Odi World Cup 2023 Schedule: ఈ ఏడాది భారత్ వేదికగా జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌ను బీసీసీఐ ఇవాళ విడుదల చేసింది. ఐసీసీ ప్రపంచకప్ అక్టోబర్ 5న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో గత వరల్డ్ కప్ ఛాంపియన్ ఇంగ్లాండ్ తో రన్నరప్ న్యూజిలాండ్ తలపడనుంది. అలాగే 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగే లీగ్ మ్యాచ్‌తో భారత్ టోర్నీ ఆరంభించనుంది. అనంతరం అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా భారత్–పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
45 రోజులు మ్యాచ్‌లు..
అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకూ వన్డే ప్రపంచకప్ నిర్వహణకు వీలుగా మ్యాచ్‌లు ఖరారు చేస్తూ ప్రతిపాదనల్ని బీసీసీఐ ఐసీసీకి పంపింది. వీటిని ఐసీసీ ఆమోదించడం లాంఛనమే. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఈసారి మూడు ప్రపంచకప్ మ్యాచ్‌లు జరగబోతున్నాయి. నవంబర్ 15, 16 తేదీల్లో జరిగే సెమీఫైనల్స్‌కు ముంబై, చెన్నై ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. నవంబర్ 19న అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
టోర్నీలో పది జట్లు..
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ఈసారి 10 జట్లు పాల్గొంటున్నాయి. వీటిలో 8 దేశాలు ఇప్పటికే నేరుగా అర్హత సాధించగా.. మరో రెండు దేశాలు క్వాలిఫయర్స్ మ్యాచ్‌ల ద్వారా నిర్ణయిస్తారు. మొత్తం 9 నగరాల్లో ఈసారి వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరగబోతున్నాయి. ఇందులో కోల్‌కతా, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, హైదరాబాద్ నగరాలు ఉన్నాయి. 2011లో చివరి సారిగా భారత్ స్వదేశంలో వన్డే ప్రపంచకప్ నెగ్గింది. మరోసారి స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్ ను భారత్ విజయం సాధిస్తుందనే అంచనాలున్నాయి.
వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఆడే మ్యాచ్‌లు ఇవీ..
అక్టోబర్ 8 భారత్–ఆస్ట్రేలియా (చెన్నై)
అక్టోబర్ 11 భారత్–ఆప్ఘనిస్తాన్ (ఢిల్లీ)
అక్టోబర్ 15 భారత్–పాకిస్తాన్ (అహ్మదాబాద్ )
అక్టోబర్ 19 భారత్–బంగ్లాదేశ్ (పూణే)
అక్టోబర్ 22 భారత్–న్యూజిలాండ్ (ధర్మశాల)
అక్టోబర్ 29 భారత్–ఇంగ్లండ్ (లక్నో)
నవంబర్ 2 భారత్ వర్సెస్ క్వాలిఫయర్ (ముంబై)
నవంబర్ 5 భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా (కోల్‌కతా)
నవంబర్ 11 భారత్ వర్సెస్ క్వాలిఫయర్(బెంగళూరు)