KCR – Jagan Friendship: “నేను గిచ్చినట్టు చేస్తా…నువ్వు ఏడ్చినట్టు చేయ్..” ఇప్పుడు ఇదే ఫార్ములాను గులాబీ పార్టీ, ఫ్యాన్ పార్టీ అమలు చేస్తున్నాయి. ఆటు ఆంధ్రాలో.. ఇటు తెలంగాణలో తమ ప్రభుత్వాల ఏర్పాటుకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నాయి. ఇదే క్రమంలో గత ఎన్నికల్లో జగన్ కు అందించిన స్నేహ హస్తాన్ని… ఈసారి కూడా ఇవ్వాలనే యోచనతో కేసీఆర్ ఉన్నారు. అప్పట్లో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తే… ఈసారి భారత రాష్ట్ర సమితి రూపంలో మరిన్ని మేళ్ళను అందించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. వాస్తవానికి ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య గ్యాప్ ఉన్నట్టు కలరింగ్ ఇస్తున్నారు… ఇతర పార్టీల నాయకులు కూడా వాళ్ళ ట్రాప్ లో పడేందుకు ఇరు రాష్ట్రాలకు చెందిన సమస్యలను మరింత జటిలం చేస్తున్నారు.. దీనివల్ల అసలు సమస్యలను వదిలిపెట్టి ప్రతిపక్షాలు వీటిని పట్టుకునే వేలాడుతున్నాయి.. దీంతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ పనులు తాము చేసుకుంటున్నారు.

తెరపైన కత్తులు
జాతీయ పార్టీ అంటూ ఏపీలో అడుగు పెట్టిన బీఆర్ఎస్… ఏపీకి అన్యాయం చేసిన వారు రాష్ట్రంలో ఎలా అడుగు పెడతారో చూస్తా అంటున్న వైసిపి… రెండు పార్టీల డైలాగులు చూస్తుంటే బస్తీమే సవాల్ అంటున్నాయనేంత తీవ్రత కనిపిస్తోంది. రణరంగంలో తీవ్రస్థాయిలో పోరాటానికి సిద్ధమయ్యారనిపిస్తుంది. కానీ తెర వెనుక జరుగుతున్నది ఇందుకు పూర్తి విరుద్ధం. ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా వీరి కార్యాచరణ సాగుతోంది.. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల చీలిక ద్వారా వైఎస్ఆర్సిపి… తెలంగాణలో ఓట్లను సంఘటితం చేయడం ద్వారా భారత రాష్ట్ర సమితి… ఇలా ఇరు పార్టీలు లబ్ధి పొందాలన్న వ్యూహం తెరపైన కనిపిస్తోంది.. జరుగుతున్న పరిణామాలు, రెండు పార్టీల మధ్య మాటల మంటలు, భారత రాష్ట్ర సమితిలో చేరిన నేతల జాబితా ఈ వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది..
తెలంగాణ అనే పదాన్ని తొలగించడం వెనుక కారణమదే
దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించేందుకు తెలంగాణ అనే పదాన్ని తొలగించి భారత్ అనే పదాన్ని చేర్చిన కేసీఆర్… భారత రాష్ట్ర సమితి తొలి ప్రస్థానాన్ని ఆంధ్ర ప్రదేశ్ లో ప్రారంభించారు.. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసిన స్థాయి ఉన్న నేతలు భారత రాష్ట్ర సమితిలో చేరింది తొలుత ఆంధ్ర ప్రదేశ్ నుంచే.. అయితే ఆ చేరికలు, ప్రస్తుతం ఇరు పార్టీల నేతల మధ్య నడుస్తున్న మాటలు యుద్ధం… అన్ని కూడా అంతర్గత ప్రయోజనం కోసమేననే సంకేతాలు వెలువడుతున్నాయి.. వాస్తవానికి భారత రాష్ట్ర సమితి పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు పెద్దగా వ్యాఖ్యలు ఏమీ చేయలేదు.. దీనిపై చంద్రబాబు నాయుడిని స్పందన అడిగితే ఒక చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు.. పవన్ కళ్యాణ్ కూడా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.. కానీ వైయస్ఆర్సీపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలు మళ్లీ కలవాలని తాము ఆకాంక్షిస్తున్నట్టు మాట్లాడారు.. విభజన జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల కలయిక అంశం ప్రస్తుతం అసాధ్యం అని తెలిసినప్పటికీ కూడా సజ్జల ఒక వ్యాఖ్యానం మాత్రం చేశారు.. ఆ వెంటనే తెలంగాణలోని భారత రాష్ట్ర సమితి నాయకులు వైఎస్ఆర్సిపి నాయకులపై విరుచుకుపడ్డారు..ఏపీ మంత్రులు రోజా, గుడివాడ అమర్నాథ్ భారత రాష్ట్ర సమితి పై మళ్ళీ విమర్శల దాడి మొదలుపెట్టారు.. రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీ మళ్లీ ఏపీలో ఎలా అడుగుపెడుతుందని ఒకరు, రాష్ట్ర విభజనకు కారణమైన పార్టీ మళ్లీ ఎలా వస్తుందో చూస్తామని మరొకరు వ్యాఖ్యానించారు.. అయితే ఈ వ్యాఖ్యలు ఆయా రాష్ట్రాల ప్రయోజనాల కోసమేనా? అంటే లోగుట్టు వేరే ఉందని అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్సిపి వ్యతిరేక ఓటును చీల్చడమే భారత రాష్ట్ర సమితి లక్ష్యం అని అంటున్నారు.. వైఎస్ఆర్సిపి ని తిట్టడం ద్వారా ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఓటును తన ఖాతాలో తెచ్చుకోవాలని భారత రాష్ట్ర సమితి యోచన.. వైఎస్ఆర్సిపి ఆకాంక్ష కూడా అదే.. దిగజారి పోతున్న ప్రతిష్ట, వేగంగా పెరిగిపోతున్న ప్రభుత్వ వ్యతిరేకతలు నుంచి గట్టెక్కెందుకు అన్ని మార్గాలనూ ప్రయత్నిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈ మార్గాన్ని కూడా ఎంచుకున్నారు.. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీల్చడం, ప్రధాన ప్రతిపక్షమైన టిడిపికి వచ్చే ఓటు బ్యాంకు కు ఎంతో కొంత చిల్లు పెట్టడం వంటి వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.
ఆ కులాలపై కన్ను
భారత రాష్ట్ర సమితిలో చేర్చుకున్న నేతల జాబితాను పరిశీలిస్తే దాని వెనుక ఉన్న వ్యూహం కూడా స్పష్టమవుతున్నది.. గతంలో ప్రజారాజ్యం, వైఎస్ఆర్సిపి, జనసేన నుంచి పోటీ చేసిన మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, అదే సమయంలో అనకాపల్లి నుంచి గత ఎన్నికల్లో పార్లమెంట్ కు పోటీ చేసిన చింతల పార్థసారథి భారత రాష్ట్ర సమితిలో చేరారు.. వీరితోపాటు పలువురు చిన్న స్థాయి నేతలు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం విశేషం.. వీరే కాకుండా ఎస్సీ సామాజిక వర్గం నుంచి రావెల కిషోర్ బాబు కూడా చేరారు.. ఈ రెండు వర్గాల్లో ఒక వర్గం వైఎస్ఆర్సిపి కి పూర్తి దూరం. ఆ వర్గానికి చెందిన ఓట్లు అత్యధికం పవన్ కళ్యాణ్ కు, కొద్దో గొప్పో తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం ఉంది.. ఈ ఓట్లలో కొన్ని భారత రాష్ట్ర సమితి అభ్యర్థులు గనుక సాధిస్తే తమ వ్యతిరేక ఓటు చీలుతుందనేది వైసిపి ఆలోచన.. ఇక మరో వర్గం గత ఎన్నికల్లో జగన్ కు అండగా నిలిచింది. అయితే ఈసారి ఆ వర్గం జగన్ పై తీవ్ర వ్యతిరేకత కనబరుస్తోంది.. ఆ వర్గం ఓట్లు తెలుగుదేశం వైపు మళ్లకుండా భారత రాష్ట్ర సమితి నాయకులు చీల్చగలిగితే అధికారం తమదే అని వైఎస్ఆర్సిపి నాయకులు ధీమాతో ఉన్నారు… తెర వెనుక ఇన్ని వ్యూహాలు ఉన్నాయి కాబట్టే తెర పైన పరస్పరం శత్రుత్వం నటిస్తున్నారు.