KCR Munugodu: సీఎం కేసీఆర్ తెలంగాణ యాసలో బూతులు తిట్టినా కూడా వినసొంపుగానే ఉంటాయి. తాజాగా మునుగోడు సభలో ఎన్నడూ లేనంతగా రెచ్చిపోయారు. రొచ్చురొచ్చుగా తిట్టేశారు. ఎవ్వరూ ఊహించని విధంగా పాత కేసీఆర్ ను గుర్తు చేశారు. ముఖ్యంగా బీజేపీని, మోడీని, అమిత్ షాపై కేసీఆర్ తిట్ల వర్షం కురిపించారు. తనదైన శైలిలో కడిగిపారేశారు. కేసీఆర్ తిట్టు చూసిన వారు మళ్లీ కేసీఆర్ ఫాం అందుకున్నాడని.. మునుపటి కేసీఆర్ ను గుర్తుకు తెచ్చాడని అంటున్నారు.

‘నీ మీద ఈడీ కేసులు పెడతం అంటున్నారు.. ఈడా.. బోడా.. రాబే అని నేను అన్న.. ఈడీవోడు వచ్చి నాకే చాయ్ తాగిపిచ్చి పోవాలే.. దొంగలు బయపడుతరు.. ధర్మంగా ఉన్నవాళ్లకు భయమెందుకు? ఏం పీక్కుంటావో పీక్కో.. ప్రజల కోసం ఆలోచించేవాళ్లు నీకు భయపడరు మోడీ.. నువ్ గోకినా.. గోకకున్నా నేను గోకుతా ’ అంటూ కేసీఆర్ మునుపటిలా తిట్ల వర్షం కురిపించారు. ఇది ప్రజస్వామ్యమా? అహంకారమా? బలుపా? అధికార మదంతోని కళ్లు మూసుకుపోయినయా? అని బీజేపీపై మండిపడ్డారు.
ఇక బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్ బావులకు మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేయాలన్న అంశాన్ని మునుగోడు సభలో కేసీఆర్ ప్రధానంగా తీసుకెళ్లారు. బీజేపీని గెలిపిస్తే మీ కరెంట్ బావుల వద్ద మీటర్లు పెడుతారు. అదే టీఆర్ఎస్ ను గెలిపిస్తే రైతు గెలుస్తడు అంటూ కేసీఆర్ సెంటిమెంట్ అస్త్రాన్ని బయటకు తీశాడు. కృష్ణా జలాలను పంచకుండా మోడీ అమిత్ షాలు మునుగోడు వస్తున్నారని.. ఎందుకు వస్తున్నావ్? అని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.
ఎరువుల ధరలు పెంచాలని.. కరెంటు ధర పెంచాలని.. గిట్టుబాటు ధర ఇవ్వొద్దన్నది బీజేపీ విధానమని.. రైతులు సాగు బంద్ చేస్తే సూట్ కేసులు పట్టుకొని కార్పొరేట్ పెద్దలు వచ్చి వ్యవసాయం చేస్తారట.. రైతులంతా కూలీలుగా మారి వారి వద్దే పనిచేయాలట.. ఇదే వారి కుట్ర అంటూ రైతు వ్యతిరేక బీజేపీని ఫోకస్ చేయాలని కేసీఆర్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
మునుగోడు ఎన్నికను మన జీవితాలకు ఎన్నిక అంటూ కేసీఆర్ సెంటిమెంట్ రాజేస్తున్నారు. మీటర్లు పెట్టే మోడీ కావాలా? మీటర్లు వద్దనే కేసీఆర్ కావాలా? తేల్చుకోవాలని.. దీనిపై నియోజకవర్గంలో చర్చించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. మోడీని ఓడించేందుకు కొత్త శత్రువు అవసరం లేదని.. ఆయన అహంకారమే అతడిని ఓడిస్తుందని కేసీఆర్ అన్నారు. బీజేపీ టక్కు టమారా విద్యలు చూసి మోసపోవద్దని పిలుపునిచ్చారు.
మునుగోడు సభతో కేసీఆర్ తన టార్గెట్ అక్కడ ఇదివరకు గెలిచిన కాంగ్రెస్ కాదని స్పష్టం చేశారు. మోడీ, బీజేపీనే టార్గెట్ చేసి విరుచుకుపడ్డారు. కేంద్రం విధానాలపై రైతులను, ప్రజలను రెచ్చగొట్టారు. ఇదే పంథాతో కేసీఆర్ ముందుకు వెళతాడని అర్థమవుతోంది.మునుగోడులో కనుక వర్కవుట్ అయితే వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇవే కేసీఆర్ కు అస్త్రాలుగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.