KCR Jagan : ఆ ఇద్దరూ ముఖ్యమంత్రులే.. కాకపోతే ఒకరు సీనియర్.. ఒకరు జూనియర్.. కానీ ఇద్దరి ఆలోచనా విధానం ఒక్కటే. ఒకరి పథకాలను ఒకరు అమలు చేస్తున్నారు. ప్రత్యర్థులను బలహీన పర్చడంలోనూ ఇద్దరి ఆలోచన ఒక్కటే. ఇద్దరూ ఒకే బాటలో ప్రయాణం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. చాలా విషయాల్లో ఇద్దరు ఒకే విధంగా రియాక్ట్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. సొంత పార్టీ నేతలపై ఇద్దరి వ్యవహారశైలి ఒకే విధంగా ఉన్నట్లుగా తాజా రాజకీయ పరిణామాలతో అర్థమవుతుంది.

ఆనం వ్యాఖ్యలతో జగన్ షాకింగ్ నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి, సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపించిన ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి విషయంలో జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల రాష్ట్రంలో ముందస్తుగానే ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఒకవేళ అలా ఎన్నికలు వస్తే తామంతా ఇంటికి వెళ్లడం ఖాయమని ఆనం రామనారాయణరెడ్డి బాహాటంగానే వ్యాఖ్యలు చేశారు. సైదాపురం మండలంలో సచివాలయాల నిర్మాణాలు సరిగా జరగడం లేదని కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని, సొంత డబ్బులు పెట్టి సచివాలయాలు కడితే బిల్లులు రావని కాంట్రాక్టర్లు వెనుకడుగు వేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఏం పని చేశామని ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడగాలి అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలతో సైలెంట్‌గా ఆయనకు షాక్ ఇచ్చిన సీఎం జగన్. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డిని నియమించారు. దీంతో పొమ్మనకుండా పొగ పెట్టారు.
తెలంగాణలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పొంగులేటి వ్యాఖ్యలు..
తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా సైలెంట్‌గా నే టార్గెట్ చేశారు. కొద్ది రోజుల క్రితం తన అనుచరులతో సమావేశం నిర్వహించిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని తేల్చి చెప్పారు. అయితే ఏ పార్టీ నుంచి అనేది మాత్రం ఇంకా ఇప్పుడే చెప్పలేనని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ పార్టీలో తనకు లభిస్తుంది ఏమిటి అన్న విషయాన్ని అందరూ చూస్తూనే ఉన్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భద్రత తగ్గించిన కేసీఆర్..
పొంగులేటి చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన పార్టీ మారతారని సంకేతం ఇవ్వడంతో సైలెంట్‌గా స్టెప్ వేశారు సీఎం కేసీఆర్. పొంగులేటికి భద్రతను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి త్రీ ప్లస్ త్రీ భద్రత ఉండగా దాఆనిని టు ప్లస్ టు కి తగ్గించారు. ఎస్కార్ట్ వాహనాన్ని కూడా తొలగించారు. ఉన్నట్టుండి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పై ఈ నిర్ణయం తీసుకోవడం ఆయనకు కూడా పొమ్మనకుండా పొగ పెట్టడమే అని చర్చ జరుగుతుంది.
మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు తిరుగుబాటు చేసే అవకాశం ఉన్న నాయకులకు చెక్ పెట్టడంతో ఈ విషయంలో కేసీఆర్, జగన్ ఇద్దరూ ఒకటే అన్న చర్చ జరుగుతోంది. సొంత పార్టీ నేతలను కట్టడి చేయడానికి నోటితో చెప్పకుండా చేతల్లో చూపించిన ఇరువురు నేతల తీరును ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. మొన్న జగన్ తీసుకున్న నిర్ణయాన్నే నిన్న కేసీఆర్ కూడా తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.