GoodMorningCMSir : జనసేనాని పవన్ కళ్యాణ్ డిజిటల్ వార్ షురూ చేశాడు. ఆంధ్రప్రదేశ్ లో ఈ వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల దుస్థితిపై తొలి యుద్ధం ప్రకటించారు. ఏపీ గోతులను బయటపెట్టి సర్కార్ ను కడిగేసేందుకు నడుం బిగించారు. గతంలోనే ఏపీలో రోడ్ల దుస్థితిపై ‘శ్రమదానం’ పేరిట స్వయంగా రంగంలోకి దిగింది జనసేన. పవన్ కళ్యాణ్ రోడ్డెక్కడంతో ఏపీ ప్రభుత్వం కొంత వరకూ రోడ్లను బాగుచేసింది. ఇప్పుడు డిజిటల్ వార్ ను మొదలుపెట్టింది.

నేటినుంచి జనసేన ‘గుడ్ మార్నింగ్ సీఎం సార్’ పేరుతో పవన్ కళ్యాణ్ డిజిటల్ వార్ షురూ చేశారు. గుడ్ మార్నింగ్ సీఎం సార్ పేరుతో పవన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతో జనసైనికులు ఏపీలోని రోడ్ల దుస్థితిపై వెల్లువలా ట్వీట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో రోడ్ల దుస్థితిని ప్రభుత్వానికి బాధ్యతగా గుర్తు చేయాలనే ‘గుడ్ మార్నింగ్ సీఎం ార్’ అనే హ్యాష్ ట్యాగ్ తో ఇవాళ , రేపు, ఎల్లుండి జనసేన డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది.
ఇప్పటివరకూ దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు పనులు పూర్తి చేసి ప్రతిపక్షాల నోరు మూయిస్తామని సీఎం జగన్ ఛాలెంజ్ చేశారు. జూలై 15 నాటికి రహదారులు బాగులేదన్న మాటే వినబడకూడదన్నారు. రోడ్లు అద్దంలా మెరిసిపోవాలని ఆదేశాలిచ్చారు. దీనికి అధికారులు కూడా జీహుజూర్ అన్నారు. ఎదురుతిరిగితే ఏమవుతుందో వారికి ఏరుక కనుక తలూపారు. ఇప్పుడు జూలై 15 వచ్చేసింది. ఒక్కటంటే ఒక్క రహదారి కూడా బాగుచేయలేదు. కనీసం గుంతలు కప్పే ప్రయత్నం చేయలేదు. వాహన మిత్ర అంటూ సాయం చేస్తున్నారే తప్ప.. వాహనాలు తిరిగే రహదారులను మాత్రం బాగుచేయలేదు. గతుకుల రహదారులపై నెలరోజుల పాటు తిరిగే వాహన మరమ్మతులకు వాహన మిత్ర సాయం సరిపోతుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై విపక్ష టీడీపీ, జనసేనలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. గత రెండేళ్లుగా రోడ్ల గుంతల వద్ద వరి నాట్లు వేయడం వంటి వాటితో నిరసన చేపట్టాయి. జనసేన నేతలు తమ సొంత ఖర్చుతో రోడ్డు గుంతలను పూడ్చారు. అయినా ప్రభుత్వ తీరులో మార్పు రావడం లేదు.

రోడ్డు మరమ్మత్తుల కోసం అని చెప్పి ఎక్కువ వడ్డీలకు నిధులు తెచ్చి ఆ సొమ్ములు మళ్లించేస్తున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ప్రభుత్వం మభ్యపెడుతోంది. పెట్రోల్ మీద ఏటా సామాన్యుడి నుంచి రూ. 750 కోట్లు రోడ్ సెస్ వసూలు చేస్తున్నారు. ఆ సెస్ చూపి రూ. 6 వేల కోట్లు అప్పులు తెచ్చారు. ముఖ్యమంత్రికి జవాబుదారీతనం ఉంటే ఆ నిధులు ఎందుకు ఖర్చు చేశారో వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని జనసేన డిమాండ్ చేస్తోంది.
సీఎం జగన్ ఛాలెంజ్ చేసినా రోడ్ల దుస్థితి మారలేదు. దీంతో ముఖ్యమంత్రి కళ్లు తెరిపించాలనే ఉద్దేశంతోనే ఈ డిజిటల్ క్యాంపెయిన్ కు శ్రీకారం చుట్టింది జనసేన. పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపునకు భారీ స్పందన వస్తోంది. తెల్లవారుజాము నుంచే జనసైనికులు వెల్లువలా గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఏపీలో రోడ్ల పరిస్థితిని కళ్లకు కట్టేలా చూపిస్తున్నారు.
[…] […]