India vs Sri Lanka Asia Cup 2022: చేతుల దాకా వచ్చిన మ్యాచ్ చేజేతులా నేలపాలైంది. ఫలితంగా భారత జట్టుపై ఒత్తిడి పెరిగిపోయింది. ఆసియా కప్ లో భాగంగా పాకిస్తాన్ తో తొలి మ్యాచ్ కు, రెండో మ్యాచ్ కు మధ్య భారత జట్టు ఆట తీరులో చాలా మార్పులు కనిపించాయి. ఆటగాళ్ల అతి విశ్వాసం జట్టు కొంపముంచింది. కీలక సమయాల్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో తడబాటు ఫలితాన్ని తారుమారు చేసింది. కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన సహజ ప్రవర్తనకు భిన్నంగా వ్యవహరిస్తున్నాడు. మైదానంలో, డ్రెస్సింగ్ రూమ్ లో సహచరులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కెమెరాలకు చిక్కాడు. ఇదంతా కూడా పాక్ తో ఆడే మ్యాచ్లో భారత జట్టుపై ఉండే సహజ ఒత్తిడే కారణమని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఒత్తిడిని జయించడంలో ఆటగాళ్లు విఫలం కావడం వల్లే రెండో మ్యాచ్లో పాక్ గెలిచిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ _4 లో భాగంగా భారత జట్టు తన రెండో మ్యాచ్ మంగళవారం శ్రీలంకతో ఆడనుంది. అయితే మితి మీరిన ప్రయోగాల జోలికి వెళ్లకుండా, బౌలింగ్ ను మరింత పకడ్బందీగా రూపొందించుకొని బరిలోకి దిగితేనే జట్టుకు మేలు కలుగుతుందని మాజీ క్రికెటర్లు అంటున్నారు. ఈ పూల్ లో ఒక్క ఓటమి ఎదురైనా ఫైనల్ పై ఆశలు వదులుకోవాల్సిందే. అటు శ్రీలంక కూడా వరుసగా రెండు విజయాలు సాధించింది. రెండు మ్యాచ్ లు కూడా భారీ లక్ష్య చేదనలోనే రావడం వారి బ్యాటింగ్ తెగువను చాటి చెబుతోంది. ఈ ఊపులో బలహీనమైన భారత బౌలింగ్ లైనప్ ను కూడా దీటుగా ఎదుర్కోవాలనుకుంటున్నది. 2016లో ఆసియా కప్ లో భాగంగా శ్రీలంకతో జరిగిన టి20 మ్యాచ్ లో భారత్ గెలిచింది.

బౌలింగ్ ఇక బాగుపడదా
రవీంద్ర జడేజా, హర్షల్, బుమ్రా గాయాల పాలవడంతో భారత బౌలింగ్ లయ తప్పింది. పాక్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగి పరాజయాన్ని మూట కట్టుకుంది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, చాహాల్ ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు. ఒకవేళ వీరు మెరుగ్గా బౌలింగ్ చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేది. అందుకే మూడో స్పెషలిస్ట్ పేసర్ గా ఆవేశ్ ఖాన్ శ్రీలంకతో జరిగే మ్యాచ్లో ఆడే అవకాశం ఉంది. అతడు కూడా ఇప్పటివరకు ఎటువంటి ప్రభావం చూపలేదు. ఇక ఓపెనర్లు రాహుల్, రోహిత్ ఒక్కరు కూడా ఎక్కువ సేపు క్రేజులో నిలదొక్కుకోలేకపోతున్నారు. పవర్ ప్లే లో వేగం కనిపిస్తున్నా.. ఆ తర్వాతి ఓవర్లలో ఆట తీరు మందకొడిగా సాగుతోంది. దీంతో జట్టు ఆశించినంత మేర స్కోర్ సాధించలేకపోతోంది. అయితే ఇటీవల మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వరుసగా రెండు అర్థ సెంచరీలు చేసినా అందులో ఎటువంటి మెరుపులు లేవు. పాకిస్తాన్ తో జరిగిన రెండో మ్యాచ్లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా డక్ అవుట్ అవ్వడం స్కోర్ బోర్డుపై ప్రభావం చూపించింది. ఒకవేళ అతడు కనుక మెరుగ్గా ఆడి ఉంటే మరింత స్కోరు చేసే అవకాశం ఉండేది. రోహిత్, రాహుల్, కోహ్లీ విరుచుకు పడితేనే మెరుగైన స్కూలు సాధించే అవకాశం ఉంది. పాక్ తో జరిగిన మ్యాచ్లో రిషబ్ పంత్ అవుట్ అయిన తీరు అతనిపై విమర్శలు పెంచాయి. కీలక సమయంలో స్వీప్ షాట్ కు వెళ్లడంపై కెప్టెన్ రోహిత్ కూడా పంత్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. హుడాను తీసుకోవడం కూడా బెడిసి కొట్టింది. శ్రీలంక జట్టులో ఎక్కువ మంది ఎడమచేతి వాటం ఉన్న ఆటగాళ్లు ఉండటంతో హుడా స్థానంలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను తీసుకునే అవకాశాలు లేకపోలేదు. అయితే అతడు శ్రీలంకపై 9 మ్యాచ్ లు ఆడగా 13 వికెట్లు తీశాడు.
Also Read: Boycott Brahmastra: రణ్ బీర్, ఆలియా లో బాయ్ కాట్ ఎఫెక్ట్ : 400 కోట్లు వెనక్కి వచ్చేనా?
జోరు మీద ఉన్న లంక
తొలి మ్యాచ్లో పాక్ చేతిలో చిత్తుగా ఓడిన శ్రీలంక.. తర్వాత ఫినిక్స్ పక్షి లాగా అద్భుతంగా పుంజుకుంది. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లపై చివరి వరకు పట్టు విడువని ఆటతీరుతో ఆకట్టుకుంది. భారీ లక్ష్యాలను చేధించి ఔరా అనిపించింది. బంగ్లా పై జరిగిన మ్యాచ్లో షనక, కుశాల్ మెండిస్, ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో గుణతిలక, రాజపక్స కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో ఆయినా గెలగలుగుతామనే సంకేతాలు మిగతా జట్లకు పంపించారు. అయితే ఒత్తిడిలో ఉన్న భారత పై తమదే పై చేయి కావాలని శ్రీలంక అనుకుంటున్నది. అలాగే టీమిండియా టాపార్డర్ లెఫ్టామ్ స్పిన్ ను ఎదుర్కోవడంలో పడే ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని మదుశంకను ముందుగానే బరిలోకి దించే అవకాశం ఉంది. ఒకవేళ టాస్ గెలిస్తే లక్ష్య చేదనలో రికార్డులు సృష్టిస్తున్న శ్రీలంక కు ముందుగా బ్యాటింగ్ అప్పజెప్పే యోజనలో టీమిండియా ఉంది. సెకండ్ బ్యాటింగప్పుడు మైదానంలో మంచు కురుస్తుండడం వల్ల బంతి గమనం తప్పుతోంది.

జట్ల అంచనా
భారత్: రోహిత్ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, చాహల్, అర్ష్ దీప్ సింగ్.
శ్రీలంక: నిస్సాంక, కుశాల్ మెండీస్, అసలంక, గుణ తిలక, రాజపక, షనక( కెప్టెన్), హస రంగ, కరుణ రత్నే, తీక్షణ లేదా జయ విక్రమ, పెర్నాండో, మదుశంక.