
India vs Australia : నిన్న రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా హెడ్ ధాటి ఇన్నింగ్స్ వల్ల క్షణాల్లో 60 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. ఇంకేముంది మూడో రోజు ఇండియన్ బౌలర్లకు ఇక చుక్కలే అని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడే జడ్డూ భాయ్ అలియాస్ రవీంద్ర జడేజా మ్యాజిక్ చేశాడు.. ఆస్ట్రేలియా వెన్ను విరిచాడు. 61 పరుగుల ఆధిక్యం నుంచి 113 పరుగులకే ఆల్ అవుట్ చేసి తాను ఎంత స్పెషలో మరోసారి నిరూపించాడు.
ఓవర్ నైట్ స్కోర్ 61 పరుగుల వద్ద మూడో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జడేజా ధాటికి ఏ మాత్రం కోలుకోలేకపోయింది.. హెడ్ ను ఔట్ చేసి రవిచంద్రన్ అశ్విన్ శుభారంభం అందిస్తే… తర్వాత పని జడ్డూ చేశాడు.. లాబూ షేన్, స్మిత్,హ్యాండ్స్ కాబ్,క్యారీ, కమ్మీన్స్, కునేమాన్.. ఇలా ఏడుగురు బ్యాట్స్మెన్ రవీంద్ర జడేజా బంతులకు బలయ్యారు.. ఒకానొక దశలో ఆస్ట్రేలియా భారీ స్కోర్ సాధిస్తుంది అని అందరూ అనుకున్నారు. పిచ్ కూడా బ్యాట్స్ మెన్ కు అనుకూలిస్తుందని అందరూ భావించారు. కానీ ఇక్కడే జడేజా బంతిని తిప్పేశాడు.. ఆస్ట్రేలియన్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.
30 పరుగులకే ఆరు వికెట్లు
ఎప్పుడైతే హెడ్ ఔట్ అయ్యాడో.. అప్పటినుంచి ఆస్ట్రేలియన్ టాప్ ఆర్డర్ పేక మేడలా కూలిపోయింది. ఏ ఒక్కరు కూడా జడేజాను ఎదురుకోలేకపోయారు.. జడే జాకు అశ్విన్ తోడు కావడంతో ఆస్ట్రేలియా ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. 95 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా… అదే స్కోరు వద్ద మిగతా మూడు వికెట్లు కూడా కోల్పోయిందంటే జడేజ ఏ స్థాయిలో బౌలింగ్ వేశాడో అర్థం చేసుకోవచ్చు. ఇక అశ్విన్ కూడా తన వంతుగా మూడు వికెట్లు తీశాడు.
-ఇండియా 6 వికెట్ల తేడాతో ఘనవిజయం
114 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా 6 పరుగులకే ఓపెనర్ కేఎల్ రాహుల్ వికెట్ కోల్పోయింది.. 39 పరుగుల వద్ద ఉన్నప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ రన్ అవుట్ అయ్యాడు.. భారత్ 26.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వందో టెస్ట్ ఆడుతున్న పూజారా (31) ఫోర్ బాది జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ విజయంతో నాలుగు టెస్టుల సిరీస్ లో టీమిండియా 2-0 తేడాతో ఆధిక్యం సంపాదించింది. తొలి ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు పడగొట్టిన జడేజా.. రెండో ఇన్నింగ్స్ లో ఏకంగా ఏడు వికెట్లు తీశాడు. ఇక బ్యాటింగ్ లో మొదటి ఇన్నింగ్స్ లో అక్షర్ పటేల్ (74) రాణించాడు.
మొత్తంగా బ్యాటింగ్ లో బౌలింగ్ లో రాణించిన రవీంద్ర జడేజాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. తొలి టెస్టులోనూ రవీంద్ర జడేజాకే ఈ అవార్డు దక్కింది. వరుసగా రెండు టెస్టులలోనూ రాణించిన జడేజా ఇప్పుటు టీమిండియాకు కీలక ఆటగాడిగా మారాడు.