
Pawan Kalyan : రాబోయే ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతను చీలకుండా ఉండేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎంలను కలుపుకొని వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చిన చిక్కంతా తెలుగుదేశం పార్టీతోనే. పవన్ కల్యాణ్ కీ రోల్ గా మారేందుకు చంద్రబాబు సిద్ధపడతారా లేదా అన్నది ప్రధాన ప్రశ్నగా మారింది.
గత ఏడాది జనవరిలో గుంటూరులో జరిగిన బహిరంగ సభలో ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైందని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. 2024లో జరగనున్న ఎన్నికల్లో వైసీపీని గద్దె దింపేందుకు కలికట్టుగా పోరాడదామని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం టీడీపీ, జనసేనలపై ఏకపక్ష పోరును ప్రారంభించింది. ఆ పార్టీల నేతలను క్షేత్ర స్థాయిలో పలురకాలుగా ఇబ్బందులు గురిచేస్తున్నారు. విశాఖలో పవన్ కల్యాణ్ కు ఆ చేదు అనుభవాన్ని రుచి చూపించారు.
ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వామపక్ష పార్టీలు టీడీపీ సపోర్టును తీసుకున్నాయి. వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రత్యక్షంగా తెలియజేశాయి. పవన్ కల్యాణ్ కూడా అదే కోరుకుంటున్నారు. రాష్ట్రంలో వైసీపీ అవినీతి, అరాచకత్వం పెరిగిపోతుందని, కులాల పరంగా ప్రజలను విడగొట్టి పబ్బం గుడపుకునేలా దుష్ట పరిపాలన సాగిస్తుందని పవన్ కల్యాణ్ ఇటీవల మచిలీపట్నంలో జరిగిన ఆవిర్భావ సభలో అన్నారు. ముందు ముందు ఇలాగే కొనసాగితే రాష్ట్రం అధోగతిపాలవుతుందని స్పష్టం చేశారు. కుప్పంలో జరిగిన ఓ సమావేశంలో పవన్ కల్యాణ్ ప్రతిపాదనపై సుముఖంగా ఉన్నట్లు చంద్రబాబు ప్రకటించారు.
విశాఖ ఘటన అనంతరం చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు సంఘీభావం ప్రకటించారు. ఇరువురి భేటీ రాష్ట్రంలో ఆసక్తికర రాజకీయ చర్చకు దారితీసింది. టీడీపీ, జనసేన కలిసి వెళ్లేందుకు సిద్దమవుతున్నట్లు వార్తలు వచ్చాయి. వైసీపీ నేతలు మండిపడటం సహజం. ఎందుకంటే వారిరువురు కలవకూడదని జగన్ కోరుకుంటున్నారు. అయితే, టీడీపీ, జనసేన
ఇప్పటికీ పొత్తుపై స్పష్టమైన సంకేతాలు ఇవ్వలేదు.
ఇటీవల ఢిల్లీ పర్యటనలో బీజేపీకి దగ్గరగా టీడీపీని తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీలన్నీ జనసేను సపోర్టు ఇస్తున్నాయని, సహకారం అందిస్తే రాబోవు ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, బీజేపీ నేతలు టీడీపీ పరిస్థితి ఏంటని, జనసేనతో కలిసి వచ్చే అవకాశాలపై ఆరా తీసినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో జనసేన కూటమిలోకి చంద్రబాబు వస్తారా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఒకవేళ అదే జరిగితే టీడీపీ కొన్ని స్థానాలు వదులుకోవాలి. కుదరని పక్షంలో జనసేన ఒంటరిగా ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు భారీగా ఓట్లు చీలి టీడీపీకి నష్టం జరిగే అవకాశం ఉంది. పవన్ అనుకుంటున్న ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటమనేది ప్రధాన అంశం. వచ్చిన చిక్కంతా టీడీపీతోనే అని జనసేన నేతలు కూడా అంటున్నారు. చంద్రబాబు తీసుకునే నిర్ణయం మీదే ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.