Munugodu TRS: “మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఏం జరిగింది? నిజంగానే ఎమ్మెల్యేలకు తలా 100 ఆఫర్ ఇచ్చేంత సీన్ ఉందా? నిజంగానే నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ను బిజెపి కొనేందుకు ప్రయత్నించింది. కానీ సీఎం కేసీఆర్ దాన్ని సరిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నాడు. కానీ ఆ ఆడియో క్లిప్పులు నిజమే.. వీడియోలు కూడా త్వరలో బయటికి వస్తాయి” అని చాలామంది నమ్ముతున్నారు. ఇందులో పాత్రికేయులు కూడా ఉన్నారు. కానీ ఇంత సుదీర్ఘమైన చర్చలో విస్మరిస్తున్న అసలు విషయాలు ఎన్నో?

అసలు ఎవరు వారు
ఊళ్లల్లో దొంగ కోళ్ళు పట్టుకునే బ్యాచ్ మాదిరి కనిపిస్తున్న ఆ మధ్యవర్తులు ఎవరు? వాళ్లు ఏది చెప్తే అదే అల్టిమేటా? వాళ్ల వెనుక ఉన్నది ఎవరు? వాళ్ల లక్ష్యం ఏమిటి? ఎవరిని పడితే వారిని కొనుగోలు చేసేందుకు బిజెపి ఎంగేజ్ చేస్తోందా? ఇవి కదా ఇప్పుడు జవాబు చెప్పాల్సిన ప్రశ్నలు? సగటు పాత్రికేయం సంధించాల్సిన ప్రశ్నలు? కానీ ఇక్కడ అది లోపించింది. నలుగురు ఎమ్మెల్యేలను కొనేస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుందా? ఆ దొంగకోళ్ల బ్యాచ్ కు కొనుగోలు బాధ్యత అప్పగించింది ఎవరు? లేక బలవంతంగా ఇంకా ఎవరైనా స్కెచ్ వేశారా? పార్టీలో చేరికలు వేరు? ఎమ్మెల్యేల కొనుగోలు వేరు? ఈ రెండింటికి చాలా తేడా ఉంది. ఒకవేళ కెసిఆర్ ప్రభుత్వాన్ని కూల దోయాలి అనుకుంటే ఎందరిని కొనాలి? ఇప్పుడు ఆ అవసరం భారతీయ జనతా పార్టీకి ఎందుకు వచ్చింది? చివరకు అందరికంటే భిన్నంగా ఆలోచిస్తాడు? టెంపర్మెంట్ ఉన్న జర్నలిజాన్ని ప్రదర్శిస్తాడు అనుకున్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా ఎమ్మెల్యేల కొనుగోలు నిజమే అని తేల్చిపారేశాడు. చంద్రబాబు విషయంలో చేసిన రచ్చ బిజెపి విషయంలో కెసిఆర్ చేయలేకపోయాడు అని రాసుకొచ్చాడు.
ఈ విషయాలను ఎందుకు విస్మరిస్తున్నట్టు
ఈ విషయంలో తొలిరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిపిన టిఆర్ఎస్ నాయకులు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. సాక్షాత్తు టిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, షాడో సీఎం కేటీఆర్ ఎవరూ మాట్లాడవద్దని ఆర్డర్ వేశాడు. ఈ ఫామ్ హౌస్ డీల్ ని జాతీయ మీడియా కూడా పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. ఇక దీనిపై టిఆర్ఎస్ ఎంతో గొప్ప స్పందన ఆశిస్తే.. చివరికి జరిగింది వేరేలా ఉంది. సో ఈ కోణంలో చూసినా బిజెపిని టిఆర్ఎస్ దోషిగా నిలబెట్ట లేకపోయింది. బిజెపి పెద్దల్ని ఎక్కడ ఫిక్స్ చేద్దామా అని కెసిఆర్ చూస్తున్నాడు. రకరకాల ప్లాన్లు వేస్తున్నాడు. కానీ స్కెచ్, స్క్రీన్ ప్లే ఎక్కడో తేడా కొడుతోంది. పిక్చర్ అబీ బాకీ హై, ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రొకోడైల్ ఫెస్టివల్ అని అంటున్నారు.
పక్కా ఆధారాలు చూపగలదా?
ఒకవేళ టిఆర్ఎస్ పక్కా ఆధారాల్ని గనుక చూపగలిగితే బిజెపిని కాస్తయినా డిఫెన్స్ లో పడేయవచ్చు. కానీ ఈ లెక్కన చూస్తే తెలంగాణలో మొదటి నుంచి కెసిఆరే దోషిగా నిలబడాల్సి ఉంటుంది. ఎడాపెడా విపక్ష ప్రజాప్రతినిధుల్ని ప్రలోభాలతో లాగేయడం, పార్టీలను విలీనం చేసేసుకోవడం.. ఈ ఎనిమిది సంవత్సరాల లో కెసిఆర్ చేసిన అకృత్య రాజకీయాలు అన్ని ఇన్ని కావు. అసలు ఆ నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు కాంగ్రెస్ నుంచి వచ్చిన వారే కదా. కెసిఆర్ ఇంతా చెడి మొయినాబాద్ ఎపిసోడ్ పకడ్బందీగా రూపొందిస్తే దక్కిన పొలిటికల్ ఫాయిదా ఎంత? ఇదీ కదా అసలు ప్రశ్న?! అసలు టిఆర్ఎస్ లోనే ధిక్కార స్వరాలు పెరిగిపోతున్నాయా? వాళ్లకు కళ్లెం వేసి, బిజెపి నాయకులను ఫిక్స్ చేయాలని స్కెచ్ గీశాడా? తాను ఒకటి అనుకుంటే.. ఫామ్ హౌస్ ఒకటి తలచిందా? కేటీఆర్ అంటున్నట్టు అసలు సినిమా ముందుందా? లేక అది మేకపోతు గంభీర్యమా? ఇన్ని ప్రశ్నలకు ఈరోజు జరిగే బహిరంగ సభలోనైనా కేసీఆర్ సమాధానం చెప్తాడా? లేక తనకు అలవాటైన క్రియారహిత్యం అయితే వెళ్తాడా? ఈ సస్పెన్స్ కు మరికొద్ది గంటల్లో తెరదించేది కేసీఆరే.