Homeఆంధ్రప్రదేశ్‌Margadarshi Case : మార్గదర్శిని తవ్వుతున్న జగన్: రామోజీ రావు, శైలజ అరెస్ట్ తప్పదా?

Margadarshi Case : మార్గదర్శిని తవ్వుతున్న జగన్: రామోజీ రావు, శైలజ అరెస్ట్ తప్పదా?

Margadarshi Case : ఆంధ్రప్రదేశ్ లో రామోజీరావుకు చెందిన మార్గదర్శి బ్రాంచ్ ల పై సిఐడి అధికారులు దాడులు చేస్తున్నారు. పలు కీలక పత్రాలను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. అధికారులు దాడులు నిర్వహిస్తున్న సమయంలో నరసరావుపేట, ఏలూరు బ్రాంచ్ మేనేజర్లు పారిపోయారు.. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఫిర్యాదుతో దాడులు మొదలుపెట్టిన సిఐడి అధికారులు మార్గదర్శి వ్యవహారాలను మొత్తం తవ్వే పనిలో ఉన్నారు. ఇక ఈ కేసులో ఏ_1 గా రామోజీరావు, ఏ _2 గా శైలజ పై ఏపీ సిఐడి అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ చేసిన ఫిర్యాదుతో సిఐడి రంగంలోకి దిగింది. చట్టాన్ని దర్జాగా ఉల్లంఘిస్తూ, అక్రమాలకు పాల్పడుతున్న మార్గదర్శిపై కేసు నమోదు చేశామని ఏపీ సిఐడి అధికారులు చెప్తున్నారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ చైర్మన్ చెరుకూరి రామోజీరావు ఏ _1, పెద్ద కోడలు చెరుకూరి శైలజ ఏ-2, మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచ్ మేనేజర్లను ఏ _3 గా ఎఫ్ ఐ ఆర్ లో పేర్కొన్నారు.. వారిపై సెక్షన్లు 120(బీ), 409, 420,477(ఎ) రెడ్ విత్ 34 సీ ఆర్ సీ పీ కింద కేసులు నమోదు చేశారు. ఏపీ ఆర్థిక సంస్థల డిపాజిట్ దారుల హక్కుల పరిరక్షణ చట్టం 1999, చిట్ ఫండ్ చట్టం 1982 కింద కూడా నమోదు చేశారు. చందాదారుల హక్కులకు విఘాతం కలిగిస్తుందని ఆరోపిస్తూ మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ బ్రాంచ్ కార్యాలయాల్లో రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో సోదాలు నిర్వహించింది. రిజర్వ్ బ్యాంకు నిబంధనలు, చిట్ ఫండ్ చట్టానికి విరుద్ధంగా ఆ సంస్థ అక్రమాలకు పాల్పడుతున్నట్టు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గుర్తించింది. ఆ తనిఖీల్లో మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచ్ మేనేజర్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులకు ఏమాత్రం సహకరించలేదనే ఆరోపణలున్నాయి. దీంతో అధికారులు గత ఏడాది డిసెంబర్లో తనిఖీలు నిర్వహించారు. చందాదారుల హక్కులకు విఘాతం కలిగిస్తున్నారని ఆధారాలతో సహా నిర్ధారించారు. సంస్థ యాజమాన్యం తమ స్వప్రయోజనాల కోసం అక్రమాలకు పాల్పడుతోందని నిగ్గు తెల్చారు. దీంతో చందాదారుల హక్కుల పరిరక్షణ, రిజర్వ్ బ్యాంక్ నిబంధనలను అమలు చేయడం కోసం ఈ వ్యవహారాన్ని సిఐడికి నివేదించారు.

విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, పల్నాడు, కర్నూలు, అనంతపురం జిల్లా అసిస్టెంట్ రిజిస్ట్రార్లు ఈ మేరకు సిఐడికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో మార్గదర్శి చిట్ ఫండ్స్ పై సిఐడి కేసు నమోదు చేసింది. సీఐడీ అధికారులు విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, అనంతపురంలోని మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల్లో శనివారం సోదాలు నిర్వహించి మేనేజర్లను ప్రశ్నించారు. సోదాలు మొదలుపెట్టగానే నరసరావుపేట, ఏలూరు బ్రాంచ్ మేనేజర్లు పరారయ్యారు. ఈ సోదాల్లో సిఐడి అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. అయితే ఈ కేసులో బలమైన ఆధారాలు లభించిన నేపథ్యంలో మార్గదర్శి ఎండి శైలజ, రామోజీరావు అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని సిఐడి వర్గాలు చెబుతున్నాయి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version