KCR PM Candidate: పిల్ల పుట్టక ముందే కుల్ల కుటిందట ఎనుకటికి ఎవరో.. తెలంగాణ రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రిని దేశానికి కాబోయే ప్రధాన మంత్రి కేసీఆర్ అంటూ ప్రెస్‌మీట్ పెట్టి మరీ ఊదరగొడుతున్న తీరు కూడా ‘ఆలూ లేదు చూలూలేదు.. కొడుకు పేరు సోమలింగం’ అన్నట్లుగా ఉన్నాయి. పార్టీ లేదు.. ఫ్రంటు లేదు.. అప్పుడే ప్రధాని అయినట్లు గులాబీ పార్టీ నేతలు ఇస్తున్నబిల్డప్ చూసి తెలంగాణ ప్రజలే నవ్వుకుంటున్నారు.

పార్టీ పెట్టక ముందే పదవి వచ్చినట్లు..
కేసీఆర్ చేస్తున్న జాతీయ రాజకీయం. జాతీయ స్థాయిలో మోదీ వ్యతిరేక ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలని ఆయన ఉబలాటపడుతున్నారే తప్ప.. ఇప్పటిదాకా ఆయనకు ఇతర జాతీయస్థాయి, ఇతర రాష్ట్రాల పార్టీల నుంచి ఎంత సంపూర్ణమైన మద్దతు లభించింది అనే సంగతి స్పష్టత లేదు. తొలి నుంచి దేశంలోని బీజేపీ యేతర పార్టీల మద్దతు కూడగట్టడం కోసం కాలికి బలపం కట్టుకుని తిరిగిన కేసీఆర్.. ఆ ప్రయత్నం విఫలం కావడంతో సొంతంగా జాతీయ పార్టీని స్థాపించాలని నిర్ణయానికి రావడం చూస్తే.. ఆయనకు ఇతరుల మద్దతు పెద్దగా లభించలేదని అర్థమవుతుంది. ఆ రకంగా జాతీయ రాజకీయాలపై ఆయనకు ఎంత ఉత్సాహం ఉన్నప్పటికీ ఇంకా అడుగులు సవ్యంగా పడనేలేదు. అయితే అప్పుడే .. దేశానికి కేసీఆర్ ఐదేళ్లు ప్రధానిగా పనిచేస్తే చాలు దేశం ముఖచిత్రం మొత్తం రూపు మారిపోతుంది అనే అతిశయమైన డైలాగులతో టీఆర్‌ఎస్ నాయకులు చర్చలు లేవదీస్తున్నారు.
ప్రధాని పదవి కోసమే రాజకీయం చేస్తున్నట్లు..
ముఖ్యమంత్రి కేసీఆర్ తాను దేశ గతిని మార్చేందుకే రాజకీయాల్లోకి పోవాలనుకుంటున్నట్లు బహిరంగ సభల్లో చెబుతున్నారు. తెలంగాణ మోడల్‌గా దేశ గతిని మారుస్తానని అంటున్నాడు. కానీ గులాబీ పార్టీ నేతలు మాత్రం ఆయన కేవలం ప్రధాన మంత్రి పదవి కోసమే రాజకీయాలు చేస్తున్నట్లు ప్రెస్‌మీట్లలో మాట్లాడుతున్నారు. కేసీఆర్ దేశం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నారా… ప్రధాని పదవి మీద ఆశతో ఈ ఎత్తుగడ వేస్తున్నారా అని అనుమానాలను ప్రజల్లో పుట్టిస్తున్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్‌లో చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనం.
గులాబీ బాస్‌ను పట్టించుకోని విపక్ష నేతలు..
ఇప్పటిదాకా జాతీయ స్థాయి ఇతర నాయకులు కేసీఆర్ ప్రాధాన్యాన్ని పెద్దగా గుర్తించడం లేదు. రెండు రోజుల కిందట మమతా బెనర్జీ జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయ ఫ్రంట్ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, మహారాష్ట్రకు చెందిన ఎన్‌సీపీ నేత శరద్ పవార్ పేర్లను ప్రస్తావించారే తప్ప కేసీఆర్ ఊసు కూడా ఎత్తలేదు. చూడబోతే కేసీఆర్ కలగంటున్న కాంగ్రెసేతర, బీజేపీ ఏతట కూటమి సాధ్యమయ్యేలా లేదు. అందుకే ఆయన జాతీయ పార్టీ పెట్టాలని అనుకుంటున్నట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
కూటమిలో కీలయమైనా..
కేసీఆర్ ఒకవేల బీజేపీ, కాంగ్రెస్ ఏతర పార్టీలతో కూటమి ఏర్పాటు చేసినా… అందులో కీలక నేతగా వ్యవహరించినా ప్రధాని అవుతాడన్న గ్యారెంటీ మాత్రం లేదు. ఎందుకంటే కూటమిలో ఉండే పశ్చిమబెంగాల్‌కు చెందిన తృణమూల్, మహారాష్ట్రలోని ఎన్‌సీపీలు జాతీయస్థాయిలో బలమైన పార్టీలుగా ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలు కూడా ఎక్కువే. తెలంగాణలో ఉన్నది కేవలం 17 లోక్‌సభ స్థానాలే. అన్ని సీట్లు గెలిచినా ఆయనను కూటమి ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడానికి మిగతా పార్టీలు అంగీకరిస్తాయని ఊహించడం కూడా కష్టంగా ఉంది. కేవలం 17 మంది ఎంపీలకు నాయకుడిగా మాత్రమే కేసీఆర్ పార్లమెంటులో అడుగు పెడతాడన్నది మాత్రం గ్యారెంటీ. మరి ఈ మాత్రానికే కేసీఆర్ కాబోయే ప్రధాని అని టీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడడం, ఆయన ప్రధాని కాగలరని ఎలా అనుకుంటున్నారో బోధపడడం లేదు.

పదవి కోసం పోటీ..
మోదీ వ్యతిరేక పార్టీలలో ఇంకా అనేకమంది సీనియర్ నాయకులు అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఎంపీల బలంతో ఉండగల అవకాశం మెండుగా ఉంది. నితీ‹శ్‌కుమార్, శరద్ పవార్, మమతా బెనర్జీ లాంటి వాళ్లు కూడా ఇప్పటిదాకా ప్రధాని పదవిపై తమ ఆశను బయట పెట్టడం లేదు. వారందరినీ కాదని కేసీఆర్‌ను ప్రధాని కుర్చీ ఎలా వరిస్తుంది అనేది మిలియన్ డాలర్ ప్రశ్న. ఆలుచూలు లేకుండానే ప్రధాని అయిపోతానని కేసీఆర్ అనుచరులతో మాటలు చెప్పిస్తే.. వాళ్లు ఊరుకుంటారా! కేసీఆర్‌ను దూరం పెట్టాలని అనుకుంటే మొదటికే మోసం జరిగే ప్రమాదమూ లేకపోలేదు. ఇవన్నీ కూడా ఆయన భజన చేస్తున్న పార్టీ నాయకులు ఆలోచించుకోవాలని పొలిటికల్ ఎనలిస్టులు సూచిస్తున్నారు.
జాతీయ పార్టీ పెట్టినా గెలవగలడా?
ఇక కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టినా.. తెలంగాణలో మినహా ఇతర రాష్ట్రాలలో ఎంపీ సీటుల గెలవగలడా అంటే కష్టమనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. టీఆర్‌ఎస్ మిత్ర పార్టీ ఎంఐఎం ఇతర రాష్ట్రాల్లో ముస్లిం ప్రాబల్యం ఉన్న చోట్ల ఎమ్మెల్యే సీట్లను గెలుస్తుంది. ఒకటి రెండు స్థానాల్లో ఎంపీ సీట్లు కూడా గెలిచే అవకాశం ఉంది. కానీ టీఆర్‌ఎస్ బీఆర్‌ఎస్‌గా మారినా ఒక్క సీటైనా గెలుస్తుందన్న గ్యారెంటీ, కనీసం డిపాజిట్ వస్తుందన్న భరోసా ఆ పార్టీ నేతలకే లేదు. పోనీ ఇతర పార్టీలు ఓడిపోయేంత ప్రభావం చూపుతుందా అంటే అదీ కష్టమే.. మరి ఏ ప్రాతిపదికన కేసీఆర్ ఇతర ప్రాంతాలలో తన జాతీయ పార్టీ తరఫున సొంతంగా ఎంపీలను గెలిపించుకోగలరు అనేది సందేహం. ఒకవేల ఇతర రాష్ట్రాలలో ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుని తన జాతీయ పార్టీ అభ్యర్థులను బరిలోకి దించే ఆలోచన ఉన్నట్లయితే.. అది ఏ మేరకు సాధ్యమవుతుందో ఊహించలేం.
ప్రభుభక్తి ప్రదర్శించేందుకే ప్రధాని వ్యాఖ్యలు..
ప్రభువును మించిన ప్రభుభక్తి ప్రదర్శించేందుకే టీఆర్‌ఎస్ నాయకులు పోటీ పడుతున్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే కేసీఆర్ ఈ దేశానికి ప్రధాని కావాల్సిందేనని అతిశయోక్తి వ్యాఖ్యలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. గులాబీ నేతల మాటలు విని తెలంగాణ ప్రజలే నవ్వుకునేలా ఉన్నాయంటున్నారు ఆ పార్టీ కిందిస్థాయి నేతలు.
Also Read: Grand Statue Of Netaji: టిఆర్ఎస్ నేత ఇచ్చిన రాయితోనే కొత్త పార్లమెంట్ లో నేతాజీ విగ్రహం
[…] […]