India vs New Zealand 1st Odi: చాలా రోజుల నుంచి జట్టుకు దూరంగా ఉన్నాను అనే బాధో, కెప్టెన్ అనే బాధ్యతో తెలియదు గాని.. న్యూజిలాండ్ లో జరుగుతున్న మూడు వన్డేల సీరిస్ లో భాగంగా శుక్రవారం ఆక్లాండ్ వేదికగా జరిగిన మ్యాచ్లో గబ్బర్ శిఖర్ ధావన్ రెచ్చిపోయాడు. ఒకప్పటి తన బ్యాటింగ్ స్టైల్ న్యూజిలాండ్ ఆటగాళ్లకు రుచి చూపించాడు.. 77 బంతుల్లో 72 పరుగులు చేశాడు.. ఇందులో 13 ఫోర్లు ఉండటం గమనార్హం. మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ 65 బంతుల్లో 50 పరుగులు చేసి పర్వాలేదు అనిపించాడు. తొలి వికెట్ కు వీరిద్దరూ కలిసి 124 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇదే తరుణంలో ఫెర్గ్యూసన్ బౌలింగ్లో ఇద్దరు వెంట వెంటనే అవుట్ అయ్యారు. దీంతో భారత్ కష్టాల్లో పడింది. ఈ సమయంలో బ్యాటింగ్ కు వచ్చిన రిషబ్ పంత్ 15 పరుగులు చేసి ఎప్పటిలాగే నిరాశపరిచాడు. ఇక సూర్య కుమార్ యాదవ్ కూడా ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయాడు.

ఆదుకున్నారు
ఈ సమయంలో బ్యాటింగ్ కు దిగిన సంజు శాంసన్, శ్రేయస్ అయ్యర్ సమయోచితంగా ఆడారు. అభేద్యమైన ఐదో వికెట్ కు 84 పరుగులు జోడించారు.. సంజు శాంసన్ 36 పరుగులు చేశాడు. అతడు అవుట్ అయినప్పటికీ శ్రేయాస్ అయ్యర్ సుందర్ తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్ కు 46 పరుగుల భాగస్వామ్యం జోడించారు. వ్యక్తిగత స్కోర్ 80 పరుగుల వద్ద వికెట్ గా శ్రేయస్ అయ్యర్ వెనుతిరిగాడు. సెంచరీ చేస్తాడు అనుకునే క్రమంలో ధాటిగా ఆడబోయి క్యాచ్ అవుట్ అయ్యాడు. మొత్తానికి 50 ఓవర్లకు ఏడు వికెట్ల నష్టానికి భారత్ 306 పరుగులు చేసింది.
కెప్టెన్ గా శిఖర్
టి20 సిరీస్ విజయం అనంతరం హార్దిక్ పాండ్యా విశ్రాంతి తీసుకున్నాడు. భార్యా పిల్లలతో గడిపేందుకు అతడు స్వదేశానికి చేరుకున్నాడు. దీంతో టీం ఇండియా కెప్టెన్ గా శిఖర్ ధావన్ వ్యవహరిస్తున్నాడు.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. ఇన్నింగ్స్ ధాటిగా ఆరంభించింది. తొలి వికెట్ కు 124 పరుగులు జోడించడంతో భారత్ 350 పైచిలుకు పరుగులు చేస్తుంది అనుకున్నారు.. మధ్యలో న్యూజిలాండ్ బౌలర్లు వెంట వెంటనే వికెట్లు తీయడంతో భారత్ కష్టాల్లో పడింది.. అయితే ఈ సమయంలో సంజు, శ్రేయస్ అయ్యర్ భారత జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి 80 పరుగుల పైచిలుకు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఏడు వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసిన భారత్.. న్యూజిలాండ్ ఎదుట 307 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.. సీమర్లకు అంతంతమాత్రంగా సహకరిస్తున్న పిచ్ పై వికెట్లు ఏ విధంగా రాబడతారు అనేది భారత బౌలర్ల ప్రదర్శన మీద ఆధారపడి ఉంది. ఇక టి20 సిరీస్ గెలిచిన ఉత్సాహంతో భారత క్రీడాకారులు ఉన్నారు. కనీసం వన్డే సిరీస్ అయినా నెగ్గాలని న్యూజిలాండ్ క్రీడాకారులు పట్టుదలతో ఉన్నారు.

వణికించిన ఫెర్గ్యూసన్
భారత బ్యాట్స్మెన్ దాటిగా ఆడుతున్న నేపథ్యంలో.. న్యూజిలాండ్ బౌలర్ ఫెర్గ్యూసన్ భారీ స్కోర్ సాధించకుండా అడ్డుకట్ట వేశాడు. వెంట వెంటనే మూడు కీలక వికెట్లు తీసి భారత జట్టును ఇబ్బందుల్లోకి నెట్టాడు. రిషబ్ పంత్, శిఖర్ ధావన్, సూర్య కుమార్ యాదవ్ ఫెర్గ్యూసన్ బౌలింగ్లో అవుట్ అయ్యారు.. ఒకవేళ వారు అవుట్ కాకపోయి ఉంటే భారత్ 350 పరుగుల పైచిలుకు లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందు ఉంచేది.