Presidential Poll : రాష్ట్రపతి ఎన్నికలు రసకందాయంలో పడుతున్నాయి. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను ఖరారు చేయడంతో అందరిలోనూ ఉత్కంఠ పెరిగింది. యశ్వంత్ సిన్హా కూడా ఒకప్పటి బీజేపీ నేతనే కావడం కమలం పార్టీకి కలవరపెడుతోంది. దీంతోపాటు బీజేపీకి, ప్రతిపక్షాలకు మధ్య బలం 51 శాతం, 49 శాతమే ఉండడంతో ఒక్కరు హ్యాండ్ ఇచ్చినా పరిస్థితి తలకిందులయ్యే అవకాశం ఉంటుంది. వైసీపీ మద్దతు ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో కీలకంగా మారింది.

రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు అనూహ్యంగా టీఆర్ఎస్ మద్దతు లభించినట్టు తెలిసింది. బీజేపీపై ఒంటికాలిపై లేస్తున్న కేసీఆర్ రాష్ట్రపతి రేసులో మన తెలుగు వ్యక్తి వెంకయ్యనాయుడును నిలబెట్టినా కూడా బీజేపీ అభ్యర్థికి మద్దతిచ్చే పరిస్థితి లేదు. తెలంగాణలో బీజేపీతో సై అంటే సై అంటున్న టీఆర్ఎస్ ప్రస్తుతం విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకే ఓటేయడానికి రెడీ అయ్యింది.
కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తాజాగా యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ తో రెండు సార్లు ఫోన్ లో మాట్లాడారు. యశ్వంత్ కు కేసీఆర్ మద్దతు కోరారు. దీంతో కేసీఆర్ కూడా ఓకే చెప్పారని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు యశ్వంత్ సిన్హాకు అనుకూలంగా ఓటు వేయనున్నారు. ఒక పార్టీ సపోర్ట్ చేయడంతో విపక్షాలకు మద్దతు పెరిగింది.
ఇక బీజేపీ అభ్యర్థిగా ద్రౌపది ముర్మును బీజేపీ తాజాగా ప్రకటించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా ప్రకటించారు. రాష్ట్రపతి ఎస్టీ మహిళను చేయాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. ఝార్ఖండ్ మాజీ గవర్నర్ గా పనిచేసిన ద్రౌపది ముర్ము విశేష ప్రతిభాశాలి. మంత్రిగా, గవర్నర్ గా ఆమె రాణించారు. . రాష్ట్రపతి ఎన్నికలకు ఈనెల 15న నోటిఫికేషన్ జారీ చేయగా.. 29వ తేదీ వరకూ టైం ఉంది. పోలింగ్ జూలై 18న నిర్వహిస్తారు. జూలై 21న ఓట్ల లెక్కింపు చేస్తారు.