Homeఆంధ్రప్రదేశ్‌TDP - Janasena : టీడీపీతో జనసేన పొత్తు లేనట్టేనా?

TDP – Janasena : టీడీపీతో జనసేన పొత్తు లేనట్టేనా?

TDP – Janasena : ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. పవన్ వారాహి యాత్ర జనసంద్రంగా మారుతోంది. రాళ్లు పగిలిపోయేలా తీక్షణమైన ఎండ ఉన్నా జన సైనికులు, ప్రజలు పవన్ కు నిరాజనాలు పలుకుతున్నారు. ప్రత్యర్థులపై పంచ్ లు, వైసీపీ సర్కారుపై విమర్శలతో జన సైనికుల్లో కిక్ నింపుతున్నారు. అయితే పొత్తుల విషయంలో పవన్ లో మారిన వైఖరి చూసి జనసేన శ్రేణులు ఖుషీ అవుతున్నాయి. అవసరమైతే విడిగా పోటీచేస్తానన్న ప్రకటన సంచలనంగా మారుతోంది. ముఖ్యంగా టీడీపీలో ఆందోళన రేపుతోంది. అయితే ఈ ప్రకటనను పవన్ వ్యూహాత్మకంగా చేసినట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గత నాలుగేళ్లుగా వైసీపీపై పోరాటానికి బీజేపీకి రూట్ మ్యాప్ ఇవ్వలేదని పవన్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అటు వారాహి యాత్ర అదిగో ఇదిగో అంటూ వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఎట్టకేలకు తనకు బలమున్న ప్రాంతమైన ఉభయగోదావరి జిల్లాల్లో పవన్ వారాహి యాత్ర చేపడుతున్నారు. ఇదే సమయంలో బీజేపీ అగ్రనేతలు ఏపీకి క్యూకట్టారు.  కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వచ్చి జగన్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేసి వెళ్లారు. ఇదంతా రూట్ మ్యాప్ లో భాగంగానే బీజేపీ, జనసేన వైసీపీ సర్కారుపై విమర్శల వాన ప్రారంభించినట్టు విశ్లేషణలు వెలువడుతున్నాయి.

వైసీపీ వెనుక బీజేపీ ఉన్నట్టు.. అన్నివిధాలా ప్రోత్సాహం అందిస్తున్నట్టు పవన్ ఇన్నాళ్లూ అనుమానిస్తూ వచ్చారు. అటు కేంద్ర చర్యలు కూడా అలానే ఉండేవి. దీంతో విసిగి వేశారిన పవన్ టీడీపీతో చెలిమికి యత్నించారు. అయితే ఇప్పుడు బీజేపీ వైఖరి మారింది. వైసీపీతో దూరం పెంచుకోవడంతో పవన్ కూడా తన స్ట్రాటజీ మార్చుకున్నారు. అందుకే పొత్తుల విషయంలో ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదని చెప్పుకొస్తున్నారు. గతంలో పార్టీ ఆవిర్భావ సభలో పొత్తులు ఉంటాయని స్పష్టంగా సంకేతాలు పంపారు. ఇప్పుడు బీజేపీ కలిసి రావడంతో నిర్ణయాన్ని మార్చుకున్నట్టు పవన్ కనిపిస్తున్నారు.

టీడీపీతో పొత్తునకు జనసేన నుంచి అభ్యంతరాలు వ్యక్తం కాకున్న పవర్ షేరింగ్ విషయంలోనే అసలైన అడ్డంకి. సీట్ల సర్దుబాటుతో పాటు సీఎం పదవి విషయంలో టీడీపీ నుంచి ఆశించినంతగా సుముఖత రావడం లేదు. దానిని గ్రహించిన బీజేపీ పవన్ కు ప్రోత్సహించాలని డిసైడయినట్టు వార్తలు వస్తున్నాయి. అందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. పవన్ సీఎం క్యాండిడేట్ గా ప్రకటించి బీజేపీ, జనసేన కూటమిగా పోటీచేయాలని ప్రాథమిక నిర్థారణకు వచ్చినట్టు సమాచారం. అయితే అది ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి. అదే కానీ జరిగితే టీడీపీతో పొత్తులేనట్టేనన్న ప్రచారం జరుగుతోంది.
Recommended Video:

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular