Harirama Jogaiah: వైసీపీ ఆవిర్భావం తరువాత జగన్ వెన్నంటి నడిచిన నాయకుల్లో మాజీ ఎంపీ హరిరామజోగయ్య ఒకరు. జగన్ తో పాటు వైసీపీ బలోపేతానికి అహర్నిశలు శ్రమించారు. కానీ ఆ సీనియర్ నాయకుడి సేవలను జగన్ పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. కొత్త నాయకుల ఆగమనంతో ఆయన్ను దూరం పెట్టారు..అటు హరిరామజోగయ్య కూడా దూరమయ్యారు. అప్పటి నుంచి రాజకీయాల్లో కాస్తా సైలెంట్ గా ఉన్న హరిరామజోగయ్య రాష్ట్ర కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా అడపాదడపా కార్యక్రమాల్లో కనిపించేవారు. అయితే ఇటీవల మాత్రం యాక్టివ్ అయ్యారు. ముఖ్యంగా పవన్ కు మద్దతుగా మాట్లాడుతున్నారు. కాపులకు పవన్ రూపంలో ఒక బలమైన నాయకుడు దొరికాడని నమ్ముతున్నారు. అందుకే. పవన్ కు అండగా.. జగన్ సర్కారుకు వ్యతిరేకంగా పోరాటబాట పట్టారు.

ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు 10 శాతం ఈబీసీ రిజర్వేషన్లను కేంద్రం ఇటీవల ప్రకటించింది. దీంతో కాపులకు చంద్రబాబు సర్కారు ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరించాల్సిన పరిస్థితి జగన్ సర్కారుపై పడింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తానే రద్దు చేసిన రిజర్వేషన్లు పునరుద్ధరిస్తే తప్పుచేసినట్టు ఒప్పుకున్నట్టు అవుతుందని జగన్ ఏ నిర్ణయమూ తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఉన్న హరిరామజోగయ్య తెరమీదకు వచ్చారు. జనవరి 2లోగా రిజర్వేషన్లపై సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. జగన్ సర్కారుపై దండయాత్ర ప్రారంభించారు.
హరిరామజోగయ్య సీనియర్ నాయకుడు. కీలక పదవులు చేపట్టారు. రాష్ట్రంలో కాపులకు ఏ ప్రభుత్వం న్యాయం చేయలేదన్నది ఆయన భావన. ముఖ్యంగా జగన్ పాలనలో కాపులు అణగదొక్కబడుతున్నారని భావిస్తున్నారు. పైగా రాజకీయంగా కాపులను అన్నివిధాలా అణగదొక్కారని అభిప్రాయపడుతుండేవారు. కాపులకు రాజ్యాధికార పీఠం దక్కాలని.. ఈ రాష్ట్రానికి సీఎం అయ్యే చాన్స్ రావాలని బలమైన కోరికను అనుచరులు, కాపు సామాజికవర్గం నేతల వద్ద వ్యక్తం చేస్తుండేవారు. అయితే పవన్ రూపంలో అవకాశం, ఆప్షన్ దక్కడంతో దీనిని రాజకీయంగా మలుచుకోవాలని భావిస్తున్నారు. . అందుకే పవన్ పై ఏ మాత్రం రాజకీయ విమర్శలు వచ్చినా హరిరామజోగయ్య ఖండించేవారు. వచ్చే ఎన్నికల్లో జనసేనకు కాపులు అండగా ఉండాలని తరచూ పిలుపునిచ్చేవారు. కాపులను సంఘటితం చేసి జనసేన వైపు టర్న్ చేయాలని భావిస్తుండేవారు. అందుకే తన వయోభారం లెక్క చేయకుండా కాపు రిజర్వేషన్లపై ఆమరణ నిరాహార దీక్షకు దిగినట్టు జగన్ సర్కారు అనుమానిస్తోంది.

గోదావరి జిల్లాలో హరిరామజోగయ్య పట్టున్న నేత. కాపు సామాజికవర్గంలో బలమైన కేడర్ ఉంది. నిజాలను నిర్భయంగా చెప్పగల నేత ఆయన. ముక్కసూటితనం ఆయన సొంతం. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడంతో ఆయన చాలారకాలుగా చాన్స్ లు వదులుకున్నారని ఇప్పటికీ అనుచరులు చెబుతుంటారు. పవన్ వ్యక్తిత్వం,సిద్ధాంతాలు అంటే ఆయనకు చాలా ఇష్టం. అందుకే వచ్చే ఎన్నికల్లో పవన్ కు మద్దతుగా నిలవాలన్న నిశ్చయానికి వచ్చారు. పార్టీకి నేరుగా సేవలందించేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని తెరపైకి తెచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ముద్రగడ ఉద్యమాన్ని నడిపారు. వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత ఉన్నఫలంగా విడిచిపెట్టేశారు. వైసీపీకి పరోక్షంగా మద్దతుగా నిలుస్తున్నారని ముద్రగడపై అపవాదు ఉంది. ఇప్పుడు అదే ఉద్యమాన్ని అందుకున్న హరిరామజోగయ్య గట్టిగానే పోరాటం చేస్తున్నారు.