Sharad Pawar : శరద్ పవార్ పార్టీ ఎలా చీలింది.. అజిత్ పవార్ బయటకు రావడానికి అసలు కారణమేంటి?

సీనియర్ నాయకుడు, రాజకీయ యోధుడు ఎన్సీపీ అధినేత శరద్ పవర్ కు గట్టి షాక్ తగిలింది. ఆయన మేనల్లుడు అజిత్ పవర్ ఏకంగా పార్టీనే చీల్చేశారు. తన వెంట 29 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లిపోయారు. ఏక్ నాథ్ షిండే శివసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో చేరిపోయారు. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమికి ఊహించని ఝలక్ ఇచ్చారు. ఏకంగా తాను డిప్యూటీ సీఎంగా, మరో తొమ్మది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

Written By: Dharma, Updated On : July 2, 2023 7:37 pm
Follow us on

Sharad Pawar :  మరాఠీ రాజకీయం హీటెక్కింది. సీనియర్ నాయకుడు, రాజకీయ యోధుడు ఎన్సీపీ అధినేత శరద్ పవర్ కు గట్టి షాక్ తగిలింది. ఆయన మేనల్లుడు అజిత్ పవర్ ఏకంగా పార్టీనే చీల్చేశారు. తన వెంట 29 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లిపోయారు. ఏక్ నాథ్ షిండే శివసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో చేరిపోయారు. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమికి ఊహించని ఝలక్ ఇచ్చారు. ఏకంగా తాను డిప్యూటీ సీఎంగా, మరో తొమ్మది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అసలు సిసలు రాజకీయంతో వృద్ధనేత శరద్ పవర్ కు చుక్కలు చూపించారు. ఊహించని ఈ పరిణామంతో శరద్ పవర్ మైండ్ బ్లాక్ అయ్యింది.

గత ఎన్నికల్లో ఎన్సీపీ మహారాష్ట్రలో 54 స్థానాల్లో విజయం సాధించింది. అప్పట్లో పవర్ షేరింగ్ విషయంలో బీజేపీతో విభేదించిన శివసేన బయటకు వచ్చింది. ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. కానీ ఏక్ నాథ్ షిండే రూపంలో కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏకంగా ఏక్ నాథ్ షిండే శివసేనను చీల్చి పార్టీ అధినేత, సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు గట్టి షాకిచ్చారు. బీజేపీ సాయంతో ఏక్ నాథ్ ముఖ్యమంత్రి అయ్యారు. మాజీ సీఎం ఫడ్నావీస్ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఎన్సీపీలో ఏకంగా అజిత్ పవర్ రూపంలో చీలిక వచ్చింది. అయితే దీని వెనుక బీజేపీ పాత్ర ఉందన్నది బహిరంగ రహస్యం. జాతీయ స్థాయిలో విపక్ష కూటమి పురుడుబోసుకుంటున్న వేళ శరద్ పవర్ కు షాకిచ్చేందుకే ఈ తిరుగుబాటు అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అసలు ఎటువంటి అనుమానాలు, ఊహాగానాలకు తావులేకుండా అజిత్ పవర్ తిరుగుబాటు చేయడం విశేషం. అస్సలు ఇది ఎవరూ ఊహించని పరిణామం. తన వెంట 29 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లిన అజిత్ పవర్ కు.. ఆరుగురు ఎమ్మెల్సీలు సైతం మద్దుతు తెలపడం విశేషం. అయితే ఎన్సీపీలో మిగతా ఎమ్మెల్యేలు సైతం అజిత్ పవర్ వైపు వెళ్లనున్నట్టు సమాచారం. కాగా ఎన్సీపీకి చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు వరించాయి. హసన్ ముష్రిఫ్, ఛగన్ భుజ్‌బల్, దిలీప్ వల్సే పాటిల్, ధనంజయ్ ముండే, ఆదితి టత్కరే, సంజయ్ బాబురావ్ బన్సొడే, అనిల్‌భాయ్ దాస్ పాటిల్, ఆత్రమ్ ధర్మారావ్ బాబా భగవంత్‌ రావ్.. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ముంబైలోని రాజ్‌భవన్‌లో ఈ మధ్యాహ్నం గవర్నర్ రమేష్ బైస్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.

గత కొద్దిరోజులుగా అజిత్ పవర్ తిరుగుబాటు చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఎప్పటికప్పుడు శరద్ పవర్ చక్రం తిప్పడంతో అడ్డుకట్ట పడుతూ వచ్చింది. అయితే అజిత్ పవర్ తిరుగుబాటుకు చాలారకాల కారణాలున్నాయి. ఎన్సీపీ అధినేతగా ఉన్న శరద్ పవర్ కొద్దిరోజుల కిందట ఓ నిర్ణయాన్ని తీసుకున్నారు. పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. కానీ పార్టీ శ్రేణులు ఒత్తిడి చేయడంతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అదే సమయంలో పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులుగా కుమార్తె సుప్రియా కాలే, పార్టీ సీనియర్ నాయకుడు ప్రఫుల్ పటేల్ ను నియమించారు. అజిత్ పవర్ ను మాత్రం విస్మరించారు. పార్టీలో ఉన్న పదవులను సైతం తొలగించారు. ఇది మింగుడుపడలేదు. అప్పటి నుంచి అజిత్ పవర్ చాపకింద నీరులా వ్యవహరించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి తిరుగుబాటు చేయించారు. అయితే దీనికి తెరవెనుక బీజేపీ సాయం అందించింది.