Pawan Varahi Yatra : జనసేనాని సమరశంఖం పూరించనున్నారు. నేరుగా ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టనున్నారు. ఈ నెల 14 నుంచి వారాహి యాత్ర ప్రారంభం కానుంది. అన్నవరం సత్యదేవుని సన్నిధిలో పూజలు అనంతరం యాత్రకు సిద్ధమవుతారు. గత కొంతకాలంగా వారాహి యాత్రపై పుకార్లు షికార్లు చేశాయి. కానీ ఎట్టకేలకు వారాహి యాత్ర షెడ్యూల్ ను పార్టీ హై కమాండ్ ప్రకటించింది అందరి అంచనాలకు భిన్నంగా గోదావరి జిల్లాల నుంచి యాత్ర ప్రారంభిస్తుండడం విశేషం.
ప్రస్తుతం పవన్ సినిమాల్లో బిజీగా ఉన్నారు. చేతిలో సినిమాలు ఉన్నాయి. తొలుత డిసెంబరులో యాత్ర ప్రారంభిస్తారని ప్రచారం సాగింది. సంక్రాంతి తరువాత షెడ్యూల్ ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. ఇప్పటికే పార్టీ ఆవిర్భావ సభకు వారాహి రోడ్డుపైకి వచ్చింది. కొద్దిసేపు వారాహిపై కూర్చొని అలరించారు. ఇప్పుడు అదే వాహనంపై యాత్రకు సిద్ధపడుతున్నారు. దీని కోసం రూట్ మ్యాప్ ను సిద్ధంచేసుకున్నారు. జనసైనికులు ఎప్పుడు ఎప్పుడా? అని ఎదురు చూస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ రోజు రానే వచ్చింది.
యాత్రపై జనసేన పీఏసీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా నేతలతో సమావేశమయ్యారు. అనంతరం షెడ్యూల్ ప్రకటించారు. జూన్ 14నుంచి వారాహిపై పవన్ కల్యాణ్ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరంలో రత్నగిరిపై కొలువైన సత్యనారాయణ స్వామి సన్నిధిలో వారాహికి పూజలు చేయనున్నారు. స్వామివారి దర్శనం అనంతరం యాత్ర ప్రారంభించనున్నారు. యాత్ర ఒకేవిడతగా కాకుండా పలు విడతలుగా చేయనున్నారు. దీంట్లో భాగంగా మొదటి విడత అన్నవరం నుంచి భీమవరం వరకు యాత్ర కొనసాగుతుందని నాదెండ్ల తెలిపారు.

రూట్ మ్యాప్ సైతం ప్రకటించారు. ప్రత్తిపాడు నియోజకవర్గం, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, ముమ్మిడివరం, అమలాపురం, పి గన్నవరం, రాజోలు.. అక్కడి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు, నర్సాపురం, భీమవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి తొలి విడత యాత్ర కొనసాగుతోందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకునేందుకు, అధిక సమయం ప్రజల మధ్య గడిపేలా జనసేన నేతలు రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. యాత్ర ప్రకటనతో జనసేన శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.