Vangaveeti Mohan Ranga Birth Anniversary: వంగవీటి మోహన్ రంగా.. పరిచయం అక్కర్లేని పేరు. ఉమ్మడి రాష్ట్రంలో బెజవాడకు ఎంత పేరుందో.. అక్కడే పుట్టి పెరిగిన వంగవీటి మోహన్ రంగాకు అంతే పేరు ఉంది.ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. ఆయన భౌతికంగా ఈ లోకానికి దూరమై మూడు దశాబ్దాలు దాటుతున్నా నేటికీ ఏపీ పాలిటిక్స్ లో ఆయన పేరు వైబ్రేషన్ సృష్టిస్తోంది. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి ఆయన పేరు మార్మోగిపోతోంది. మోహన్ రంగా కాపు నాయకుడే కాదు.. బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచిన నాయకుడు కూడా.
కేవలం రెండుసార్లు మాత్రమే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినా..ఏపీ పొలిటికల్ హిస్టరీనే శాసించిన అనితర సాధ్యుడిగా గుర్తింపుపొందారు వంగవీటి మోహనరంగా. మంగళవారం ఆయన జయంతి. రంగ భక్తులు కన్నీటి నివాళులు ఆర్పించేందుకు సిద్ధపడుతుండగా.. పొలిటికల్ పార్టీలు మాత్రం ఆయన తమ వాడిగా గుర్తించేందుకు ఆరాటపడుతున్నాయి. అందుకే పోటాపోటీగా జయంతి వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. మరో ఏడాదిలో ఎన్నికలు ఉండడంతో రంగా జయంతి సాక్షిగా చలిమంటను రేపుతున్నాయి. కాపులతో పాటు బడుగు బలహీనవర్గాల ఓట్ల కోసం సరికొత్త రాజకీయ గేమ్ ఆడుతున్నాయి.
ముఖ్యంగా కాపు సంఘాలన్నీ ఏకతాటిపైకి వస్తున్నాయి. రాయలసేన పేరిట రంగా జయంతిని పెద్దఎత్తున ప్లాన్ చేస్తున్నాయి. టీడీపీ, జనసేన సానుభూతిపరులు వేలాది మందితో మీటింగ్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వైసీపీ ఆధ్వర్యంలో రంగా జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. అటు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ వేర్వేరుగా కార్యక్రమాల నిర్వహణకు నిర్ణయించాయి. ఇలా అన్ని పార్టీలు పోటాపోటీగా రంగా జయంతి వేడుకలకు ప్లాన్ చేయడంతో బెజవాడ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.
వంగవీటి మోహన్ రంగాను ఓన్ చేసుకుంటున్న పార్టీలు ఆ కుటుంబానికి మాత్రం రాజకీయంగా గుర్తింపునివ్వలేదు. ప్రస్తుతం మోహన్ రంగా సోదరుడు నరేంద్ర బీజేపీలో, కుమారుడు రాధాక్రిష్ణ టీడీపీలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉంటూ మోహన్ రంగా హత్యకు గురయ్యారు. అప్పటి టీడీపీ ప్రభుత్వంపై ఈ హత్య మరక అంటింది. కానీ తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హత్యను సీరియస్ గా తీసుకోలేదు. విచారణ చేపట్టలేదు. పైగా సాక్షాలు లేవంటూ కేసు క్లోజ్ చేసింది. 2004 లో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రంగా వారసుడు రాధాను పిలిచి టిక్కెట్ ఇచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. 2009లో పీఆర్పీలో చేరిన రాధా ఆ ఎన్నికల్లో ఓడిపోయారు.
2010లో వైసీపీ ఆవిర్భావంతో జగన్ వెంట నడిచారు వంగవీటి రాధాక్రిష్ణ. నాడు మోహన్ రంగా పేరు చెప్పి ఓట్లు కొల్లగొట్టిన జగన్ ఆయన వారసుడు రాధాను దారుణంగా వంచించారు. టిక్కెట్ విషయంలో మొండిచేయి చూపారు. దీంతో టీడీపీలోకి వెళ్లాల్సిన అనివార్య పరిస్థితిని కల్పించారు. కనీసం జయంతి, వర్ధంతి నాడు మోహన్ రంగాకు నివాళులర్పించేందుకు సైతం జగన్ కు మనసురాలేదు. కానీ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో కాపులతో పాటు బడుగు బలహీనవర్గాల ఓట్ల కోసం పార్టీ నాయకులతో జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. మిగతా అన్ని రాజకీయ పార్టీలదీ అదే తీరు. అందుకే కాపు సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. రాయలసేన పేరుతో భారీ కార్యక్రమాన్ని ప్లాన్ చేశాయి. కాపులకు దిశా నిర్దేశం చేయనున్నాయి. ముఖ్యంగా కాపులు జనసేన వైపు సంఘటితం చేసే బాధ్యతను తీసుకోనున్నాయి అనే టాక్ నడుస్తోంది. చూడాలి మరీ ఏం జరుగుతుందో?