Jagan KVP : వైఎస్ రాజశేఖర్ రెడ్డి సహచరులు చాలామంది జగన్ తో కొనసాగుతున్నారు. మరికొందరు బయట పార్టీల్లో ఉన్నారు. వైఎస్ ను దగ్గరగా చూసిన వారికి ప్రస్తుతం జగన్ వైఖరి నచ్చడం లేదు. అయితే వైసీపీలో కొనసాగుతున్న వారు బయటపడలేకపోతున్నారు. కానీ బయట పార్టీల్లో ఉన్నవారు మాత్రం తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. తమ సహచర నాయకుడి వారసుడిగా ప్రేమ ఉన్నా.. పాలన దుస్థితిని చూసి మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వైఎస్ ఆత్మ కేవీపీ రామచంద్రరెడ్డి జగన్ పాలన తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలో పీసీసీ బాధ్యతలు చేపట్టే కార్యక్రమానికి హాజరైన కేవీపీ తన ప్రసంగంలో ఏపీకి జరుగుతున్న అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. ‘బంగారు భవిష్యత్ కలిగిన ఆంధ్రప్రదేశ్ కు జరుగుతున్న అన్యాయం తలచుకుంటే బాధేస్తోంది. విభజన హామీలు అమలు కోసం జగన్ పోరాడడం లేదు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో రాష్ట్రం దశదిశ మారలేదు. ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని జగన్ నిలదీయడం లేదు. రాష్ట్రం పరిస్థితి చూస్తుంటే ఆవేదన కలుగుతోంది’ అని తన మనసులో ఉన్న బాధను వ్యక్తం చేశారు.

ఇటీవల కాలంలో కేవీపీ బయటకు వచ్చింది చాలా తక్కువ. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నా రాజకీయాల్లో ఏమంత యాక్టివ్ గా కూడా లేరు. రాజశేఖర్ రెడ్డి హయాంలో ఓన్ అండ్ ఓన్లీ సలహాదారుడిగా ఉండే కేవీపీ వైఎస్ కు మంచి స్నేహితుడు కూడా. ఆత్మగా కూడా అభివర్ణించేవారు. అటువంటి వ్యక్తి వైఎస్ మరణంతో ఆ కుటుంబానికి దూరం జరిగారు. ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు. కానీ నేరుగా ఇప్పుడు జగన్ పాలనా తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడం మాత్రం చర్చనీయాంశముంది. జగన్ పోలవరాన్ని పట్టించుకోవడం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణకు సిద్ధపడినా అభ్యంతరం వ్యక్తంచేయడం లేదంటూ కేవీపీ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ కూడా తన పాలనా వైఫల్యాలను అంగీకరిస్తున్నారని కూడా కేవీపీ అభిప్రాయం వ్యక్తం చేశారు. తన చర్యల ద్వారా ఫెయిల్యూర్స్ ను చూపిస్తున్నారని.. కేవలం తాను బటన్ నొక్కేందుకే పాలకుడినని చెప్పుకొస్తున్న విషయాన్ని కేవీపీ గుర్తుచేశారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సహచరుల్లో ఎక్కువ మంది జగన్ ను వ్యతిరేకిస్తున్నారు. వైఎస్ వద్ద లభించిన స్వేచ్ఛ, గౌరవం, అభిమానం జగన్ వద్ద లేకపోవడంతో ఎక్కువ మంది బహటంగానే వ్యతిరేకత కనబరుస్తున్నారు. చాలామంది వైఎస్ పై అభిమానంతో వైసీపీలో చేరి పదవులు పొందినా ఏమంత కంఫర్ట్ గా లేరు. అటు చాలామందికి వైసీపీలో చేరాలని ఉన్నా అక్కడ పరిస్థితులు మింగుడుపడడం లేదు. అందుకే ఏపీలో దాదాపు ఒక 20 మంది వరకూ యాక్టివ్ నాయకులు కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు. అటువంటి వారు వీలుచిక్కినప్పుడు జగన్ వైఖరిని బాహటంగానే వ్యతిరేకిస్తున్నారు. లోలోపల వైఎస్ కుమారుడు అన్న ప్రేమ ఉన్నా రాజకీయపరంగా, రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా విమర్శించక తప్పదని దుస్థితి వారిది. మొత్తానికైతే తన ఆత్మగా పరిగణించే వైఎస్ కుమారుడు జగన్ పై తన మనసులో ఉన్న బాధనంతటిని బయటపెట్టేశారు కేవీపీ రామచంద్రరావు.