
Kanna Lakshminarayana: రాజకీయం రంగు మారింది. ఏపీలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఇన్నాళ్లు బీజేపీలో తిరుగులేని బలమైన నేతగా ఉన్న ‘కన్నా లక్ష్మీనారాయణ’ అనూహ్యంగా టీడీపీలో చేరారు. బీజేపీని దెబ్బకొట్టాలని.. జనసేనను పలుచన చేయాలని చంద్రబాబు-కన్నా ఆడిన గేమ్ ను ప్రత్యర్థులు నిశితంగా గమనిస్తున్నారు. కన్నా దేన్ని చూసుకొని చేరారో అక్కడ దెబ్బకొట్టాలని జగన్ అండ్ కో రెడీ అయినట్టు తెలుస్తోంది. కన్నా టార్గెట్ చేసిన ‘గుంటూరు పశ్చిమ’పై ఇప్పుడు వైసీపీ ఫోకస్ చేసింది. అక్కడ బలమైన అభ్యర్థిని దింపి కన్నాను ఓడించడమే లక్ష్యంగా ముందుకెళుతోంది. ఈ క్రమంలోనే కన్నాను ఓడించే నేతగా.. గుంటూరు పశ్చిమలో బలమైన ప్రాబల్యం ఉన్న వ్యక్తిగా వైసీపీ కంట్లో పడ్డారు పొన్నూరు ఎమ్మెల్యే కిలారి. ఇప్పుడు ఈయననే కన్నాపై పాశుపతాస్త్రంగా ప్రయోగించాలని రెడీ అయ్యారు. మరి కన్నాపై బ్రహ్మస్త్రంలా దిగబోతున్న కిలారి బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అక్కడ బలమెంత? కన్నాను ఓడిస్తారా? అన్న దానిపై స్పెషల్ ఫోకస్..
గుంటూరు జిల్లా రాజకీయ ముఖచిత్రం ఆసక్తికరంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ గెలుపు గుర్రాల కోసం ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థుల వెతుకులాట ప్రారంభించారు. ఇక విషయానికి వస్తే కన్నా లక్ష్మీనారాయణ గుంటూరు పశ్చిమ సీటు కన్మార్మ్ చేసుకొని పార్టీ మారిపోయారు. మరి ఆయనను ఓడించేందుకు వైసీపీ ఏ విధమైన ఎత్తులు వేయబోతుందనే విషయమై చర్చ మొదలైంది. ఆయనపై పోటీకి ఎవరిని నిలపాలో ఇప్పటికే నివేదిక తెప్పించుకున్నట్లు తెలుస్తుంది.
గుంటూరు తూర్పు ఈ సారి ఎవరు..
గుంటూరు తూర్పులో ముస్లిం సామాజిక ఓటు ఎక్కువ. అయినా, ఇక్కడ సాంప్రదాయంగా ముస్లింలే శాసనసభ్యలుగా గెలుస్తూ వస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే ముస్తఫా రెండు సార్లు వైసీపీ తరుపున గెలిచారు. ఈ సారి ఆయన కూతురిని బరిలో నిలపాలని భావిస్తున్నారు. టీడీపీ తరుపున నసీర్ అహ్మద్ ఉన్నారు. ఈయన గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఈసారీ ఆయనకే సీటు అని చెబుతున్నారు.
రసకందాయంలో గుంటూరు పశ్చిమ
గుంటూరు పశ్చిమలో టీడీపీ తరుపున గెలిచిన మద్దాళి గిరిథర్ గత ఎన్నికల్లో గెలిచారు. కొన్నాళ్లు పార్టీలోనే కొనసాగినా.. స్వల్ప విబేధాల కారణంగా తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలోకి జంప్ అయిపోయారు. దీనిపై స్థానిక నేతల నుంచే విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ తరువాత వైసీపీ నేతల నుంచి సరైన సహకారం లేకపోయినా అందులోనే కొనసాగుతున్నారు. ఈ సారి ఏ పార్టీ టిక్కెట్ ఇచ్చే పరిస్థితి కనబడటం లేదు. ఒకవేళ ఇచ్చినా గెలుపు అసాధారణమే.

లేళ్ల అప్పిరెడ్డి నెట్టుకు రాగలరా?
ఇక గుంటూరు పశ్చిమ ఈ సారి కన్నా లక్ష్మీనారాయణ బరిలో దిగబోతున్నారు. గత ఎన్నికల్లో చివరి క్షణంలో సీటు పొందిన చంద్రగిరి ఏసురత్నం ఓడిపోయారు. ఆ తరువాత పార్టీ అధిష్టానం మార్కెట్ యార్డు చైర్మన్ పదవిని కట్టబెట్టింది. ఇక జనసేన మూడో స్థానంలో నిలిచి 27,869 ఓట్లను పొందగలిగింది. వైసీపీ సీటు ఎవరికో ఈ సారి స్పష్టమైన ప్రకటన రాలేదు. ఎమ్మెల్సీగా ఉన్న లేళ్ల అప్పిరెడ్డిని బరిలో దిగే అవకాశాలు ఉన్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నారు. కానీ, ఆయన కన్నా హవాను ఏ మాత్రం తట్టుకోగలరనేది ప్రస్తుతం ప్రశ్నగా మారింది.
కిలారికి ఇస్తే టఫ్ ఫైట్ ఖాయం
ఈ నేపథ్యంలో గుంటూరు పశ్చిమ సీటు పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్యకు టిక్కెట్ ఇస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఈయనకు గుంటూరు పశ్చిమలో అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. మార్కెట్ యార్డులో వ్యాపారాలు ఉన్నాయి. పైగా కాపు సామాజిక వర్గాన్ని బాగా ప్రభావితం చేస్తున్నారు. కన్నా, ఈయనది ఒకే సామాజిక వర్గం. రోశయ్య మామ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అండ పుష్కలంగా ఉంది. ప్రస్తుతం ఈయన పొన్నూరులో వర్గపోరును ఎదుర్కొంటున్నారు. ఇక్కడ గెలుపు అంత సునాయాసం కాదని బహిరంగంగానే చెబుతున్నారు. ఈ క్రమంలో గుంటూరు పశ్చిమకు పంపితే కన్నాకు మంచి పోటీ ఇస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు.

లెక్క సరిపోయేనా..
గుంటూరు పశ్చిమలో ఇక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువ. గత ఎన్నికల్లో మూడో స్థానంలో నిలచిన జనసేన ఓటు బ్యాంకు కూడా టీడీపీకి కలిస్తే గెలుపు సునాయాసమవుతుంది. వైసీపీ తక్కువ తిన్నట్లేమి కనబడటం లేదు. పశ్చిమలో గెలుపును అందుకునేందుకు అవసరమైన ప్రణాళికలు వేసుకుంటుంది. కిలారి రోశయ్య వంటి వ్యక్తిని బరిలో నిలిపితేనే అది సాధ్యమవుతుందని పార్టీ శ్రేణులు కూడా లెక్కలేసుకుంటున్నారు. మరి వైసీపీ అధిష్టానం దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.