
Pawan Kalyan: ప్రభుత్వ ఉచిత పథకాల పై విస్త్రతమైన చర్చ జరుగుతోంది. ఉచిత పథకాలు ఇవ్వడం మంచిది కాదనే వాదన వినిపిస్తోంది. ఉచిత పథకాల మూలంగా అనేక దుష్పరిణామాలు సంభవిస్తాయని నిపుణులు వాదిస్తున్నారు. ఉచిత పథకాలు అప్పులు చేయకుండా.. సంపద సృష్టించి ఇవ్వాలని మరికొందరు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ ఇప్పుడు సంచలనంగా మారింది. తెలుగు రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఇంతకీ ఆ హామీ ఏంటో ? ఆ హామీ వల్ల చేకూరే లబ్ధి ఏంటో తెలుసుకుందాం.
Also Read: AP Defense Industrial Corridor: ఏపీకి ఢిపెన్స్ కారిడార్ రాదు.. ఎందుకో తెలుసా ?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొత్త హామీ ఇచ్చారు. రేషన్ బియ్యానికి బదులు.. మహిళల ఖాతాల్లో నగదు జమ చేస్తామని తెలిపారు. ఇది తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేయబోయే కార్యక్రమమని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ హామీ పై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 60 శాతం జనాభా రేషన్ బియ్యం తినడంలేదనేది ఒక లెక్క. ఇంత పెద్ద ఎత్తున రేషన్ బియ్యం తిననప్పుడు .. వాటికి బదులుగా నగదు ఇవ్వాలనేది పవన్ కళ్యాణ్ అభిప్రాయం. ఆ నగదుతో వారికి కావాల్సిన బియ్యం కొనుగోలు చేస్తారనేది పవన్ కళ్యాణ్ ఆలోచన. పవన్ కళ్యాణ్ ఆలోచన చాలా మంచిదనే చెప్పాలి. కానీ దీనికి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి.
ఉదాహరణకు 60 శాతం మంది రేషన్ బియ్యం తినడం లేదంటే.. ఆ బియ్యం ఎటు పోతున్నట్టు. చిన్న చిన్న పట్టణాల్లో ఇడ్లీ బండి పైన, దోశ బండి పైన వాడుతున్నారు. ఇంకా చెప్పాలంటే పల్లెల్లో కూలీలకు రేషన్ బియ్యంతో వండిన ఆహారాన్నే ఇస్తున్నారు. రోజూ పదుల సంఖ్యలో కూలీలతో అవసరం ఉన్న ఓ రైతు.. ప్రతి రోజు సన్న బియ్యంతో కూలీలకు అన్నం పెట్టలేడు. అలా పెడితే ఆ రైతు వ్యవసాయం చేయలేడు. కాబట్టి రేషన్ బియ్యాన్ని తోట పనులు చేసేటప్పుడు ఆహారం వండటానికి వాడుతున్నారు. 60 శాతం మంది రేషన్ బియ్యం తినలేదని మనం చెప్పకున్నాం. మిగిలిన 40 శాతం మందికి రేషన్ బియ్యంతో అవసరం ఉండొచ్చు. వారు రేషన్ బియ్యమే తినొచ్చు. కాబట్టి వారికి ఎలాంటి ప్రత్యామ్నాయం చూపిస్తారనేది కూడా ఆలోచించాలి.

రేషన్ బియ్యం ప్రభుత్వం ఆపేస్తే బహిరంగ మార్కెట్లో బియ్యం రేట్లు విపరీతంగా పెరిగే పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే నగదు ఆ బియ్యం కొనడానికి చాలకపోవచ్చు. అప్పుడు ప్రభుత్వం బహిరంగ మార్కెట్లోని బియ్యం ధరలను అదుపు చేయాల్సి ఉంటుంది. వ్యాపారుల సిండికేట్ నుంచి ప్రజలను కాపాడాల్సి ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ మరొక సమస్య ఉంది. చాలా మంది రైతులు వరి పండిస్తున్నారు. వరిలో రకరకాల వెరైటీలు ఉంటాయి. అన్నీ సన్నబియ్యం, సోనామసూరీ బియ్యం ఉండవు. ఇప్పుడు వాటిని ప్రభుత్వాలే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నాయి. తిరిగి వాటిని రేషన్ బియ్యం రూపంలో ప్రజలకు పంపిణీ చేస్తున్నారు.
ప్రభుత్వం రేషన్ బియ్యం పంపిణీ బదులు నగదు అందిస్తే.. రైతులు పండించిన పంటను ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసే అవసరం ఉండదు. అప్పుడు ఎలాంటి ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంటారో ప్రభుత్వం ముందే ఆలోచించాల్సి ఉంటుంది. రేషన్ బియ్యానికి బదులు నగదు ఇవ్వడం మంచిదే కానీ.. ఇలాంటి ఎన్నో సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. రేషన్ బియ్యం తిననివారికి ఇది వరమైతే.. రేషన్ బియ్యం పైనే ఆధారపడ్డవారికి భారం కావొచ్చు. కాబట్టి పవన్ కళ్యాణ్ రేషన్ బియ్యం బదులు నగదు ఇస్తామన్న హామీ అద్భుతంగా ఉన్నప్పటికీ.. దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. వాటిని పరిష్కరించగలిగితే పవన్ కళ్యాణ్ హామీ విజయవంతం అవుతుందని చెప్పవచ్చు.
Also Read:kamal Haasan కులమే నాకు అతిపెద్ద రాజకీయ శత్రువు అంటున్న స్టార్ హీరో