India vs Pakistan T20 World Cup 2022: టి20 క్రికెట్ వరల్డ్ కప్ లో అసలైన సమరానికి తెర లేచింది. క్రికెట్ ప్రపంచం ఒళ్లంతా కళ్ళు చేసుకుని ఎప్పుడెప్పుడాని ఎదురుచూసే మ్యాచ్ రానే వచ్చింది. నరాలు తెగే ఉత్కంఠను, ఆకాశాన్నంటే సంబురాలను ఏకకాలంలో కళ్ళముందు ఉంచే అసలు సిసలైన మ్యాచ్ మరికొద్ది గంటల్లో వీనుల విందు చేయనుంది. భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ఎవరికైనా ఆసక్తే. ఆటగాళ్ల నుంచి బెట్టింగ్ రాయుళ్ల వరకు ఎంతో క్రేజ్ ఉంటుంది. ఇటీవల ఆసియా కప్ లో ఈ జట్లు రెండు సార్లు తలపడ్డాయి. ఒకసారి భారత్, మరొకసారి పాకిస్తాన్ గెలిచాయి. రెండోసారి పాకిస్తాన్ గెలిచి కీలకమైన ఫైనల్ కు వెళ్ళింది. టి20 క్రికెట్ ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీ లో ఆసియా కప్ లో ఎదురైన పరాభవానికి టీమిండియా బదులు తీర్చుకోవాల్సి ఉంది. అయితే ఇది మొత్తం వరుణుడి దయ పైనే ఆధారపడి ఉంది.

ఇప్పటివరకు ఐదు సార్లు గెలిచింది
టి20 ప్రపంచ కప్ లో పాకిస్థాన్ తో భారత్ ఆరుసార్లు తలపడింది. వీటిల్లో ఐదు సార్లు భారత్ గెలిచింది. ఇక గత సంవత్సరం టి20 వరల్డ్ కప్ లో భారత జట్టు తీవ్రంగా నిరాశపరిచింది. గత లోపాలు సవరించుకుంటూ ఈసారి తన అదృష్టాన్ని ఆస్ట్రేలియాలో పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. ఆదివారం మెల్బోర్న్ మైదానంలో జరిగే సూపర్ 12 ఆరంభ మ్యాచ్లో పాకిస్తాన్ తో భారత జట్టు సై అన బోతున్నది. 2007లో ధోని సారథ్యంలోని తొలి టి20 వరల్డ్ కప్ గెలుచుకున్న భారత జట్టు.. ఆ తర్వాత విజేతగా నిలువలేకపోయింది. ఇక పాక్, భారత జట్లు కేవలం ఐసీసీ టోర్నమెంట్లలోనే ఆడుతుండడంతో అందరి చూపూ ఈ మ్యాచ్ పైనే ఉంది. ఇటీవల ఆసియా కప్ లో ఇరు జట్లకు చెరో విజయం దక్కింది. ఇది ఇలా ఉండగా వచ్చే ఏడాది ఆసియా కప్ కోసం భారత జట్టు పాకిస్తాన్ వెళ్ళబోదని బీసీసీఐ పేర్కొనడం… భారత్ లో జరిగే ప్రపంచ కప్ లో ఆడే విషయమై పునరాలోచిస్తామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పేర్కొనడం రాజకీయంగా కాస్త వేడిని పెంచింది. గతంలో ధోని కెప్టెన్సీలో భారత జట్టు ఐసీసీ లాంటి ఈవెంట్స్ లో పాకిస్తాన్ పై ఎన్నడూ ఓటమి చెందలేదు. అయితే గత సంవత్సరం ఇదే టోర్నీలో భారత జట్టుకు తొలి పరాజయం ఎదురైంది. ఇక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో 1985 తర్వాత ఈ రెండు జట్లు తలపడటం ఇదే తొలిసారి. అటు బ్రాడ్కాస్టర్లకు కూడా కాసుల వర్షం కురిపించే ఈ మ్యాచ్ పూర్తిగా సాగాలంటే మాత్రం వరుణుడు కరుణించాల్సిందే.
వాతావరణ శాఖ అంచనా ప్రకారం మెల్బోర్న్ లో ఆదివారం మధ్యాహ్నం తర్వాత నుంచి వర్షం కురిసే అవకాశం 70% గా ఉంది. దీంతో ఆరంభంలో మ్యాచ్ కు అంతరాయం కలగవచ్చు. ఈ పరిస్థితిలో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ వైపు మొగ్గు చూపించవచ్చు.
భారత జట్టుకు సమస్య ఏంటంటే
కొత్త కాలంగా భారత జట్టును వేధిస్తున్న సమస్య తుది జట్టు కూర్పు.. ఇటీవల కాలంలో పలు ప్రయోగాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయినప్పటికీ ఈ టోర్నీ లోనూ ప్రతి మ్యాచ్ కు రెండు లేదా మూడు మార్పులు ఉండే అవకాశం ఉందని కెప్టెన్ రోహిత్ చెబుతున్నాడు. షాహీన్ షా అనే యువ బౌలర్ ను కాచుకుంటూ టాప్ ఆర్డర్ బ్యాటర్స్ పవర్ ప్లే లో ఎలా ఆడతార
నేదానిపై మ్యాచ్ ఆధారపడి ఉంది. ఓపెనర్లు రాహుల్, రోహిత్ శర్మకు పాకిస్తాన్ పై మెరుగైన రికార్డు లేదు. వీరితోపాటు కోహ్లీ స్థాయికి తగ్గట్టుగా ఆడితేనే అనుకూల ఫలితం ఆశించాల్సి ఉంటుంది. ఇక పిచ్ ఎలాంటిదైనా తనదైన శైలిలో బంతిని బాదే స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ క్రిజ్ లో నిలిస్తే పాక్ బౌలర్లకు చుక్కలే. 12 సంవత్సరాల తర్వాత దినేష్ కార్తీక్ టి20 వరల్డ్ కప్ ఆడుతున్నాడు. బుమ్రా లేకపోవడంతో బౌలింగ్ దళం బలహీనంగా కనిపిస్తోంది. అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన షమీ వామప్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై చివరి ఓవర్ లో నాలుగు వికెట్లు తీసి భారత్ ను గెలిపించాడు. ప్రస్తుతం మెల్బోర్న్ లో వర్షం కురుస్తుండడంతో సీమర్లకు ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. వికెట్ పై తడిని సద్వినియోగం చేసుకుంటూ భువీ, షమీ, అర్ష్ దీప్ చెలరేగాల్సి ఉంటుంది. హర్షల్ ను పక్కన పెడితే టెయిల్ ఎండ్ లో బ్యాటింగ్ కోసం స్పిన్నర్ గా అశ్విన్ వైపు మొగ్గు చూపవచ్చు.
పాకిస్తాన్ బలం ఏంటంటే
యువ పేసర్ షహీన్ షా గాయం నుంచి కోలు కోవడంతో పాకిస్తాన్ జట్టు అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. వామప్ మ్యాచ్ లో అతడు పూర్తి లయను అందుకొని జట్టుకు భరోసా ఇచ్చాడు. అందుకే భారత్ పై గెలిచే భారాన్ని జట్టు పూర్తిగా అతనిపై వేసింది. అతనితోపాటు పేసర్లు హారిస్ రౌఫ్, నసీం షా, మహమ్మద్ హుస్నైన్ కూడా ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టే వారే. రౌఫ్ కు ఇక్కడ బిగ్ బాష్ లీగ్ లో ఆడిన అనుభవం ఉంది. స్పిన్ విషయంలో మాత్రమే భారత్ జట్టుది పై చేయిగా ఉంది. ఇక బ్యాటింగ్లో ఓపెనర్ రిజ్వాన్, బాబర్ వికెట్లు తీయడమే రోహిత్ సేనకు అతిపెద్ద సవాల్ కానుంది. స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ భారీ షాట్లు ఆడగల సత్తా వీరి సొంతం. భారీ భాగస్వామ్యాలు నెలకొల్పడంలోనూ వీరికి వీరే సాటి. అయితే మొన్న స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరిగిన టోర్నీలో పాకిస్తాన్ ఓపెనర్లు అంతగా రాణించలేదు.

జట్ల అంచనాలు
భారత్: రోహిత్ శర్మ ( కెప్టెన్), రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, చాహల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్, షమీ, ఆర్ష్ దీప్.
పాకిస్తాన్
రిజ్వాన్, బాబర్ ( కెప్టెన్), షాన్ మసూద్, హైదర్ అలీ, ఇఫ్తికార్ అహ్మద్, ఆసిఫ్ అలీ , నవాజ్, షాదాబ్ ఖాన్, నసీం షా, షహీన్ షా, హారీస్ రౌఫ్.