Damaged Roads in AP: ‘అద్దంలాంటి రోడ్లు..సాఫీగా సాగిపోదాం’ గత మూడేళ్లుగా ఏపీ సీఎం జగన్ చేసే ప్రకటనలివి. అయితే సాఫీగా ప్రయాణం సాగుతుందంటే అదీ లేదు. గుంతల్లో రహదారిని వెతుక్కుంటూ ప్రజలు ప్రయాణాలు సాగిస్తున్నారు. అంతర్ రాష్ట్ర, జిల్లా రహదారులని ప్రభుత్వం వివక్ష చూపడం లేదు. అన్ని రహదారులు అలానే ఉన్నాయి. జాతీయ రహదారుల పరిస్థితి మెరుగ్గా ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది గనుక వాటికి పర్వాలేదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఏ రహదారి కూడా సరిగ్గా లేదు. దారిపొడవునా గుంతలు, వాటిలో నీరు చేరి చెరువులు తలపిస్తున్నాయి. అయితే రహదారులపై విమర్శలు వచ్చిన ప్రతీసారి సీఎం జగన్ ఉన్నతాధికారులతో ఒక సమీక్ష నిర్వహిస్తారు. పలాస తేదీకంటూ గడువు పెట్టి రహదారులు అద్దంలా మారిపోవాలని బదులిస్తారు. కానీ వాటికి నిధులు ఎలా వస్తాయో.. ఎంత కేటాయించారో చెప్పరు. అధికారులకు మాత్రం స్పష్టమైన ఆదేశాలిస్తారు. కానీ అధికారులు చెప్పిన ఏ వెర్షన్ వినరు. ఆర్భాటంగా పత్రికలకు ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తారు. నేరుగా విలేఖర్ల సమావేశం పెడితే ప్రశ్నలు ఎదురవుతాయని భావిస్తారో ఏమో కానీ.. అధికారులతో సమీక్ష జరిగిన వెంటనే ప్రెస్ నోట్ పడేస్తారు. అంతటితో ఆగకుండా సాక్షిలో ఏకంగా పతాక శీర్షికన ప్రకటనలిస్తారు. అసలు నిధులు విడుదల చేయకుండా పనులు ఎలా సాధ్యమో మాత్రం సీఎం చెప్పారు. చేతిలో ఉన్న మంత్రదండం ఉన్నట్టు ఆ రోజుకల్లా మన రాష్ట్రంలో ఉన్న అన్ని రహదారులు అద్దంలా మెరిసిపోవాలి. ప్రజల ప్రయాణం సాఫీగా జరిగిపోవాలంటూ బదులిస్తారు. అయితే అది సాధ్యమయ్యే పనికాదని తెలుసు గనుక అధికారులు మౌనాన్ని ఆశ్రయిస్తారు. అలాగే సార్ చేసేద్దామంటూ సీఎం వద్ద తలుపుతారు. తీరా సీఎం ప్రకటించిన గడువు వచ్చే నాటికి మళ్లీ అదే మాట. గత మూడేళ్లుగా ‘పాడిందే పాడరా పాచిపండ్ల దాసరి’ అన్నట్టు సీఎం ఆదేశాలివ్వడం.. గడువు తీరుతుండడం పరిపాటిగా మారింది. ఎప్పటికప్పుడు గడువులు ముగుస్తుండడంతో దాదాపు రహదారులు ఆనవాళ్లు కోల్పోయాయి.

మాట తప్పారు..
జగనన్న మాట తప్పడు.. మడమ తిప్పడు అని మంత్రులు, కీలన నేతలు, ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నాయకులు..ఇలా ఒకరేమిటి..వైసీపీని, జగన్ ను అభిమానించే ప్రతిఒక్కరూ ఏదో సందర్భాల్లో కాదు.. అన్ని చోట్ల ఇదే మాట చెబుతారు. అవసరమైతే ఎదుటి వారితో వాదనకు దిగుతారు. కలబడతారు..కలహానికి పిలుపునిస్తారు. అయితే అంతవరకూ బాగానే ఉంది. కానీ రహదారుల విషయంలో మాత్రం అన్న మాట ఇస్తాడు, మాట తప్పుతాడు అని విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొళినాళ్లలో రహదారుల పరిస్థితి పర్వాలేదు.
Also Read: CM KCR: కేసీఆర్ రెండు నాల్కల ధోరణి ఇక మారదా?
అంతకు ముందు టీడీపీ సర్కారు రహదారుల విషయంలో అప్రమత్తంగా ఉండడంతో తొలి ఏడాది వైసీపీ సర్కారుకు ఎటువంటి బెడద లేదు. అయితే మీట నొక్కుడు వ్యవహారంలో సీఎం జగన్ ఉండిపోవడంతో రహదారుల నిర్వహణ పక్కదారి పట్టింది. ప్రకటనలు, సమీక్షల వరకే రహదారులు పరిమితమయ్యాయి. నిధుల జాడ కరువైంది. అప్పటివరకూ చిన్నాచితకా పనులు చేసేవారికి కాస్తా ఓపిక పట్టండి. ముందు ప్రజలకు పంచుతాం. మిగిలితే మీకు ఇస్తామని చందంగా రేపు, మాపు అంటూ బిల్లుల ఆశలు చూపి చివరకు లేవు అంటూ బదులిచ్చారు. దీంతో వారు పనులు నిలిపివేశారు. కొందరు కోర్టును ఆశ్రయించి బిల్లులు పొందారు. అటు పనులు చేసి..ఇటు కోర్టుకెళ్లి బిల్లులు తెచ్చుకోవడం ఏమిటని కొందరు కాంట్రాక్టర్లు పనుల నుంచి తప్పుకున్నారు. అప్పటి వరకూ కాంట్రాక్టర్లుగా ఉన్న వైసీపీ నేతలు సైతం మాకొద్దు ఈ పనులు బాబోయ్ అంటూ బాయ్ కట్ చేశారు. అప్పటి నుంచి పనులు అన్నవే జరగడం లేదు. కానీ సీఎం జగన్ మాత్రం గడువులు, లక్ష్యాలతో ప్రజలకు అద్దంలాంటి రోడ్లు వస్తాయని భ్రమ కల్పించారు. తీరా గడువు సమీపించేసరికి మాత్రం చుక్కలు చూపించారు.

ఎన్ని విమర్శలు వస్తున్నా..
కొద్ది నెలల కిందట సీఎం జగన్ అధికారుల సమీక్షించారు. జూలై 15 నాటికి రహదారులు బాగులేదన్న మాటే వినబడకూడదన్నారు. రోడ్లు అద్దంలా మెరిసిపోవాలని ఆదేశాలిచ్చారు. దీనికి అధికారులు కూడా జీహుజూర్ అన్నారు. ఎదురుతిరిగితే ఏమవుతుందో వారికి ఏరుక కనుక తలూపారు. ఇప్పుడు జూలై 15 వచ్చేసింది. ఒక్కటంటే ఒక్క రహదారి కూడా బాగుచేయలేదు. కనీసం గుంతలు కప్పే ప్రయత్నం చేయలేదు. వాహన మిత్ర అంటూ సాయం చేస్తున్నారే తప్ప.. వాహనాలు తిరిగే రహదారులను మాత్రం బాగుచేయలేదు. గతుకుల రహదారులపై నెలరోజుల పాటు తిరిగే వాహన మరమ్మతులకు వాహన మిత్ర సాయం సరిపోతుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై విపక్ష టీడీపీ, జనసేనలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. గత రెండేళ్లుగా రోడ్ల గుంతల వద్ద వరి నాట్లు వేయడం వంటి వాటితో నిరసన చేపట్టాయి. జనసేన నేతలు తమ సొంత ఖర్చుతో రోడ్డు గుంతలను పూడ్చారు. అయినా ప్రభుత్వ తీరులో మార్పు రావడం లేదు. మీట నొక్కుడుపై ఉన్న శ్రద్ధ.. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో మాత్రం చూపించడం లేదు. ఫలితంగా ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.