన అయోమయంలో పడిపోతారు. ఎప్పటికీ తమ అన్వేషణ కొనసాగిస్తారు
ఇక తన కూతురు ఆలనా పాలన చూసుకునే సీఐ, కొత్తగా పెళ్లయిన ఎస్సై, గర్భవతిగా ఉన్న భార్య గురించి ఒత్తిడి పడే కానిస్టేబుల్.. ఇలా పోలీసులకు కుటుంబ పరమైన ఒత్తిడి ఉంటుంది. ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఒత్తిడి వల్ల వారు త్వరగా ఈ కేసు కు సంబంధించిన నేరస్తుడిని పట్టుకొని కాస్త రిలాక్స్ అవ్వాలని అనుకుంటారు. ఇందులో భాగంగా కేసు దర్యాప్తుకు సంబంధించి ముందుకు వెళుతుంటారు. సిజూ కోసం గాలిస్తున్న సమయంలో ఇది తాము అనుకునేంత తేలికైన కేసు కాదని పోలీసులకు అర్థమవుతుంది. సిజూ ఎక్కడి వాడు? అతడి కుటుంబం ఎక్కడ ఉంది? సాక్షులు చెబుతున్నట్టు అతడికి మెల్ల కన్ను ఉందా? ఇలా వరుస చిక్కుముళ్ళు విప్పుకుంటూ కేసు విచారణ సాగించాలని పోలీసులు అనుకుంటారు.. అయితే సిజు కు శుభ్రంగా చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? పోలీసులు అతని పట్టుకోడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు? చివరికి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు? అనేది మిగిలిన కథ.
వాస్తవానికి ఈ సినిమాను ఒక హత్య కథ చుట్టూ అల్లుకున్న కథ రూపంలో తీశారు. ఇలాంటి క్రైమ్ సినిమాను ఉత్కంఠ భరితంగా తీయడం అంటే మామూలు విషయం కాదు. నేరస్తుడు చుట్టూ ఉన్న నేపథ్యం, దానిని ఛేదించేందుకు పోలీసులు ఏర్పాటు చేసుకున్న ప్రణాళిక.. ఇవన్నీ కూడా ప్రేక్షకుడిని సీట్ ఎడ్జ్ చివరిలో కూర్చోబెట్టాలి. ప్రేక్షకుడి మదిలో తలెత్తే అనేక సందేహాలకు సమాధానాలు ఇస్తూ కథను చాలా ఆసక్తికరంగా ముందుకు నడిపించాలి. అదే సమయంలో సినిమా సహజత్వానికి దగ్గరగా ఉండాలి.
అయితే వీటిలో ఈ వెబ్ సిరీస్ డైరెక్టర్ కు మంచి మార్కులు ఇవ్వచ్చు. కథలో పాత్రలు సందర్భానుసారంగా వస్తాయి. పాత్రలు తప్ప నటీనటులు పెద్దగా గుర్తుండరు. కూడా తమ పాత్ర పరిధి దాటి నటించలేదు. పాత్రలను తీర్చిదిద్దిన విధానం వల్ల మొదటి ఎపిసోడ్ నుంచి చివరి ఎపిసోడ్ వరకు చూడాలి అనిపిస్తుంది. పోలీసు ఉద్యోగంలో ఉన్న ఒత్తిళ్లను ఈ వెబ్ సిరీస్ లో దర్శకుడు చక్కగా చూపించాడు. పేరుకే క్రైమ్ అయినప్పటికీ ఎటువంటి వల్గర్ సీన్స్ లేవు. లాల్ సీనియర్ ఆర్టిస్ట్ అయినప్పటికీ.. ఎస్సై పాత్రలో అజు వర్గీస్ నటన చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సినిమా లొకేషన్లు కూడా చాలా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మెప్పిస్తుంది. జితిన్ ఫోటోగ్రఫీ ఈ సినిమాకు ప్రధాన బలం. మహేష్ భువనేంద్ర ఎడిటింగ్ బాగుంది.
ప్లస్ పాయింట్స్:
కథ+ కథనం. చిత్రీకరణ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అజు వర్గీస్ నటన.
మైనస్ పాంట్స్
మొదటి ఎపిసోడ్ కొంచెం సాగదీతగా అనిపిస్తుంది, పోలీసులు విచారణ జరుగుతున్నప్పుడు వారి కుటుంబ సభ్యుల ఆందోళన వెబ్ సిరీస్ స్పీడ్ కు బ్రేక్ వేస్తుంది. నేర విచారణ లో పోలీసులు అనుసరిస్తున్న తీరు ఔట్ ఆఫ్ ది బాక్స్ అనిపిస్తుంది.
రేటింగ్; 3/5