HomeజాతీయంKCR : కేసీఆర్‌ ‘మహా’ స్కెచ్‌.. మీకు అర్థమవుతుందా?

KCR : కేసీఆర్‌ ‘మహా’ స్కెచ్‌.. మీకు అర్థమవుతుందా?

KCR : రాజకీయ వ్యూహ రచనలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దిట్ట. ఇది చాలామంది ఒప్పుకునే నిజం. ఆ వ్యూహరచనే ఆయన తెలంగాణ సాధించేలా చేసింది. ఆ వ్యూహారచనే తెలంగాణకు రెండుసార్లు సీఎంను కూడా చేసింది. తాజాగా జాతీయ రాజకీయాలపై ఫోకస్‌ పెట్టిన గులాబీ బాస్‌.. తన దృష్టి ఎక్కువగా మహారాష్ట్రపై పెట్టారు. బీఆర్‌ఎస్‌ను మహారాష్ట్రలో బలోపేతం చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే మూడు బహిరంగ సభలు నిర్వహించారు. తాజాగా మహారాష్ట్రకు చెందిన వ్యక్తినే తన ప్రైవేటు సెక్యూరిటీగా పెట్టుకున్నారు. ఇటీవలి కాలంలో కేసీఆర్‌ తెలంగాణ కంటే ఎక్కువ ప్రాధాన్యత మహారాష్ట్రకే ఇస్తున్నారు.
రూ.లక్షన్నర వేతనంలో.. 
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రైవేట్‌ సెక్రటరీగా మహారాష్ట్రలోని అహ్మద్‌ నగర్‌కు చెందిన శరద్‌ మర్కడ్‌ బాబాసాహెబ్‌ నియమితులయ్యారు. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ యాక్టివిటీస్‌ను కేసీఆర్‌ ముమ్మరం చేసిన సమయంలో షేట్కారీ సంఘటన్‌కు చెందిన పలువురు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో చేరారు. శరద్‌ మర్కడ్‌ కూడా ఏప్రిల్‌ 1వ తేదీన బీఆర్‌ఎస్‌ పార్టీలో లాంఛనంగా చేరారు. పూణె యూనివర్సిటీ నుంచి డిగ్రీ, పీజీ పూర్తిచేసిన శరద్‌కు ఒక ఐటీ కంపెనీ జాబ్‌ ఆఫర్‌ ఇచ్చినా దాన్ని తిరస్కరించి బీఆర్‌ఎస్‌లో చేరారు. గత నెల 1వ తేదీన చేరిన ఆయనకు నెల రోజుల్లోనే సీఎం కేసీఆర్‌కు ప్రైవేట్‌ సెక్రటరీ పోస్టింగ్‌ ఇస్తూ చీఫ్‌ సెక్రటరీ శాంతికుమారి ఈ నెల 2న ఉత్తర్వులు జారీచేశారు.
ఆ అధికారం ఉపయోగించి.. 
ప్రైవేట్‌ సెక్రటరీలను నియమించుకోవడం ముఖ్యమంత్రి విచక్షణాధికారం అయినప్పటికీ మహారాష్ట్రకు చెందిన వ్యక్తిని నియమించుకోవడం చర్చలకు దారితీసింది. తెలంగాణ ప్రభుత్వ ఖజానా నుంచి నెలకు లక్షన్నర జీతం ఇచ్చే ప్రైవేటు సెక్రటరీ పోస్టుకు పార్టీకి చెందిన వ్యక్తిని నియమించుకోవడం వివాదాస్పదంగా మారింది. తెలంగాణ ప్రజలు కట్టిన పన్నుల నుంచి ఇచ్చే జీతాన్ని మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ రాజకీయ అవసరాల కోసం అక్కడి ప్రాంతానికి చెందిన వ్యక్తిని నియమించుకోవడాన్ని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి తప్పుపట్టారు. ప్రజాధనాన్ని పార్టీ అవసరాల కోసం వినియోగించుకోవడాన్ని ఎత్తిచూపారు.
తెలంగాణ వారిపై చిన్నచూపా..
తెలంగాణ అధికారులపై కేసీఆర్‌ చిన్నచూపు చూస్తార్న అపవాదు ఉంది. అత్యున్నత పదవులు తెలంగాణేతరులకు ఇవ్వడమే ఇందుకు నిదర్శనం. గతంలో సీఎస్‌గా పనిచేసిన సోమేశ్‌కుమార్, ప్రస్తుత ఇన్‌చార్జి డీజీపీ కూడా తెలంగాణయేతరులే. అర్హులైన తెలంగాణ క్యాడర్‌అధికారులు ఉన్నా.. కేసీఆర్‌ బిహారీలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. తాజాగా ప్రైవేటు సెక్రెటరీల విషయంలోనూ తెలంగాణ వారికంటే మహారాష్ట్ర వ్యక్తే నయమనుకున్నాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక యువత, నిరుద్యోగులపై కూడా చిన్నచూపు చూస్తున్నారి పలువురు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ వారు మినహా మిగతా వారంతా కేసీఆర్‌కు టాలెంటెడ్‌గా కనిపిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular