Economic Recession Cuts Jobs :’ ఏరు దాటకముందు ఓడ మల్లప్ప ఏరు దాటినంక బోడ మల్లప్ప’ అనే రీతిలో ప్రైవేట్ కంపెనీలు వ్యవహరిస్తున్నాయి. ఇటీవల కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగులను ఇంటికి సాగనంపే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాయి . ఉద్యోగులతో రాత్రింబవళ్లు పని చేయించుకుని లాభాలు గడించిన సంస్థలు.. ఉద్యోగులకు జీతం తప్ప.. లాభాల్లో చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా నష్టాలు వచ్చాయని ఉద్యోగులను తీసివేయడం ఎంతవరకు సమంజసం..కంపెనీ నష్టాల్లో ఉందని ఏదో ఒక కారణం చెప్పి ఉద్యోగులను టార్చర్ పెట్టి బయటికి నెట్టేస్తున్నారు. ఆయా కంపెనీలో ఐదు నుంచి పది సంవత్సరాల నుంచి పని చేసినప్పటికీ.. ఉన్నఫలంగా ఉద్యోగం నుంచి తీసేస్తే.. వారు చదివిన చదువులకు ఏ ఉద్యోగం దొరకక, ఒకవేళ చిన్నపాటి ఉద్యోగం దొరికిన
నా వారిచ్చే జీతం సరిపోక రోడ్డున పడుతున్నారు.దీంతో తనపై ఆధారపడిన కుటుంబాన్ని పోషించుకోలేక కొంతమంది ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. ఎంతో కష్టపడి చదివి పట్టాలు సాధించిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు, ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగులకు నిరాశే మిగులుతోంది. ప్రముఖ సామాజిక దిగ్గజ సంస్థ ట్విట్టర్ ఇటీవల కొంతమంది ఉద్యోగులను తీసివేసి ఇంటికి సాగనంపింది. అదే బాటలో ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో, ప్రధాన పత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సంస్థలు కంపెనీలు,ఉద్యోగులను తీసివేయడాన్ని టీవీల్లో వార్తాపత్రికల్లో తరచు చూస్తూనే ఉన్నాం.

– ఉద్యోగుల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం :
ఆయా కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధించి తక్కువ మందితో ఎక్కువ పని చేయిస్తూ ఉండడంతో పని భారం ఎక్కువ వారు మానసికంగా కృంగిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పని ఒత్తిడితో ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం ఏర్పడుతుందని చెబుతున్నారు.ముఖ్యంగా నిద్రలేమితో అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుమడుతున్నాయని వాపోతున్నారు . ఇటీవల కొంతమంది ఉద్యోగులు పనిచేస్తున్న ఆఫీసుల్లో గుండెపోటుతో కుర్చీలోనే కుప్పకూలడం చూస్తూనే ఉన్నాం. 30నుంచి 40 ఏళ్లలోపు వయసు గల ఉద్యోగులు గుండెపోటుతో చనిపోవడంతో కుటుంబం వీధిన పడడం చూస్తే గుండె తరుక్కుపోతోంది. కొంతమంది దీర్ఘకాలిక వ్యాధులైన బీపీ షుగర్ బారిన పడుతున్నారు. ఎంత సంపాదించినా నాలుగు కాలాల పాటు ఆరోగ్యంగా,సుఖంగా బతక లేని పరిస్థితులు నేడు దర్శనమిస్తున్నాయి. ఉన్నఫళంగా ఉద్యోగం ఊడితే కొంతమంది దిక్కుతోచక ఇంటి బాట పట్టి వ్యవసాయం, పాల వ్యాపారం, కోళ్ల పెంపకం, గొర్రెల పెంపకం, చిన్న చిన్న వృత్తి వ్యాపారాలు చేపట్టి ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా ఆరోగ్యంగా,ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రైవేట్ కంపెనీలు ఏదో ఒక సాకుతో ఉద్యోగాల్లో కోత విధించడం చూస్తుంటే.. ప్రైవేట్ కంపెనీలో ఇక ఎప్పటికీ ఉద్యోగ భద్రత ఉండదని తేటతెల్లమవుతోంది.
-పట్నం వద్దు.. పల్లెలే ముద్దు..
పెద్ద పెద్ద చదువులు చదివి ఒకడి కింద బానిసలా కష్టపడుతూ బతికే బదులు… ఉన్న ఊళ్లోనే ఏదో ఒక వ్యాపారం చేసి ఆర్థికంగా అభివృద్ధి చెంది నాలుగు కాలాలపాటు కుటుంబ సభ్యులతో కలిసి సుఖంగా,ఆరోగ్యంగా జీవించవచ్చునునే నగ్న సత్యాన్ని నేటి యువతరం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ‘పట్నం వద్దు.. పల్లెలే ముద్దు’ అని అనుభవజ్ఞులు,మేధావులు సూచిస్తున్నారు. ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగమైన, ప్రైవేటు ఉద్యోగమైన వాచ్మెన్ లా రాత్రింబవళ్లు పని చేయాల్సిందే.. నిద్రలేమికి గురై దీర్ఘకాలిక వ్యాధులైన బిపి షుగర్ తెచ్చుకోవాల్సిందేనని అనుభవజ్ఞులు హెచ్చరిస్తున్నారు.
– కోటి విద్యలు కూటి కోసమే..:
నేను పీజీ చేసిన, నేను ఇంజనీరింగ్ చేసిన, నేను డిగ్రీ చేసిన… నేనే ఎంసీఏ, ఎంబీఏ చేసిన… నేను వ్యవసాయం చేయాలా… నేను వ్యాపారం చేయాలా.. అనే ఈగోను పక్కనపెట్టి విజ్ఞానంతో తను ఎంచుకున్న రంగంలో కష్టపడి అభివృద్ధి సాధించి రాబోయే తరానికి ఆదర్శంగా నిలవాలని మేధావులు అనుభవజ్ఞులు నేటి యువతరానికి పదేపదే కుండ బద్దలు కొట్టి చెప్తున్నారు..
-పిల్లి రవి