R S Praveen Kumar: పరిటాల రవి హత్య వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందా?

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 2005లో ఉమ్మడి అనంతపురం జిల్లా ఎస్పీగా పనిచేశారు. అప్పట్లో ఆ జిల్లాలో ఫ్యాక్షన్ గొడవలు అధికంగా ఉండేవి. టిడిపి, కాంగ్రెస్ నాయకుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు మనే పరిస్థితి ఉండేది.

Written By: Anabothula Bhaskar, Updated On : November 23, 2023 8:44 am

R S Praveen Kumar

Follow us on

R S Praveen Kumar: 2005, జనవరి 25.. ఈ తేదీ గుర్తుకొస్తే ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలు మాత్రమే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రజలు కూడా ఉలిక్కి పడుతుంటారు. ఎందుకంటే నాడు జరిగిన సంఘటన అత్యంత దారుణమైనది కాబట్టి. ఆరోజు తెలుగుదేశం పార్టీకి చెందిన రాష్ట్ర నాయకుడు పరిటాల రవీంద్ర అలియాస్ రవి దారుణ హత్యకు గురయ్యారు. ఆ సంఘటన రాష్ట్రాన్ని ఒక కుదుపు కుదిపింది. దాదాపు కొన్ని నెలలపాటు ఈ సంఘటన తాలూకూ వార్తలే మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. సహజంగానే అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీరును విమర్శించారు. ఇతర వర్గాల నుంచి కూడా నిరసన గళం తీవ్రతరం కావడంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత ఈ విచారణలో మొద్దు శీను, భానుమతి, ఇంకా చాలామంది పేర్లు వినిపించాయి. మొద్దు శీను అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇప్పటికీ ఈ కేసు ఒక కొలిక్కి రాలేదని పరిటాల అభిమానులు అంటూ ఉంటారు.. అయితే ఈ కేసులో అప్పట్లో పెద్దగా వినిపించని పేరు, ఇప్పుడు వినిపిస్తున్న పేరు ఒకటి ఉంది. అతని పేరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. నాడు పరిటాల రవి హత్యకు సంబంధించి ఏం జరిగింది? అనంతపురం జిల్లా ఎస్పీగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం చేశారు? ఇప్పుడే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు ప్రముఖంగా ఎందుకు వినిపిస్తోంది? ఈ ప్రశ్నలకు స్వయంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే క్లారిటీ ఇచ్చారు.

నాడు ఏం జరిగింది?

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 2005లో ఉమ్మడి అనంతపురం జిల్లా ఎస్పీగా పనిచేశారు. అప్పట్లో ఆ జిల్లాలో ఫ్యాక్షన్ గొడవలు అధికంగా ఉండేవి. టిడిపి, కాంగ్రెస్ నాయకుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు మనే పరిస్థితి ఉండేది. అయితే అప్పుడు అనంతపురం జిల్లా టిడిపి రాజకీయాలను పరిటాల రవీంద్ర శాసిస్తూ ఉండేవారు. ఆయనది కూడా ఫ్యాక్షన్ నేపథ్యం కావడంతో సహజంగానే ఆయనకు శత్రువులు కూడా ఎక్కువగా ఉండేవారు. ఇదే విషయాన్ని పలమార్లు పోలీసులు ఆయనకు చెప్పారు. అయితే అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో రవీంద్ర కు సంబంధించి సరయిన భద్రత కల్పించలేదు అని ఆరోపణలు ఉన్నాయి. అలా భద్రత కల్పించకపోవడం వల్లే ఆయన చనిపోయారని రవీంద్ర అభిమానులు ఇప్పటికీ అంటూ ఉంటారు. అయితే నాడు పరిటాల రవి హత్యకు గురవుతారని మీకు ముందే తెలుసా? అని ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ పాత్రికేయులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ప్రశ్నించారు. దీనికి ఆయన ఎస్ అనే సమాధానం చెప్పారు. నాడు చర్లపల్లి జైలులో పరిటాల రవికి హత్యకు సంబంధించి ప్రణాళిక జరుగుతోందని తనకు సమాచారం అందిందని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.. అదే విషయాన్ని ఒక లేఖ రూపంలో అనాటి డీజీపీ కి రాశారు. అయినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఒక జిల్లా ఎస్పీగా నాకు పరిధి కొంత వరకే ఉంటుందని ప్రవీణ్ కుమార్ వివరించే ప్రయత్నం చేశారు.

ప్రమేయం ఉందా?

ఇక నాడు పరిటాల రవి హత్య కు సంబంధించి మీ ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి కదా అని ఆ ప్రైవేట్ న్యూస్ ఛానల్ ప్రతినిధులు ప్రశ్నిస్తే.. ” పరిటాల రవి హత్య కేసును సిబిఐ ఎంక్వయిరీ చేసింది. అన్ని రోజులపాటు సిబిఐ ఎంక్వయిరీ చేస్తే.. ఒకవేళ ఆ హత్యలో నా ప్రమేయం ఉంటే కచ్చితంగా అరెస్టు చేసేది కదా? నేను జైలుకు వెళ్లే వాడిని కదా? మరి నన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు? సిబిఐకి కేంద్ర హోం శాఖ మంత్రి చిదంబరాన్ని అరెస్ట్ చేసిన చరిత్ర ఉంది. నన్ను అరెస్టు చేయలేదంటే నేను ఏ తప్పూ చేయలేదనే కదా” అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బదులిచ్చారు. అంతేకాదు నాడు తాను లేఖ రాసినప్పుడు అప్పటి డిజిపి పట్టించుకుని ఉంటే బాగుండేదనే అర్థం వచ్చేలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమాధానం ఇచ్చారు. అంటే ఆయన చేసిన వ్యాఖ్యల ద్వారా నాడు పరిటాల రవి హత్యలో అనేకమంది పెద్దలు ఇందులో ఉన్నారని తేలిపోయింది. కాకపోతే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు పైకి రావడం ఆసక్తి కలిగిస్తున్నది. నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నడుచుకున్నారని, పరిటాల రవి హత్యకు సంబంధించి ఆయన ప్రమేయం కూడా ఉందని, పరిటాల రవి అభిమానులు నేటికీ ఆరోపిస్తూనే ఉంటారు.