Jupally Krishna Rao: జూపల్లీ ఎంట్రీతో కాంగ్రెస్ పాలమూర్ పాలిటిక్స్ ఏం మారనున్నాయి?

బీఆర్‌ఎస్‌కు చెందిన కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఇప్పటికే పాలమూరులో బీఆర్‌ఎస్‌కు పట్టు అంతంతే. ఇప్పటికీ అక్కడ కాంగ్రెస్‌ క్యాడర్‌ బలంగా ఉంది.

Written By: Raj Shekar, Updated On : August 2, 2023 1:22 pm

Jupally Krishna Rao

Follow us on

Jupally Krishna Rao: ఇటీవల కాలంలో తెలంగాణ కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పెరగడంతో బీఆర్‌ఎస్, బీజేపీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఈ చేరికలతో కాంగ్రెస్‌ మరింతగా బలపడటంతో పాటు, ప్రజల్లోకి ఆ పార్టీ అధికారంలోకి రాబోతుందనే సంకేతాలు వెళ్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల కాంగ్రెస్‌లో చేరగా, అదే సమయంలో పార్టీలో చేరాలని భావించిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం(ఆగస్టు 2న) కాంగ్రెస్‌ లో చేరబోతున్నారు.

జూపల్లి వెంట కీలక నేతలు..
ఇదిలా ఉండగా, జూపల్లి కృష్ణారావుతోపాటు, కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, వనపర్తి పెద్ద మందడి ఎంపీపీ మేఘారెడ్డి, కిచ్చారెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి కుమారుడు రాజేశ్వర్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. వీరంతా మంగళవారం రాత్రే ఢిల్లీకి చేరుకున్నారు. వీరి వెంట పాలమూరు జిల్లాకు చెందిన ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్, పీసీసీ ఉపాధ్యక్షుడు, పార్టీ సీనియర్‌ నేత మల్లురవి ఉన్నారు. బుధవారం వీరంతా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖరే సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకోబోతున్నారు.

మారనున్న పాలమూరు రాజకీయాలు..
బీఆర్‌ఎస్‌కు చెందిన కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఇప్పటికే పాలమూరులో బీఆర్‌ఎస్‌కు పట్టు అంతంతే. ఇప్పటికీ అక్కడ కాంగ్రెస్‌ క్యాడర్‌ బలంగా ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌కు చెందిన కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరడంతో పార్టీ మరింత బలపడుతుందని టీపీసీసీ భావిస్తోంది.

జూపల్లికి మంచి పట్టు..
జూపల్లి కృష్ణారావుకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో మంచి పట్టు ఉంది. బీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జూపల్లి బీఆర్‌ఎస్‌పై తన వర్గానికి చెందిన వారిని రెబల్‌గా నిలబెట్టి గెలిపించారు. ఇదే సమయంలో కృష్ణారావుపై గెలిచిన బీరం హర్షవర్ధన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరారు. వరుస ఘటనలతో కేసీఆర్‌ జూపల్లిని పక్కన పెట్టారు. కొన్నేళ్లు పార్టీకి దూరంగా ఉన్న ఆయన ఇటీవలే తిరుగుబాటు చేశారు. దీంతో అతడిని బీఆర్‌ఎస సస్పెండ్‌ చేసింది. దీంతో కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. మంత్రిగా పనిచేసిన జూపల్లికి ఉమ్మడి పాలమూరు జిల్లాలో పట్టు ఉంది. 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన బీఆర్‌ఎస్‌ నేతలు ఆయనతో టచ్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి జూపల్లి ప్రభావం కచ్చితంగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉంటే.. కాంగ్రెస్‌లో వీరికి ఎంతవరకు ప్రాధాన్యం దక్కుతుంది .? ఏ పదవులు సీట్లు విషయమే కాంగ్రెస్‌ పెద్దల నుంచి హామీ లభించబోతుంది అనేది తెలియాల్సి ఉంది. ఈనెల రెండవ వారంలో తెలంగాణలో కాంగ్రెస్‌ భారీ సభను నిర్వహించాలనే ప్లాన్‌లో ఈ నేతలు ఉన్నారు. ఈ సభలోనూ అంతే భారీగా చేరికలు ఉండే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు.