Telangana Congress: రేవంత్‌ సీఎం అయితే మాకు పదవులొద్దు.. కాంగ్రెస్‌ లో సీనియర్ల తిరుగుబాటు?

సీఎం పీటం విషయంలో రేవంత్, భట్టి, ఉత్తమ్‌ ఎవరూ వెనక్కు తగ్గడం లేదని తెలుస్తోంది. దీంతో హైకమాండ్‌ కొత్త ఫార్ములా తెర మీదకు తెచ్చినట్లు తెలుస్తోంది.

Written By: Raj Shekar, Updated On : December 5, 2023 2:13 pm

Telangana Congress

Follow us on

Telangana Congress: తెలంగాణలో సీఎం అయ్యేది ఎవరు.. హైకమాండ్‌ కు ఈ ఎంపిక ఇప్పుడు పరీక్షగా మారుతోంది. రేవంత్‌ సీఎం అంటూ జరిగిన ప్రచారంతో సీనియర్లు గుర్రుగా ఉన్నారు. తమను పరిగణలోకి తీసుకోకుండా ఈ లీకులు ఏంటని నిలదీస్తున్నారు. రేవంత్‌ సీఎం అయితే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు పంచాయితీ ఢిల్లీకి చేరింది. హైకమాండ్‌ పిలుపుతో భట్టి, ఉత్తమ్‌ ఢిల్లీ వెళ్లారు.

లీకులపై సీరియస్‌..
సీఎం పీటం విషయంలో రేవంత్, భట్టి, ఉత్తమ్‌ ఎవరూ వెనక్కు తగ్గడం లేదని తెలుస్తోంది. దీంతో హైకమాండ్‌ కొత్త ఫార్ములా తెర మీదకు తెచ్చినట్లు తెలుస్తోంది. సీఎంగా రేవంత్‌ వైపు హైకమాండ్‌ మొగ్గు చూపుతుందనే సమాచారంతో సీనియర్లు ఒక్కటయ్యారు. ముందుగా హైదరాబాద్‌లో వారు డీకే శివకుమార్‌తో తమ అభిప్రాయాలను స్పష్టం చేశారు. డీకే శివకుమార్‌ సూచనతో సీఎల్పీ సమావేశానికి హాజరయ్యారు. సీనియర్ల అభిప్రాయాలను హైకమాండ్‌ కు డీకే శివకుమార్‌ నివేదించారు. దీంతో..పార్టీ హైకమాండ్‌ సూచన మేరకు డీకే శివకుమార్‌.. పార్టీ పరిశీలకులు ఢిల్లీ చేరారు. తాజాగా భట్టి, ఉత్తమ్‌కు పిలుపు రావటంతో ఇప్పుడు రాజకీయం మరింత ఆసక్తి కరంగా మారుతోంది. సీఎంగా రేవంత్‌ ప్రమాణ స్వీకారం అంటూ మీడియాకు లీకులు ఇవ్వడంపైనా వారంతా అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.

పట్టు వీడని భట్టి, ఉత్తమ్‌..
తాను పార్టీ గెలుపు కోసం కష్టపడ్డానని తనకే సీఎం పదవి ఇవ్వాలని రేవంత్‌ కోరుతున్నారు. పార్టీకి అన్ని విధాలుగా సహకరిస్తానని, భవిష్యత్తులోనూ ఇలాంటి ఫలితాలే తీసుకోస్తానని ఆయన హామీ ఇచ్చినట్టు సమాచారం. తనకు సీఎం పదవి తప్ప మరో పదవి అవసరం లేదని తేల్చి చెప్పినట్టు తెలిసింది. రేవంత్‌ సీఎం అయితే తాను మంత్రిగా పని చేయలేనని ఒక సమయంలో ఉత్తమ్‌ అసహనం వ్యక్తం చేయగా.. డీకే సర్దిచెప్పే ప్రయత్నం చేశారని సమాచారం. తనకు సీఎం పదవి ఇవ్వకపోతే డిప్యూటీ సీఎంతోపాటు కీలక శాఖలతో మంత్రి పదవి ఇవ్వాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేసినట్టు తెలుస్తోంది. ఇక.. ఒకవేళ తనకు సీఎం పదవి ఇవ్వకపోతే పీసీసీ చీఫ్‌ పదవితోపాటు కీలక శాఖలతో డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని భట్టి విక్రమార్క డిమాండ్‌ చేసినట్టు చెబుతున్నారు.

ఢిల్లీ నిర్ణయంపై ఉత్కంఠ..
తనకు మినహా మరో డిప్యూటీ సీఎం పదవి ఉండొద్దని దామోదర రాజనర్సింహ షరతు పెట్టినట్టు తెలిసింది. తనకు డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందేనని, గతంలోనూ తాను డిప్యూటీ సీఎంగా చేశానని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాడని సమాచారం. మాదిగ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎంతో సహా పదవుల వ్యవహారంలో ఎలాంటి ఫార్ములాతో ఈ వ్యవహారానికి ముగింపు ఇస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.