Election Commission Of India: దేశంలో ఎలక్షన్ కమిషన్ ది యాక్టివ్ రోల్. రాజ్యాంగబద్ధంగా దేశానికి ప్రజా ప్రభుత్వాన్ని అందించాల్సిన గురుతర బాధ్యత ఎలక్షన్ కమిషన్ పై ఉంది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ పక్షాలు అధికం. అవి నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించడమే కాకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించి… ప్రజా ప్రభుత్వాన్ని అందించే బాధ్యత కూడా ఈసీపైనే ఉంది. కానీ ఇటీవల కాలంలో ఎలక్షన్ కమిషన్ తీరు వివాదాస్పదమవుతోంది. కేంద్ర సంస్థల మాదిరిగా.. అది కేంద్ర పాలకుల జేబు సంస్థగా మారిపోయిందన్న ఆరోపణలను ఎదుర్కొంటోంది. రాజ్యాంగ వ్యవస్థ కాస్తా నీరసించి తనకున్న పరిధిని తగ్గించుకొని వ్యవహరిస్తోందన్న అపవాదు మూటగట్టుకొంది. తాను అచేతనం అవ్వడమే కాకుండా.. అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనం చేస్తోందన్న ఆరోపణలకు,విమర్శలకు అవకాశమిస్తోంది. టీఎన్ శేషన్ లాంటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మళ్లీ ఎందుకు రాలేదు? అని దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించిందంటే.. ఎలక్షన్ కమిషన్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఎంతో లోతైన విశ్లేషణ జరగకపోతే.. లోపాలు వెలుగుచూడకపోతే న్యాయమూర్తులు ఇంత కఠినతరమైన వ్యాఖ్య చేసి ఉండరు కదా అన్న విషయాన్ని గుర్తించుకోవాలి.

భారతీయ జనతా పార్టీ అనూహ్య, అద్భుత విజయాలు వెనుక పోల్ మేనేజ్ మెంట్ ప్రధానమని ఎప్పటి నుంచో ఒక కామెంట్ ఉంది. పొలిటికల్ పార్టీగా వ్యూహాలు రూపొందించడంలో పోల్ మేనేజ్ మెంట్అనేది ఒకటి. కానీ అది ఎన్నికల కమిషన్ ను ప్రభావితం చేసేటంతంగా పోల్ మేనేజ్ మెంట్ చేస్తోందన్న విమర్శ రోజురోజుకూ పెరుగుతోంది. బీజేపీకి బలం లేకున్నా.. ఆ పార్టీ ఉనికి లేని రాష్ట్రాల్లో సైతం అక్కడి పాలకులు భయపడుతుంది ఈ తరహా పోల్ మేనేజ్ మెంట్ కేనన్నది బహిరంగ రహస్యం. భారత ప్రజాస్వామ్యానికి ప్రతీక ఎన్నికలు. అటువంటి ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రభుత్వ జోక్యం లేకుండా నిర్వహించేందుకు రాజ్యాంగం ఒక స్వతంత్రప్రతిపత్తిగల ఎన్నికల సంఘాన్ని ఏర్పాటుచేసింది. కానీ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని అందించే ఎన్నికల సంఘం కేంద్ర పాలకుల జేబు సంస్థగా మారిపోవడం.. శేషన్ శకం ముగిసన తరువాతే ఆరంభమైంది. ప్రజాస్వామ్యాన్ని పెను విఘాతంగా సంభవించింది.
2019లో కేంద్రంలో రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఊహించని మెజార్టీ సాధించింది. అయితే ఈ అద్భుత విజయాన్ని బీజేపీతో పాటు మిత్రపక్షాలు ప్రధాని మోదీ చరిష్మానే కారణంగా చూపాయి. ఇది వాస్తవమే అయినా.. ప్రజాస్వామ్యవాదులు, ఎన్నికల నిర్వహణపై అవగాహన ఉండే విశ్లేషకులు మాత్రం ఆ విజయాన్ని ప్రధానికి ఇవ్వలేదు. ఇచ్చేందుకు ఇష్టపడలేదు. బీజేపీ విజయానికి ముమ్మాటికీ అప్పటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా కారణమంటూ కామెంట్స్ చేశారు. నాడు బీజేపీకి అనుకూలంగా ఆయన వ్యవహరించారని.. ఒంటిచేత్తో బీజేపీని గెలిపించారని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఒక్క ఆ ఎన్నికలతోనే కాదు.. అటు తరువాత వచ్చిన ప్రతీ ఎన్నికల్లోనూ ఎలక్షన్ కమిషన్ తీరు వివాదాస్పదమవుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అనుకూలంగా… ప్రత్యర్థి పార్టీలకు ఇబ్బంది పెట్టేలా ఈసీ నిర్ణయాలు తీసుకుంటుందన్న అపవాదు ఉంది. అటు ఈసీ వ్యవహార శైలి కూడా ఈ అపవాదుకు మరింత దగ్గరగా ఉంది. తాజాగా హిమచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల నిర్వహణ కూడా బీజేపీకి అనుకూలంగా మలిచారన్న టాక్ ఉంది. రెండు రాష్ట్రాల ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని ఉన్నా.. ముందుగా హిమచల్ ప్రదేశ్, తరువాత గుజరాత్ ఎన్నికలకు షెడ్యూలిచ్చారు. బీజేపీ నేతల ప్రచార కోసం ఈ వెసులబాటు కల్పించారని స్పష్టంగా అర్ధమవుతోంది. అటువంటిదేమీ లేదని ఈసీ ప్రకటించినా.. లోగుట్టు మాత్రం బీజేపీ ప్రయోజనాల కోసమేనని సగటు రాజకీయాలపై అవగాహన ఉన్న ఎవరికైనా అర్ధమైపోతుంది.

ఎన్నికల నిర్వహణలో ఎన్నెన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. పేపర్ బ్యాలెట్ స్థానంలో ఈవీఎంలు వచ్చాయి. ఓటరు జాబితా వెల్లడి నుంచి ఓటు నమోదు వరకూ ఆన్ లైన్ వ్యవస్థ తీసుకొచ్చారు. అటు రాజ్యాంగం కూడా ఎలక్షన్ కమిషన్ కు ఎన్నో విచక్షణాధికారాలను ఇచ్చింది. అంతవరకూ బాగానే ఉంది కానీ..ఎన్నికల నిర్వహణ కంటూ ప్రత్యేక వ్యవస్థ అంటూ ఏదీ లేదు. ఆయా ప్రభుత్వాల యంత్రాంగాలపైనే ఆధారపడి ఈసీ పనులు చక్కబెట్టుకోవాలి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నంత కాలం ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ఈసీ కింద పనిచేస్తారు. కోడ్ ముగిసిన వెంటనే తమ మాతృ విధుల్లోకి వెళ్లిపోతారు., అయితే వారి నిడివి, పాత్రలు అంతా ప్రభుత్వాలపై ఆధార పడి ఉంటాయి. ఎప్పుడో ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల సమయంలో మాత్రమే వారు ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వెళతారు. అందుకే నిర్భయంగా, నిస్సోంకోచంగా, పారదర్శకంగా, రాజకీయాలకతీతంగా పనిచేయడం కత్తిమీద సామే. వారు నిబద్ధతో పనిచేస్తారని కోరుకోవడం భ్రమే అవుతుంది. ఇప్పుడు అదే జాబితాలో ఎలక్షన్ కమిషనర్లు, అధికారులు చేరిపోవడం మాత్రం విషాదకర అంశం.
ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలి చర్చకు వస్తే శేషన్ కు ముంద.. శేషన్ తరువాత అన్న పాయింట్ రైజ్ అవుతుంది. సామాన్యుల నుంచి సుప్రిం కోర్టు వరకూ ఇదే చర్చకు వస్తుంది. అప్పటివరకూ ఎలక్షన్ కమిషన్ అనేది ఒక వ్యవస్థ. కానీ దానిని బయటకు తెచ్చింది మాత్రం టీఎన్ శేషన్. ఎన్నికల నిర్వహణలో సమూల మార్పులు తీసుకొచ్చారు. సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. నాటి ప్రధాని పీవీ నరసింహరావు నుంచి బిహార్ సీఎం లాలూప్రసాద్ యాదవ్ వరకూ ఎవర్నీ లెక్క చేయలేదు. ఇండియన్ పాలిటిక్స్ నే షేక్ చేసేలా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. అమలు చేసి చూపించారు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చులకు లెక్కలు చెప్పాలని..నిర్ధేశించిన మొత్తానికిఖర్చు దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రచారంలో వినియోగించే వాహనాల ఖర్చు.. కార్యకర్తల భోజనాల వ్యయం..పార్టీ ప్రచార ఖర్చులను కట్టుదిట్టం చేశారు. వాహనాలకు జండా కట్టాలన్నా.. లౌడ్ స్పీకర్ కట్టాలన్న అనుమతిని తప్పనిసరి చేశారు.చివరకు గోడలపై రాతలను కూడా నిషేధించి ప్రత్యేక ఉత్తర్వులిచ్చారు. బిహార్ ఎన్నికల ను సుదీర్ఘ కాలం జరిపించారు. బిహార్ లో ప్రజాస్వామ్య పునాదులు పడింది శేషన్ హయాం నుంచే అని దేశ ప్రజలు మాట్లాడుకునేలా శేషన్ వ్యవహరించారు.
తెలుగు రాష్ట్రాల విషయంలో ఈసీ వ్యవహార శైలి ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో బీజేపీ పెద్దల సహకారంతో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. కానీ అక్కడ 40 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే విషయం అయినా.. ఎలక్షన్ కమిషన్ సారీ అన్న మాటతో సరిపెట్టేశారు. ఏపీలో అయితే ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్న ద్వివేదిని అచేతనం చేసి సీఎస్ సుబ్రహ్మణ్యానికి బాధ్యతలు కట్టబెట్టారు. ఆయన అప్పటి విపక్ష వైసీపీకి లాభం చేకూర్చే పనులు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. వైసీపీకి నచ్చి, మెచ్చిన అధికారులకు పోస్టింగులు ఇప్పించడం నుంచి పోల్ మేనేజ్ మెంట్ మొత్తం ఆ పార్టీకి అనుకూలంగా సాగిందన్న ఆరోపణలున్నాయి. ఒక్క ఏపీయే కాదు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈసీ తన పరిధి దాటి వ్యవహరించిందన్న కామెంట్స్ వినిపించాయి. ఇప్పటికీ వినిపిస్తున్నాయి.
దేశ వ్యాప్తంగా ఈసీ ఎదుర్కొంటున్న ఆరోపణల నేపథ్యంలో న్యాయమూర్తుల నియామకం ‘కొలీజియం’ తరహాలో ఎన్నికల కమిషనర్లు, అధికారుల నియామకం చేపట్టాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఇందుకు సంబంధించి సుప్రీం కోర్టులో ఒక పిటీషన్ దాఖలైంది. ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు, ఈసీ పాత్రపై అత్యున్నత న్యాయస్థానంలో సుదీర్ఘ చర్చ జరిగింది. కానీ తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. ఈ కేసులో లిఖితపూర్వక వాదనలు దాఖలు చేసేందుకు.. వాద, ప్రతివాదులకు కొంత సమయం ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టులో తాజా పిటీషన్ తో మాత్రం దేశ వ్యాప్తంగా ఈసీ పాత్రపై చర్చ అయితే ప్రారంభమైంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఈసీల నియామక ప్రక్రియ మార్పు, స్వతంత్ర్య ప్యానల్ వ్యస్థ ఏర్పాటు వంటి వాటికి మాత్రం మరికొద్దిరోజులు సమయం పట్టే అవకాశాలైతే ఉన్నాయి. అయితే టీఎన్ శేషన్ లా నిబంధనలు పక్కాగా అమలుచేసి ఉంటే సుప్రీం కోర్టు తలుపు తట్టే అవకాశమైతే వచ్చి ఉండేది కాదు.