
YSRCP : రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతోంది. ఏ ప్రభుత్వానికైనా అధికారంలో ఉన్నప్పుడు వ్యతిరేకత తప్పనిసరిగా ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపి ప్రభుత్వంపైన వ్యతిరేకత కనిపిస్తోంది. ఆ వ్యతిరేకత మొన్న జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోను కనిపించింది. అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఈ వ్యతిరేకత ఏ స్థాయిలోకి మారుతుంది అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నాయని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తమ ప్రభుత్వం పట్ల అన్ని వర్గాలు సంతృప్తిగా ఉన్నాయన్నది ప్రభుత్వ వర్గాల మాట. ఇందులో ఏది నిజం అన్నది ఎప్పటికీ ఇప్పుడు తేలేకపోయినప్పటికీ.. కొద్దిరోజుల కిందట జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులు ఓటమితో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్నది స్పష్టమైంది. అయితే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత గద్దె దించే స్థాయిలో ఉందా..? ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్యను తగ్గించే స్థాయిలో ఉందా..? అన్నది తేలాల్సి ఉంది. 2019లో అధికారంలోకి వచ్చినప్పటి పరిస్థితులు అయితే రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీకి లేవనే చెప్పాలి.
తన ఫేస్ మీద మళ్ళీ ఎన్నికలకు..
2014 ఎన్నికలకు, అంతకుముందు జరిగిన ఉప ఎన్నికలకు, 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు జగన్మోహన్ రెడ్డి తన ఫేస్ మీదే వెళ్లారు. అభ్యర్థులు ఎవరన్నది కాకుండా తనను చూసి ఓట్లు వేయాలని అనేక చోట్ల విన్నవించారు. 2019 ఎన్నికల్లో కూడా ప్రజలు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని చూసి ఓట్లు వేసి గెలిపించారు. అసలు బయట ప్రపంచానికి తెలియని ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎన్నికయ్యారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వల్లే సాధ్యం అయింది. అయితే 2024 సార్వత్రిక ఎన్నికలకు కూడా జగన్మోహన్ రెడ్డి తన బొమ్మను చూపించే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు. తన ఫేసు మీద ఎన్నికలకు వెళ్లి గత ఎన్నికల్లో విజయం సాధించిన జగన్మోహన్ రెడ్డి ఈసారి విజయం సాధిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.
ఎమ్మెల్సీ ఓటమి తర్వాత పునరాలోచనలో వైసిపి..
రాష్ట్రంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు వరకు వైసిపి ఆగ్రనాయకత్వంలో బలమైన ధీమా కనిపించింది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా రెండో అధికారంలోకి వస్తామని భావిస్తూ వచ్చారు. అయితే అనూహ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూడడంతో అగ్రనాయకత్వం పునరాలోచనలో పడింది. ముందు వరకు అనుకున్నట్లుగా రాష్ట్రంలో వైసిపికి అనుకూలంగా పరిస్థితులు లేవన్న విషయాన్ని గ్రహించారు. ముఖ్యంగా పట్టణ, నగర, వర్గాలకు చెందిన ఓటర్లు వైసీపీ పట్ల విముఖంగా ఉన్నారన్నది అర్థమైంది. దీంతో వైసిపి అధిష్టానం ఒక్కసారిగా అప్రమత్తమైంది. ఏడాది పాటు సమయం ఉన్నందున లోపాలను సరిచూసుకొని వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది.
భిన్నమైన రాజకీయ పరిస్థితి..
2019 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బలమైన శక్తిగా వైసిపి ఆవిర్భవించింది. దేశం పార్టీని 23 స్థానాలకు పరిమితం చేసింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా 50 శాతానికి పైగా ఓట్లతో 151 స్థానాలను వైసిపి కైవసం చేసుకోండి. దీంతో కొన్నాళ్లపాటు ప్రతిపక్షాలకి ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అఖండ విజయం సాధించిన వైసీపీని వచ్చే ఎన్నికల్లో ఓడించడం కష్టంగానే ప్రతిపక్షాలు భావించాయి. వైసీపీ అగ్ర నాయకుల స్వీయ తప్పిదాలు ప్రతిపక్షాలకు అవకాశం కల్పించాయి. వివాదాస్పదమైన నిర్ణయాలు, ప్రతి పక్షాలపై కక్షపూరిత ధోరణి, అవసరం లేని వారికి డబ్బులు పంపిణీ చేయడం వంటి విషయాలతో అనేక వర్గాల్లో ప్రభుత్వం పట్ల అసహనం, అసంతృప్తి పెరిగిపోయింది. అనూహ్యంగా ప్రతిపక్షాల గ్రాఫ్ పెరిగింది. దీంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.