Pawan Kalyan KA Paul: మన టాలీవుడ్ లో ఒక్కో దర్శకుడికి ఒక్కో రకమైన కామెడీ టైమింగ్ ఉంది. అప్పట్లో ‘జంధ్యాల’ కామెడీ బూతులు లేకుండా సమాయనుకూలంగా.. సందర్భానుసారం చేసే కామెడీకి జనాలు పగలబడి నవ్వుకున్నారు. ఆ తర్వాత ఈవీవీ సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి కామెడీని ఎంజాయ్ చేశారు. వారి తర్వాత నేడు ‘అనిల్ రావిపూడి’ ఎఫ్2, ఎఫ్3తో తనదైన హెల్డీ కామెడీని పండిస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నారు.

ఇక సినిమాల్లోనేనా కామెడీ..! ఏం రాజకీయాల్లో ఉండకూడదా? అని మన ‘కేఏ పాల్’ బయలు దేరారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మన ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్ రాజకీయాల్లో చేసిన కామెడీని జనాలు, రాజకీయ పార్టీలు తెగ ఎంజాయ్ చేశారు. అంతటి హాట్ సమ్మర్ లో కేఏ పాల్ ప్రచార కామెడీ జనాలకు కాస్త కూల్ నెస్ ను పంచింది.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో పత్తా లేకుండా ఓడిపోవడంతో అమెరికా వెళ్లిపోయిన కేఏ పాల్ తాజాగా సడెన్ గా ఊడిపడ్డాడు. మొన్నటివరకూ తెలంగాణలో టీఆర్ఎస్ తో పెట్టుకొని ‘ఫాఫం’ చెంపదెబ్బలు తిన్న పాల్ గారూ.. ఇప్పుడు ఏపీపై పడ్డారు. ఎందుకో ఆయన పవన్ కళ్యాణ్ ను తక్కువగా అంచనావేస్తూ ఏకంగా ఓ భారీ బంపర్ ఆఫర్ ఇచ్చారు. అదే ఇప్పుడు చర్చనీయాంశమైంది.
మాట్లాడితే ‘లక్ష కోట్లు ఇవ్వాలా’.. జోబైడెన్ తో మాట్లాడా.. మోడీ, అమిత్ షా పిలిచారని పెద్ద పెద్ద డైలాగులు పేల్చే పాల్ శక్తి సామర్థ్యాలు ఎప్పుడూ నిరూపితం కాలేదు.. ఆయన మాటలను మాత్రం జనాలు లైట్ తీసుకొని కామెడీ యాంగిల్ లోనే చూస్తారు. తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ కు ‘కేఏ పాల్’ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. అదే ఇప్పుడు వైరల్ గా మారింది.
జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 1000 కోట్ల ఆఫర్ ఇచ్చాడు మన కేఏ పాల్. దాని కోసం పవన్ కళ్యాణ్ ఏం చేయాలంటే.. ఏపీలో భూతద్దం పెట్టినా కనపడని ఆయన పార్టీ ‘ప్రజాశాంతి’లో చేరాలట…. అలా చేరితే ఎంపీగానో.. ఎమ్మెల్యేగానో గెలిపిస్తానని కేఏ పాల్ హామీ కూడా ఇచ్చేశారు. ఒకవేళ గెలిపించకపోతే రూ.1000 కోట్లు నష్టపరిహారంగా పవన్ కళ్యాణ్ కు ఇస్తాడట.. పవన్ కళ్యాణ్ సొంతంగా పోటీచేసినా.. ఇతర పార్టీల మద్దతుతో పోటీచేసినా గెలవడని కేఏ పాల్ ఎద్దేవా చేశారు.
రూ.1000 కోట్లు కాదు కదా.. లక్ష కోట్లు కుమ్మరించిన కేఏపాల్ కు ఏపీలో ఒక్కటంటే ఒక్క ఓటు కూడా రాదనడంలో ఎలాంటి సందేహం లేదు. ‘అలాంటిది పవన్ ను గెలిపిస్తావా? పాలూ’ అంటూ జనసేన అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. ‘అవసరార్థం రాజకీయాల్లో పావుగా మారి రాజకీయాలు చేస్తాడన్న అపప్రద మన కేఏ పాల్ పై ఉంది. ఆయన కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలుస్తాడో లేదో కానీ మా పవన్ కళ్యాణ్ ను గెలిపిస్తాడట? ’ అని జనసైనికులు విమర్శలు గుప్పిస్తున్నారు. ముందు నువ్వు గెలిచి చూపించు అని సవాల్ చేస్తున్నారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ కు కేఏ పాల్ ఇచ్చిన రూ.1000 కోట్ల ఆఫర్ మాత్రం అభాసుపాలైంది.