IND vs PAK T20 World Cup: భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కు సిద్ధమవుతున్నాయి. టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఆదివారం ఇండియా, పాక్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఇప్పటికే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. పాక్ క్రికెటర్లు మన వారిని ఉద్దేశించి కవ్వింపు మాటలకు దిగుతుండటంతో బదులుగా కసి తీర్చుకోవాలని చూస్తున్నారు. గత ప్రపంచ కప్ లో మన జట్టును ఓటమికి గురి చేసి దెబ్బతీసిన పాక్ ను ఈ సారి ఎలాగైనా మట్టి కరిపించి బదులు తీర్చుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియా, పాక్ మ్యాచ్ పై అందరిలో ఉత్కంఠ నెలకొంది.

భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ స్టేడియంలో జరిగే మ్యాచ్ కు ప్రేక్షకులు ఇప్పటికే చేరుకున్నారు. రోహిత్ శర్మకు ఇదే తొలి ప్రపంచ కప్ కావడంతో విజయంతో బోణీ కొట్టాలని చూస్తున్నాడు. ఈ మేరకు రెండు జట్ల మధ్య హోరాహోరీగా పోరు సాగనుంది. దీంతో రోహిత్ శర్మ పట్టుదలగా ఉన్నాడు. పాక్ పై గెలిచి తన సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. భారత్, పాక్ మధ్య రసవత్తర పోరుకు వేదిక కానుంది. భారత్ బ్యాటింగ్ కు పాకిస్తాన్ బౌలింగ్ కు మధ్య జరుగుతుందని భావిస్తున్నారు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ లతో టీమిండియా బలంగా ఉండగా పాక్ లో కూడా అఫ్రిది, నసీం షా, హారీస్ రవూఫ్ భారత్ కు సవాలు విసిరేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. టీమిండియాలో హార్థిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ లు కూడా మంచి ఫామ్ లో ఉండటంతో టీమిండియాను ఎదుర్కోవడం పాక్ కు కష్టమే అనే భావాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు జట్ల మధ్య జరిగే సమరం చూసేందుకు అభిమానులు సిద్ధమయ్యారు.
మ్యాచ్ పై ద్రవిడ్, రోహిత్ ఇప్పటికే జట్టు విషయంలో స్పష్టత ఇచ్చారు. రెండు స్థానాలపై ఇంకా తేల్చడం లేదు. మూడో పేసర్ గా హర్షల్ పటేల్ కు బదులు అర్ష్ దీప్ వైపు మొగ్గు చూపేందుకు సిద్ధమైనట్లు చెబుతున్నారు. మంచి ఫామ్ లో ఉన్న హర్షల్ పటేల్ ను కాదని రెండో స్పిన్నర్ ను తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ విషయంలో జట్టు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. జట్టు కోసం ఆ స్థానాల్లో ఎవరిని తీసుకుంటారో తెలియడం లేదు. రిషబ్ పంత్ ను కూడా తుది జట్టులోకి తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. లేదంటే అశ్విన్ లేదా చాహల్ లో ఒకరికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు.