Jagan Sakshi : వడ్డించే వాడు మనవాడైతే కడపంక్తిలో కూర్చున్నా పర్వాలేదన్నట్టుంది ఏపీలో సాక్షి దినపత్రిక పరిస్థితి. అధికార పార్టీ అధికార మీడియా అయినా సాక్షికి అటు సర్క్యులేషన్ పరంగా, ఇటు యాడ్స్ పరంగా వందల కోట్ల రూపాయలను కేటాయిస్తోంది వైసీపీ సర్కారు. చివరకు అందులో పనిచేసే పెద్ద తలకాయలకు కూడా ప్రభుత్వమే జీతాలు చెల్లించే ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వంలో చిన్నపాటి కార్యక్రమం నుంచి పెద్ద వేడుకలు, పథకాల ప్రారంభం.. చివరకు వారం వారం ఇసుక ధరలను ప్రజలకు తెలియజెప్పే సమాచారాన్ని కూడా యాడ్ ల రూపంలోకి మార్చేస్తోంది. మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్థిల్లుతోంది ఏపీలో సాక్షి మీడియా. సత్యమేవ జయతే అన్న నినాదంతో నాడు జగన్ చేతిలో పురుడుబోసుకున్న సాక్షి మీడియా ఇతరుల పెట్టుబడితోనే దినదిన ప్రవర్థమానంగా.. తెలుగు భాషలో రెండో అతి పెద్ద సర్క్యులేషన్ పత్రికగా తీర్చిదిద్దారు జగన్. కానీ అసలు తనకు మీడియా సపోర్టే లేదంటూ దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతుంటారు.

నాటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పారిశ్రామికవేత్తగా ఉన్న జగన్ మీడియా సపోర్టు కోసం సాక్షిని ఏర్పాటుచేశారు. తన చేతి నుంచి పైసా పెట్టుబడి పెట్టకుండా క్విడ్ ప్రో తో నిధులు సమకూర్చుకొని ఇందిరా మీడియాగా పేరు చెప్పి మరీ సాక్షి మీడియాను విస్తరించుకున్నారు. అప్పటి నుంచి సాక్షి అస్మదీయ పత్రికగా మారిపోయింది. వైఎస్ కుటుంబం రాజకీయ ఉన్నతికి ఇతోధికంగా సాయమందించింది. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పత్రిక స్వరూపమే మారిపోయింది. సర్వ్యులేషన్ పెంచుకునేందుకు ప్రభుత్వమే నేరుగా జీవోలు విడుదల చేసే వరకూ పరిస్థితి వచ్చింది. సంక్షేమ పథకాలు లబ్ధిదారుడికి చేరక ముందే యాడ్స్ రూపంలో ఆ పత్రిక కోట్ల రూపాయలు అందుకుంటోంది. ప్రభుత్వం ఏ చిన్న పథకం ప్రారంభించినా.. చిన్నపాటి కార్యక్రమం చేసినా.. సాక్షికి ఫుల్ పేజీ యాడ్లతో కోట్లాది రూపాయలు ముట్టజెబుతున్నారు. మూడున్నరేళ్ల వైసీపీ పాలనలో వందల కోట్ల రూపాయలను యాడ్స్ రూపంలో సొంతం చేసుకున్న సాక్షి ఇప్పుడు సర్వ్కులేషన్ పెంచుకునే పనిలో పడింది. ఇందుకు తన మానసపుత్రిక వ్యవస్థలైన వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులను వినియోగించుకోవాలని నిర్ణయానికి వచ్చింది.
తనకు తాను విస్తృత సర్క్యులేషన్ ఉన్నట్టు ప్రకటించుకునే సాక్షి పత్రిక ప్రస్తుతం ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి వార్తలు, కథనాలు రాయడంలో ముందుంది. దానినే బేస్ చేసుకొని వలంటీర్లు విధిగా సాక్షి పత్రిక కొనాలని నేరుగా ప్రత్యేక జీవో జారీచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2.50 లక్షల మంది వలంటీర్లు ఉన్నారు. ప్రతీ వలంటీరు రూ.200 పెట్టి సాక్షి పత్రిక కొనాలని కొద్ది నెలల కిందట కండీషన్ పెట్టారు. అడిషనల్ ఫైనాన్షియల్ సపోర్టు పేరుతో వలంటీర్ల పేస్లిప్ లో జీతం రూ.5000 కు అదనంగా రూ.200 లను అలాట్ చేశారు. ఏజెంట్ ఇచ్చే పేపరు బిల్లును యాప్ లో అప్ లోడ్ చేయాలని వలంటీర్లకు ఆదేశాలిచ్చారు.ఇప్పటికే ఏజెంట్లు వలంటీర్లకు పేపర్లు అందిస్తున్నారు. కానీ మారుమూల గ్రామీణ ప్రాంతాలకు పేపరు వెళ్లకున్నా.. వలంటీర్ల ఖాతాలో పడుతున్న రూ.200 మాత్రం కట్ చేసి సాక్షి యాజమాన్యాకి అందిస్తున్నారు. అంటే ఒకేసారి 2.50 లక్షల సర్వ్యులేషన్ పెంచుకున్న సాక్షి… ఈనాడు పత్రికను అధిగమించేందుకు ప్రయత్నిస్తోంది.
అయితే వలంటీర్లతో పత్రిక కొనిపిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు సచివాలయ సహాయకులపై పడింది. ఇప్పటికే సచివాలయానికి రెండు కాపీలను పంపిస్తున్న ప్రభుత్వం.. అందులో పనిచేసే కార్యదర్శులు, సహాయకులు విధిగా పత్రిక కొనాల్సిందేనని ఆదేశించింది. ఇందుకుగాను ఏపీ సర్కారు రూ.7.89 కోట్లు విడుదల చేసింది. ప్రతి సచివాలయ ఉద్యోగి సాక్షి పత్రిక కొని తీరాల్సిందేనని ఉత్తర్వులు జారీచేసింది. దీనికి సచివాలయ ఉద్యోగుల సంఘం అభ్యర్థన మేరకేనని షరతు పెట్టింది. తెలివిగా ఉత్తర్వుల్లో ఎక్కడా సాక్షి అని మెన్షన్ చేయలేదు. ఒక ‘ప్రముఖ పత్రిక’ అని పేర్కొంది. కానీ ఇంటర్నల్ గా మాత్రం సాక్షినే కొనుగోలు చేయాలని ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలు మార్చి వరకూ అమలుచేయాలని కూడా స్పష్టం చేసింది. అంటే ఇప్పుడు సచివాలయ ఉద్యోగులకు అందిస్తున్న జీతాలకు అదనంగా రూ.200 చెల్లిస్తారన్న మాట. ఒక వైపు ఉద్యోగులు, పింఛన్ దారులకు రెండో వారం దాటుతున్నా వేతనాలు అందించలేదు. అటువంటిది సాక్షి పత్రిక సర్వ్యులేషన్ పెంచేందుకు ఏకంగా కోట్లాది రూపాయల నిధులు విడుదల చేయడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు భగ్గమంటున్నాయి. మొత్తానికైతే సాక్షి పత్రిక ఆయాచితంగా లబ్ధి పొందుతుందన్న మాట. తన చేతిలో మీడియా లేదంటూనే.. అదే మీడియాకు వందల కోట్ల రూపాయలు అర్పిస్తున్న జగన్ తెలివితేటలను అభినందించాల్సిందే.