KCR Targets AP TDP: కేసీఆర్ ఏపీపై ప్రత్యేకంగా ఫోకస్ పెంచారా? ప్రధానంగా టీడీపీ నాయకులనే టార్గెట్ చేసుకున్నారా? గతంలో తనతో పనిచేసిన సహచరులను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారా? శ్రీకాకుళం, విజయనగరం, కడప జిల్లాలపై దృష్టిసారించారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కేసీఆర్ చర్యలు కూడా అటు దిశగా ఉన్నట్టు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. విజయదశమి సందర్భంగా కేసీఆర్ కొత్త పార్టీని ప్రకటించనున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా ప్రకటించడానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే జాతీయ పార్టీగా గుర్తింపు, మనుగడపై కేసీఆర్ పక్కా ప్లాన్ తో ముందుకెళుతున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తామన్న దీమా కేసీఆర్ లో ఉంది. అటు మహారాష్ట్ర, ఇటు కర్నాటకలో తెలుగు ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాలను ఎంపిక చేసుకున్న కేసీఆర్ అక్కడ పార్టీ నిర్మాణంపై ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే ఆ రెండు రాష్ట్రాలకు చెందిన రాజకీయ పక్షాల నేతలతో సమావేశమయ్యారు. కర్నాటకలో మాజీ ప్రధాని దేవేగౌడ, మాజీ సీఎం కుమారస్వామిని కలిసి చర్చించారు. అటు మహారాష్ట్రలో రైతు సంఘాల ప్రతినిధులను కలిసి చర్చలు జరిపారు. అయితే దాయాది తెలుగు రాష్ట్రమైన ఏపీలో మాత్రం ఏ రాజకీయ పక్షాన్ని కేసీఆర్ సంప్రదించిన దాఖలాలు లేవు.

అయితే ఏపీలో కేసీఆర్ పక్కా స్కెచ్ తో ముందుకెళుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కులం కార్డును ఉపయోగించి ఏపీలో బలపడాలని చూస్తున్నారు. కేసీఆర్ వెలమ సామాజికవర్గానికి చెందిన వారు. ఉత్తరాంధ్రలో వెలమలు అధికం. అందుకే ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలపై ఫోకస్ పెంచినట్టు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ నాన్ లోకల్ అన్న కామెంట్స్ వినిపించాయి. ఆయన పూర్వీకుల మూలాలు విజయనగరం జిల్లాలో ఉన్నాయని మీడియాలో కథనాలు వచ్చాయి. అప్పట్లో దీనిని అంతా లైట్ తీసుకున్నారు. అప్పటి ప్రచారాన్ని కేసీఆర్ ఒక అస్త్రంగా మలుచుకునే సందర్భాలైతే ఉన్నాయి. నేను మీ వాడినంటూ కులం కార్డు బయటకు తీసే అవకాశముంది. కొద్ది నెలల కిందట విశాఖలో పర్యటించిన కేసీఆర్ ను స్వాగతిస్తూ భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలిశాయి. దీని వెనుక వెలమ కుల సంఘాలు ఉన్నట్టు అప్పట్లో టాక్ వినిపించింది. అంటే ఈ పాటికే కేసీఆర్ వెలమ సంక్షేమ సంఘాలు, కుల సంఘాల ప్రతినిధులకు టచ్ లోకి వెళ్లుంటారన్న అనుమానాలున్నాయి. జకీయ వ్యూహాలు పన్నడంలో కేసీఆర్ మించిన ఘనాపాటి ఉండరు. ఎన్నో ఒడిదుడుకులు, సంక్షోభాలు చవిచూసినా.. తన వ్యూహాలతో టీఆర్ఎస్ ను ఈ స్థాయికి తీసుకురాగలిగారు.
ఎన్నడూ లేని విధంగా ఏపీలోని వైసీపీ సర్కారుపై తెలంగాణ మంత్రులు విమర్శలకు దిగుతున్నారు. ఇన్నాళ్లూ స్నేహ సంబంధాలు కొనసాగించిన వీరు ఒక్కసారిగా పరస్పరం విమర్శించుకుంటున్నారు. రాష్ట్రాల ప్రయోజనాలను పక్కన పెట్టి జగన్, కేసీఆర్ లు రాజకీయంగా సహకరించుకున్న సందర్భాలున్నాయి. అయితే ఇప్పడు తెలంగాణ మంత్రులు కొత్త పల్లవిని అందుకున్నారు. ఏపీలో వైసీపీ సర్కారు వైఫల్యాలను తెరపైకి తెస్తున్నారు. ఏపీ కంటే తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధే ఎక్కువ అని చెప్పుకొస్తున్నారు. దీంతో ఏపీలో వైసీపీ సర్కారులో కలవరపాటు ప్రారంభమైంది. అటు ప్రభుత్వ సలహదారుడు సజ్జల రామక్రిష్ణారెడ్డి తాము ఏ కూటమితోనూ వెళ్లమని.. మాది అంతా స్టైట్ ఫార్వర్డు అంటూ ప్రకటించారు. అక్కడితో ఆగకుండా కేసీఆర్ కుటుంబంలో విభేదాలున్నాయని ఆరోపించారు, దీంతో తెలంగాణ మంత్రులు సజ్జలపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. కానీ దానిపై వైసీపీ తగిన స్థాయిలో కౌంటర్ ఇవ్వలేకపోయింది.

కేసీఆర్ సుదీర్ఘ కాలం టీడీపీలో పనిచేశారు. చంద్రబాబుతో విభేదించి టీడీపీని వీడి టీఆర్ఎస్ స్థాపించారు. అయితే అప్పట్లో తనతో పనిచేసిన వారు.. రాజకీయంగా అవకాశాలు లేక సైలెంట్ గా ఉన్నవారితో కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అటు వెలమ సామాజికవర్గంతో పాటు హైదరాబాద్ లో షెటిల్అయిన ఉత్తరాంధ్ర ప్రజల ద్వారా జాతీయ పార్టీవిస్తరణకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఏపీలో ప్రాంతీయ విధ్వేషాలు రెచ్చగొట్టి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నారని కేసీఆర్ పై ఏపీ ప్రజలకు అభిప్రాయం ఉండిపోయింది. పైగా విభజన హామీల్లో భాగంగా ఏపీకి న్యాయబద్ధంగాదక్కాల్సిన వాటిని అందకుండా చేశారన్న ఆక్రోషం కూడా ఉంది. పైగా ఇక్కడ టీడీపీ బలం పుంజుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అటు జనసేనతో నడిస్తే గెలుపు ఖాయమన్న దీమా ఆ పార్టీ నేతల్లో ఉంది. అటువంటిది ఇప్పుడే పురుడుపోసుకున్న కొత్త పార్టీలోకి వెళ్లడం సహేతుకం కాదు అన్న అభిప్రాయంలో నేతలు ఉన్నారు. అయితే ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే నాలుగు..ఆపై ఎక్కువ రాష్ట్రాల్లో పోటీచేయాల్సి ఉంటుంది. అందుకే తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్నాటకలో వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగే అభ్యర్థుల కోసం కేసీఆర్ అన్వేషిస్తున్నట్టు తెలిసింది. ఏపీలో అయితే విజయనగరం, శ్రీకాకుళం, కడప, కర్నాటకలో తెలుగు ప్రాంతాలు, బెంగళూరు నగరం, మహారాష్ట్ర మరాఠ్వాడి ప్రాంతాల్లో పార్టీ విస్తరణ, అభ్యర్థులను రంగంలోకి దించేందుకు మాత్రం కేసీఆర్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.