Generation Gap : సీన్ రివర్స్ : సెల్ ఫోన్ తెచ్చిన కష్టం.. 1999 కి.. 2024కి ఎంత తేడా?

ఇక ప్రతి మనిషి చేతిలో స్మార్ట్ఫోన్ అనేది అత్యవసర వస్తువు అయిపోయింది. అయితే ఈ కాలంలో యువతరం స్మార్ట్ ఫోన్లోనే మునిగితేలుతున్నారు. కనీసం పక్క మనిషితో మాట్లాడేందుకు కూడా ఇష్టపడటం లేదు. ఒకప్పుడు బైక్ డ్రైవింగ్ నేర్చుకుంటే వద్దని వారించిన తల్లిదండ్రులు.. ఇప్పుడు సరదాగా బైక్ పై వెళ్లి రా అని పిల్లల్ని కోరుతున్నారు.

Written By: NARESH, Updated On : March 13, 2024 11:43 am
Follow us on

Generation Gap : ఆటవిడుపు లేదు. ఆడుకోవడానికి స్థలం లేదు. అగ్గిపెట్టె లాంటి గదుల్లో విద్యాబోధన.. ఇరుగుపొరుగు వారితో సంబంధంలేని ఇంట్లో జీవనం.. చూస్తే టీవీ.. ఆడుకుంటే వీడియో గేమ్.. లేకుంటే స్మార్ట్ ఫోన్ లో కాలక్షేపం.. బాల్యం ఎంతటి సో సెల్ బంధీ అయిపోయిందో.. ఇక టీనేజ్ పిల్లల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కాలేజ్ లేకుంటే స్మార్ట్ ఫోన్. ఇదే లోకం.. ఇప్పటికైతే ఇలా ఉంది కానీ.. మునుముందు పరిస్థితి ఎంతకు దిగజారుతుందో..

కాలానుగుణంగా ఏర్పడిన మార్పులను దృష్టిలో ఉంచుకొని ఓ ఔత్సాహిక కళాకారుడు ఒక ఫోటో చిత్రీకరించాడు. ఆ ఫోటో మనిషి జీవితం ఎంత మారిపోయిందో కళ్ళకు కడుతోంది. 1999లో అంటే 90 దశకంలో అప్పుడప్పుడే ద్విచక్ర వాహనాలు రోడ్లమీద చక్కర్లు కొడుతున్నాయి. అంతకుముందు ఎల్ ఎం ఎల్ విస్పా, బజాజ్ చేతక్, హీరో హోండా సిడి100 వంటివి మాత్రమే ఉండేవి. ప్రభుత్వ విధానాలు మారిపోయిన తర్వాత కొత్త కొత్త ద్విచక్రవాహనాలు రోడ్లమీద చక్కర్లు కొట్టడం ప్రారంభమైంది. అప్పటి యువత ఆ బండ్లను చూసి నేర్చుకోవాలని ఉబలాటపడేవారు . కానీ వారి తల్లిదండ్రులు అందుకు ఒప్పుకునే వారు కాదు. బైక్ డ్రైవింగ్ ఇప్పుడు కాదు.. ముందు చదువుకో అని వారించేవారు. కాలం గిర్రున తిరిగింది. పాతికేళ్ల తర్వాత అంటే 2024 కు వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

ఒకటి కాదు రెండు కాదు పదులకొద్ది రకాల ద్విచక్ర వాహనాలు మార్కెట్ ను ముంచెత్తాయి. ఒకప్పుడు ప్రతి ఇంటికి సైకిల్ ఉన్నట్టుగా.. ప్రతి ఇంటికి బైక్ అనేది సర్వసాధారణమైపోయింది. ఇక ప్రతి మనిషి చేతిలో స్మార్ట్ఫోన్ అనేది అత్యవసర వస్తువు అయిపోయింది. అయితే ఈ కాలంలో యువతరం స్మార్ట్ ఫోన్లోనే మునిగితేలుతున్నారు. కనీసం పక్క మనిషితో మాట్లాడేందుకు కూడా ఇష్టపడటం లేదు. ఒకప్పుడు బైక్ డ్రైవింగ్ నేర్చుకుంటే వద్దని వారించిన తల్లిదండ్రులు.. ఇప్పుడు సరదాగా బైక్ పై వెళ్లి రా అని పిల్లల్ని కోరుతున్నారు. ఎందుకంటే అదేపనిగా స్మార్ట్ ఫోన్లో మునిగితేలుతుంటే మనిషి అనే వాడు.. సంఘ జీవిలా కాకుండా సో “సెల్” జీవి లాగా మారిపోతున్నాడు. ఇతర మనుషులతో కనీసం ఎటువంటి సంబంధాలు నెరపడం లేదు. ఇలానే సాగిపోతే పరిస్థితి చేయి దాటిపోతుందని భావించి తల్లిదండ్రులు బైక్ పై తిరగడానికి పురమాయిస్తున్నారు.. జస్ట్ 25 సంవత్సరాలు.. ఎంత తేడా వచ్చేసింది. మనిషి జీవితం ఎంతలా మారిపోయింది.