Pawan Kalyan Jagan : ‘జనసేన గ్రాఫ్ పెరిగింది. పవన్ ను ప్రత్యామ్నాయ నేతగా ఏపీ సమాజం చూస్తోంది. కానీ ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో యంత్రాంగం లేదు. అదే ఆ పార్టీకి మైనస్’..మొన్నటివరకూ వచ్చిన విశ్లేషణలు ఇవి. ఆ ధీమాతోనే అధికార వైసీపీ, విపక్ష టీడీపీ ఊపిరిపీల్చుకున్నాయి. గ్రామ లెవల్ లో ఆ పార్టీకి ఓట్లు ఉన్నా.. వారిని పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లి ఓటువేయించే యంత్రాంగం లేదని ఆ రెండు పార్టీలు భావించాయి. కానీ గత అనుభవాల దృష్ట్యా లోపాలను అధిగమించుకొని ముందుకు వస్తున్న జనసేన ఇప్పుడు గ్రామ కార్యవర్గాలు, బూత్ లెవల్ కమిటీలు ఏర్పాటుచేసేసరికి ఆ రెండు పార్టీలకు మైండ్ బ్లాక్ అయ్యింది. ప్రధానంగా సీఎం జగన్ కు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. అందుకే తన ఐ ప్యాక్ బృందానికి పనిచెప్పడం ప్రారంభించారు. జనసేన బూత్ కమిటీలకు దీటుగా ఏంచేయాలని సలహా అడిగారు. అలా వచ్చిన ఆలోచనే ‘గృహ సారథులు’. ఇప్పుడున్న వలంటీర్ల బలం జనసైనికుల ముందు చాలదని భావించిన జగన్ గృహసారథులు, కన్వీనర్ల పేరిట తన సైన్యాన్ని పెంచుకోవడానికి… పవన్ బూత్ లెవల్ కమిటీల ఏర్పాటు చేయడమే ప్రధాన కారణం.

అయితే ఇప్పటివరకూ కార్యవర్గాలు, అనుబంధ కమిటీల ఏర్పాటు, బూత్ లెవల్ కమిటీలు లేకపోవడం జనసేనకు ముమ్మాటికీ మైనస్ పాయింటే. దానిని ఎవరూ కాదనలేరు. వాస్తవానికి రాష్ట్ర స్థాయిలో జనసేన పవర్ ఫుల్ పొలిటికల్ పార్టీగా ఉంది. ప్రభుత్వ వైఫల్యాలపై పవన్ గట్టి పోరాటమే చేస్తున్నారు. దీనికి ప్రజల నుంచి మద్దతు, ఆదరణ లభిస్తోంది. జనసేన అంటే ప్రజలు అభిమానిస్తున్నారు. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా చూస్తున్నారు. పవన్ నాయకత్వాన్ని కూడా సమర్థిస్తున్నారు. అంతవరకూ బాగానే ఉంది. మరి గ్రౌండ్ లెవల్ లో దానిని సమన్వయం చేసుకొని ఓటు బ్యాంక్ గా మలుచుకోవడం ఎలా? అన్న ప్రశ్న పార్టీ వర్గాల నుంచి కూడా వినిపించింది. అయితే దీనిని గుర్తించిన పవన్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ పెంచారు. చాపకింద నీరులా అటు కార్యవర్గాలు, పార్టీ అనుబంధ విభాగాల ఏర్పాటుపై దృష్టిపెట్టారు. బూత్ లెవల్ కమిటీలను సైతం ఏర్పాటుచేశారు. ఇన్నాళ్లూ జనసేనలో ఉన్న ఈ వైఫల్యాన్ని చూసి ఊరట చెందిన వైసీపీ, జనసేనలకు ఇప్పుడిది మింగుడుపడని అంశం.
అయితే పవన్ తాజా చర్యలతో జగన్ శిబిరంలో టెన్షన్ పడుతోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించుతానని పవన్ శపధం చేశారు. అప్పటి నుంచి ఆయన ఏస్టెప్ తీసుకున్నా సక్సెస్ అవుతోంది. అటు పవన్ టూర్లకు జనం వెల్లువలా తరలివస్తున్నారు. ప్రభుత్వ అవినీతిపై పవన్ పోరాటానికి ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. దీంతో జగన్ అండ్ కో లో కలవరం ప్రారంభమైంది. పవన్ ఇదే దూకుడును కొనసాగిస్తే మాత్రం తమకు దెబ్బ తప్పదని వారు భావిస్తున్నారు. అందుకే గ్రామస్థాయిలో వలంటీర్లపైనే ఆధారపకుండా అంతకంటే పటిష్ట వ్యవస్థను తేవాలన్న నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగానే ప్రతీ 50 కుటుంబాలకు ముగ్గురు చొప్పున గృహ సారథులను నియమించాలని నిర్ణయానికి వచ్చారు.
ఇప్పుడు ఏపీలో జనసేన వర్సెస్ వైసీపీ అన్నట్టు పరిస్థితి మారిపోయింది. అందుకే టీడీపీ, చంద్రబాబుల కంటే జగన్ జనసేన, పవన్ లపైనే ఫోకస్ పెంచారు. పవన్ ను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలని చూస్తున్నారు. జనసేన కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. తనను అధికారం నుంచి దూరం చేసేందుకు పవన్ పావులు కదుపుతున్నారని ఆందోళన చెందుతున్నారు. అందుకే పవన్ ను నిలువరించాలని ప్రయత్నిస్తున్నారు. జనసేన తీసుకునే ప్రతి స్టెప్ నకు అనుగుణంగా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. .జనసేన అంటే తనకు లెక్కేలేదని చెబుతూనే.. ఆ పార్టీ అంటేనే లెక్కకు మించి భయపడుతున్నారు. కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. కానీ వైసీపీ శ్రేణులు మాత్రం తాము కాషాయ దళాన్ని ఆదర్శంగా తీసుకున్నట్టు చెబుతున్నారు. గుజరాత్, యూపీలో ఆ పార్టీ అనుసరించిన వ్యూహం మాదిరిగా ఇక్కడ గృహసారధులను నియమించినట్టు మీడియాకు లీకులిస్తున్నారు.కానీ ఆ ఆలోచన వెనుక పవన్ ఉన్నారన్న సత్యాన్ని మాత్రం బయటపెట్టలేకపోతున్నారు.