
Vivekananda Reddy Murder: అధికారంలో ఉన్న పార్టీలు డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతాయి. విపక్షాలు వైఫల్యాలతో ఇరుకుపెట్టే ప్రయత్నాలు చేస్తాయి. ప్రస్తుతం ఏపీలో జగన్ సర్కారుకు వివేకానందరెడ్డి హత్యకేసు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డిలను సీబీఐ అరెస్ట్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎల్లో మీడియా అయితే తెగ హడావుడి చేస్తోంది. త్వరలో ‘కీ’లక ప్రజాప్రతినిధి, ఆయన సతీమణిలను సైతం విచారించనున్నట్టు టాక్ నడుస్తోంది. అయితే కేసులో పురోగతి స్పీడుగా ఉండగా.. అందుకు తగ్గట్టు వ్యతిరేక మీడియా కావాల్సినంత ప్రచారం చేస్తోంది. అయితే ఇందులో కేసులు, అరెస్ట్ లకంటే రాజకీయంగా దెబ్బకొట్టాలన్నదే వ్యూహం. గత ఎన్నికలకు ముందు వివేకా హత్యతో జగన్ రాజకీయంగా లబ్ధిపొందారు. ఇప్పుడు అదే అంశం ప్రతిబంధకంగా మారింది. విపక్షాలకు అస్త్రంగా మారింది.
ఎన్టీఆర్ ని పదవీవిచ్యుతుడ్ని చేసి పార్టీని హైజాక్ చేసిన ఉదంతాన్నే గుర్తుచేసుకుందాం. నాడు లక్ష్మీపార్వతి ఆగమనం, ఆమె పెత్తనాన్ని సహించలేక చంద్రబాబు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. కేవలం పార్టీని అడ్డం పెట్టుకొని కోట్లాది రూపాయలు దోపిడీ చేశారన్న ఒకే ఒక కారణంతో నందమూరి కుటుంబసభ్యులను, టీడీపీ నేతలను ఏకతాటిపైకి తెచ్చి తిరుగుబాటు చేయగలిగారు. అధికారాన్ని హస్తగతం చేసుకోగలిగారు. అక్కడకు నాలుగేళ్లు పవర్ లో ఉండడమే కాకుండా.. 1999 ఎన్నికల్లో సైతం చంద్రబాబు గెలిచారు. నాడు లక్ష్మీపార్వతిపై మోపిన అభియోగాలపై ఎటువంటి దర్యాప్తు చేపట్టలేదు. లక్ష్మీపార్వతి ఆర్థిక పరిస్థితి కూడా అందరికీ తెలిసిందే. కేవలం రాజకీయ ప్రతికూలతను అధిగమించేందుకే ఆమెపై అప్పట్లో ఆరోపణలు చేసినట్టు అర్ధమైంది.
1988లో వంగవీటి మోహన్ రంగ హత్య కేసు ఎపిసోడ్ నే తీసుకుందాం. నాడు రంగా దారుణంగా హత్యకు గురయ్యారు. దగ్గర్లో ఉండి చంద్రబాబే ఈ హత్య చేయించారన్న ఆరోపణలున్నాయి. నాడు ఇదే కాన్సెప్ట్ తో ముందుకెళ్లిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించారు. టీడీపీపై కాంగ్రెస్ మంచి విజయం సాధించింది. అయితే ఆరోపణలు చేసినట్టు చంద్రబాబును అరెస్ట్ చేసే ప్రయత్నమేదీ చేయలేదు. కేవలం రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసినట్టు అర్థమవుతోంది. నాడు సొంత పార్టీ ఎమ్మెల్యే అయిన మోహన్ రంగా హత్యను విచారణ చేపట్టలేమని కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టివేసిందంటే కేవలం రాజకీయం కోసమే చంద్రబాబుపై ఆరోపణలు చేసినట్టు అవగతమవుతోంది.
వివేకానందరెడ్డి హత్యకేసులో కూడా జరిగింది ఇదే. తొలుత గుండెపోటు నమ్మించే ప్రయత్నం చేసినా.. తరువాత హత్యగా మారింది. అదే సమయంలో దీనిని రాజకీయ ప్రచారానికి వాడుకున్నారు. చంద్రబాబే చేయించారని ఆరోపించారు. సీఐడీ కాదు.. సీబీఐ విచారణ కావాలని డిమాండ్ చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత సీబీఐ అవసరం లేదని తేల్చారు. ముందుగా తాము ఆరోపించినట్టు చంద్రబాబుపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కనీసం చార్జిషీట్ లో చేర్చకపోవడంతో అసలు విషయం ప్రజలకు అర్ధమవుతోంది. ఇటువంటి హత్య ఘటనల్లో నిందితులకు శిక్ష కంటే ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెట్టి రాజకీయ లబ్ధికే పార్టీలు ప్రాధాన్యతనిస్తున్నాయి.