AP Employees Strike: ఇన్ కం సర్టిఫికెట్ కావాలంటే కనీసం వారం పదిహేను రోజులవుతుంది.. డెత్ సర్టిఫికెట్ రావాలంటే నెలల కొద్దీ సమయం పడుతుంది.. ఇక బర్త్ డే ధ్రువపత్రం రావాలన్నా కనీసం 6 నెలల సమయం తీసుకుంటారు మన ప్రభుత్వ సిబ్బంది.. ఇక తిండి కూడా పూర్తిగా తినని పేదవారికి ప్రభుత్వ పాఠశాలలంటే విపరీతమైన భయం.. ఉన్నదంతా ఊడ్చినా సరే ప్రైవేట్ స్కూళ్లకే పంపిస్తున్నారు.. రోగమొస్తే అప్పో సప్పో చైసైనా సరే.. ప్రైవేట్ ఆసుపత్రికే వెళ్లడానికి మొగ్గు చూపుతారు.. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లేందుకు మాత్రం మొగ్గు చూపరు.. మరి ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరు..? ఓ వైపు ప్రభుత్వ జీతం తీసుకుంటూనే మరోవైపు లంచం లేనిదే పనిచేయని కొందరు ప్రభుత్వ సిబ్బందితోనే ఈ వ్యవస్థ అలా తయారైంది కాదా..? అని కొందరు వాదిస్తున్నారు. అలాంటి సమయంలో కాస్త జీతం తగ్గుతుందనగానే సమ్మెలు, ధర్నాలు చేపడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు వారు తమ విధుల్లో ఎంత వరకు న్యాయం చేస్తున్నారన్నది సామాన్యుల ప్రశ్న..?

ఏపీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఆర్సీపై గత కొన్ని నెలలుగా ఆందోళన కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం 11వ వేతన సవరణ సంఘం అమలుకు సంబంధించిన ఫిట్మెంట్, హెచ్ఆర్ఏ విధి విధానాలను రూపొందిస్తూ ఈనెల 17న జీవో జారీ చేసింది. ఈ జీవో ప్రకారం.. 2019 జూలై నుంచి మూలవేతనంపై 27 శాతం ఐఆర్ ప్రకటించి 2020 ఏప్రిల్ నుంచి మానిటరీ ప్రయోజనం కల్పిస్తామని, ఇదే సంవత్సరం జనవరి జీతంతో కలిపి నగదు రూపంలో వేతనాలు చెల్లిస్తామని పేర్కొంది. ఇక కొత్త పీఆర్సీలో ఫిట్మెంట్ ను 23 శాతాన్ని తగ్గించింది. అయితే పీఆర్సీలో ఫిట్మెంట్ తగ్గించారని, ఐఆర్ పెంచడంతో అంతకుముందు వచ్చే జీతం కంటే తమకు తగ్గిందని ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు.
ఏదైనా అవసరం కోసం ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాలంటే సామాన్యుడు భయపడే పరిస్థితి ఎదురైంది. ఎందుకంటే మనకు కావాల్సిన పనిని అనుకున్న సమయంలో ఏ ఒక్క ప్రభుత్వ అధికారి న్యాయంగా చేయడానికి ఒప్పుకోరు. ఎంతో కొంత జేబులో పడందే ఫైలు కదపరు. అలా నయానో.. బయానో.. ముట్టజెప్పినా చీదరింపులు.. చీత్కారాలు సరేసరి. మొత్తంగా ఒక బర్త్ డే సర్టిఫికెట్ కావాలన్నా ఎంతో కొంత ఇవ్వందే పని కాదని ప్రజలకు పూర్తిగా అర్థమైపోయింది. ఓ వైపు ప్రభుత్వం ఇచ్చే లక్షల జీతాలు తీసుకుంటూనే మరోవైపు రోజూవారీ వేతనం లేకుండా కొందరు పనిచేయరు.
రోగం వచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటే కొందరు అక్కడి వైద్యుల ప్రవర్తనే ఆందోళన కలిగిస్తుంది. కొందరు వారు నిర్వర్తించే విధులే అయినా చేతులు తడపందే ముందుకు రారు. అంతేకాకుండా సమయానికి అందుబాటులో ఉండకుండా బయట ఇతర వ్యాపారాలు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తారు. దీంతో చాలా మంది ప్రభుత్వ ఆసుపత్రి అంటేనే వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. అప్పుచేసైనా సరే ప్రైవేట్ ఆసుపత్రుల దారే పడుతున్నారు. అంత స్తోమత లేని వారికి క్లినిక్ లను సంప్రదిస్తున్నారు. ఈ పరిస్థితిని గమనించిన వారు కొందరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తూనే బయట క్లినిక్లు నిర్వహిస్తున్నారు.
ఇంత నిర్లక్ష్యంగా పనిచేసే కొందరు ఉద్యోగులు కాస్త జీతం తగ్గగానే సమ్మెలు, ధర్నాలు అంటున్నారు. లక్షల్లో జీతాలు కావాలి మాకు అంటున్న వారు తమ విధులను ఎంతమంది సక్రమంగా నిర్వర్తిస్తున్నారో చెప్పగలరా..? అంటూ కొందరు విమర్శిస్తున్నారు. పేదల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ సంస్థలు.. ఎవరి కోసం ఉపయోగిస్తున్నారో చెప్పగలరా..? ని కామెంట్లు పెడుతున్నారు. ఓ వైపు ప్రభుత్వ పరిస్థితి చెబుతూ కాస్త సహకరించాలని చెబుతున్నా.. తమకు అనుకున్న పెద్ద మొత్తంలో జీతాలు కావాలని ఆందోళన చేస్తున్నారు. అంతకాకుండా ఇటీవల ప్రభుత్వం రిటైర్మెంట్ వయసు రెండేళ్లు పెంచింది. అయినా తమకు సరిపోదంటూ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనపై రకరకాల విమర్శలు వస్తున్నాయి.