
Ramoji Rao : పెద్ద అంబర్ పేట పంచాయతీ పరిధిలో అబ్దుల్లా పూర్ మెట్ కు సమీపంలో ఉంటుంది రామోజీ ఫిలిం సిటీ. కంటి చూపు ఎంత పరిధి మేరకు చూస్తుందో అంతవరకు రామోజీ ఫిలిం సిటీ విస్తరించి ఉంటుంది..బాలీవుడ్ నుంచి భోజ్ పూరి వరకు ఎన్నో సినిమాలు అక్కడ రూపుదిద్దుకుంటూ ఉంటాయి.. వచ్చేవారు వస్తుంటారు. పోయేవారు పోతుంటారు.. కానీ ఆ ఫిలిం సిటీ లో ఎవరికీ కనిపించని ఒక అద్భుతం ఉంటుంది. అది అద్భుతమనాలో అద్భుతానికే అత్యంత అద్భుతం అనాలో తెలియదు కానీ.. అది ఒక శత్రు దుర్భేద్యమైన శ్వేత సౌధపుకోట. అక్కడ పని చేసే వారికి కూడా ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ వాళ్లెవరూ బయటి ప్రపంచానికి తెలియక పోయినప్పటికీ.. తెలుగు మీడియా ప్రపంచాన్ని ఏలుతున్న ఓ వ్యక్తికి సపర్యలు చేసే భాగ్యం వారికి కొన్ని ఏళ్లుగా దక్కుతోంది. భాగ్యం అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే… రోజుకు రకరకాల టిఫిన్లు, పంచభక్ష పరమాన్నాలతో కూడిన భోజనం, నెల మొదటి తారీఖున పడే జీతం, ఇతర సాలభ్యాలు కల్పిస్తుంటే దాన్ని భాగ్యం కాక ఇంకేమంటారు.. ఇన్ని భోగభాగ్యాలు అనుభవించే ఒకే ఒక వ్యక్తి.. వ్యక్తి అని కాకుండా శక్తి అని పిలవలేమో.. అతని పేరు రామోజీరావు..
చాలామంది వ్యాపారాల్లోకి వచ్చేముందు ఒకటే కాంబినేషన్లో వస్తూ ఉంటారు. అందులో సక్సెస్ అయిన తర్వాత ఇతర వ్యాపారం లోకి వెళ్తారు. కానీ రామోజీరావు తీరే వేరు. ఇప్పుడంటే జగన్ దెబ్బకు మంచానపడ్డాడు కానీ.. ఒకప్పుడు చీటీల వ్యాపారం మొదలుపెట్టి పచ్చళ్ళు, పేపర్ కాంబినేషన్ తో ఎదిగి, హోటళ్ళు, షాపింగ్ మాల్స్… ఇంకా ఎన్నో రంగాల్లోకి అడుగుపెట్టి మీడియా మొగల్ గా వినతికి ఎక్కాడు. ఏకంగా ప్రధాన మంత్రులను శాసించే స్థాయికి ఎదిగాడు. ఎవరైనా తన ఇంటికి వచ్చేలా అర్థ బలాన్ని, అంగ బలాన్ని పెంచుకున్నాడు. మర్రి చెన్నారెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదరుమల్లి జనార్దన్ రెడ్డి ఇలా ఎందరో కాంగ్రెస్ ముఖ్యమంత్రిలకు తన గడప దొక్కే అవకాశం కూడా రామోజీరావు ఇవ్వలేదు. ఎక్కడ ట్యూన్ కుదిరిందో తెలియదు కానీ చంద్రబాబు నాయుడికి మాత్రం చాలాసార్లు తన గడప తొక్కే అవకాశం ఇచ్చాడు. తన ఆలోచనలు చంద్రబాబుకు చెప్పి రాజగురువు అయ్యాడు. అక్కడిదాకా ఎందుకు అంతటి కాకలు తీరిన అమిత్ షాను తన వద్దకే రప్పించుకున్నాడు. కానీ కెసిఆర్ దగ్గరికి తనంతట తానే వెళ్ళాడు.
అంతటి ధీరాధిధీరుడైన రామోజీరావు ఇప్పుడు తన శ్వేత సౌధంలో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నట్టున్నాడు. తన ఆలోచనలో ఓ ఉదయం పత్రిక ఉంటుంది. ఓ వార్త పత్రిక ఉంటుంది. మూతబడిన చార్మినార్ బ్యాంకు ఉంటుంది. కన్నీరు కార్చిన మల్లు స్వరాజ్యం ఉంటుంది. క్షోభ పడుతున్న సుమన్ ఆత్మ ఉంటుంది.. సీతమ్మధార రాజు స్థల వివాదం ఉంటుంది.. ఎన్టీఆర్ ఆవేదన ఉంటుంది. దాసరి నారాయణరావు ఆక్రందన ఉంటుంది.. ఇన్ని చేసిన మనిషి అతడు మనిషేనా.. మనిషి అయితే అతడు రామోజీరావు ఎందుకు అవుతాడు. తనను కొట్టే మగాడు లేడనే కదా ఇన్ని రోజులు విర్రవీగింది. కొమ్ములు తిరిగిన మాజీ న్యాయమూర్తులను తన ఇంటికి విందుకు పిలిచింది. తాను కోరుకున్నది జరగాలని ప్రణాళికలు రూపొందించింది. ఇంతటి వ్యక్తి ఇప్పుడెందుకు విలపిస్తున్నాడు.. ఎంతో మందిని పడుకోబెట్టిన మీడియా మొగల్ ఇప్పుడు ఎందుకు బేల చూపులు చూస్తున్నాడు..

కారణం ఒకటే.. అది మార్గదర్శి. దానిలో ఉన్న అక్రమాలు.. దానిని ఇప్పుడు జగన్ వెలికి తీస్తున్నాడు. సిఐడి తో చర్నాకోలు పట్టి రామోజీరావును ఒక ఆట ఆడుకుంటున్నాడు. ఇందులో ఎన్ని శోకాలు పెట్టినా, మరెన్ని దీర్ఘాలు తీసినా జగన్ ఊరుకోడు.. అప్పట్లో అయితే వైయస్ రాజశేఖర్ రెడ్డి కి కాంగ్రెస్ పెద్దలతో చెప్పించి సైలెంట్ చేశాడు.. కానీ ఇప్పుడు జగన్ కు ఎవరు చెబుతారు? చెబితే జగన్ ఎలా ఊరుకుంటాడు? అది కూడా ఓ తిక్క క్యారెక్టరే కదా! రామోజీరావు లాగా ఆటిట్యూడ్ ను అణువణువు నింపుకున్న వ్యక్తి కదా! ఒక్కటి మాత్రం నిజం.. శత్రుదుర్బేధ్యమైన కోటలో ఒంటరిగా రామోజీరావు.. ఇన్ని చేసిన అతడికి భయం అనేది ఎందుకు కలగలేదు? తనను ఎదిరించే మగాడు పుట్టే ఉంటాడని ఎందుకు అనుకోలేదు? ఎందుకంటే అతడు కూడా ఆశాజీవే కదా.. పేరుకు నాస్తిక వాది కావచ్చు..ఓం సిటీ అనే ఆలోచన వచ్చినప్పుడు.. ఆ నాస్తికత్వం పక్కకు జరిగిపోయింది. కానీ ఇక్కడే రామోజీరావుకు తెలియని అసలు అర్థం ఉంది.. చేసుకున్న వాడికి చేసుకున్నంత! ఇప్పుడు అది అర్థమైనా రామోజీరావు ఎవరికీ చెప్పలేడు. చెప్పినా వినే వారు ఎవరూ లేరు. ముందుగానే చెప్పాము కదా అది శత్రుదుర్బేధ్యమైన కోట!