Tummala Nageswara Rao: ఏకవాక్యంతో కొట్టాడు.. బీఆర్ఎస్ కు ఇలా రాజీనామా చేసి షాకిచ్చిన ‘తుమ్మల’

అసెంబ్లీ ఎన్నికల ముంగిట అధికార బీఆర్‌ఎస్ కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌ గూటికి చేరడం ఖాయమైంది.

Written By: Bhaskar, Updated On : September 16, 2023 1:31 pm

Tummala Nageswara Rao

Follow us on

Tummala Nageswara Rao: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార భారత రాష్ట్ర సమితికి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భారత రాష్ట్ర సమితికి గుడ్ బై చెప్పారు.. శనివారం ఆయన తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ కు పంపించారు. ” ఇన్నాళ్ళూ సహకరించినందుకు ధన్యవాదాలు. పార్టీకి నా రాజీనామాను ఆమోదించగలరు” అంటూ ఏక వాక్యంతో తన రాజీనామా లేఖను పంపారు.

అసెంబ్లీ ఎన్నికల ముంగిట అధికార బీఆర్‌ఎస్ కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌ గూటికి చేరడం ఖాయమైంది. శనివారం హైదరాబాద్‌కు వస్తున్న ఏఐసీసీ అగ్రనేతలు సోనియా, రాహుల్‌గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. సీడబ్ల్యూసీ సమావేశాల ప్రారంభానికి ముందే మధ్యాహ్నం 2 గంటల సమయంలో తుమ్మల కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నట్లు పేర్కొన్నాయి. తుమ్మలను కాంగ్రెస్ లోకి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు ఆధ్వర్యంలో అధిష్ఠానం గత కొంతకాలంగా సంప్రదింపులు జరుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, పీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్‌ పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి విడివిడిగా తుమ్మల నివాసానికి వెళ్లి కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించారు. తుమ్మలతో సునీల్‌ కనుగోలు సంప్రదింపులు కొలిక్కి రావడంతో.. శుక్రవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, రేవంత్‌రెడ్డి, భట్టివిక్రమార్క, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, ఖైరతాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి తదితర నేతలు హైదరాబాద్‌లోని తుమ్మల నివాసానికి వెళ్లి కాంగ్రెస్‌ పార్టీలోకి ఆయనను లాంఛనంగా ఆహ్వానించారు. శనివారం మంచిరోజైనందున సోనియాగాంధీ సమక్షంలో చేరిక కార్యక్రమం పెట్టుకుందామని వారు ప్రతిపాదించినట్లు, ఇందుకు తుమ్మల కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం.

ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలపై తుమ్మల ప్రభావం బలంగా ఉంది. మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో టీడీపీ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాల్లో మంత్రి పదవులు నిర్వహించిన తుమ్మల.. అభివృద్ధి పనులపైనే ప్రధానంగా దృష్టి పెట్టి జిల్లాపై తనదైన ముద్ర వేశారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగిన రోజుల్లోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌ ప్రభావం నామమాత్రంగానే ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గంలో మాత్రమే బీఆర్‌ఎస్‌ గెలిచింది. ఆ ఎన్నికల్లో పది నియోజకవర్గాలు కలుపుకొని బీఆర్‌ఎస్‌ 1.55 లక్షల ఓట్లు మాత్రమే సాధించగలిగింది. ఇందులో కొత్తగూడెంలో సాధించిన ఓట్లే 50 వేలు ఉన్నాయి. అవే ఎన్నికల్లో టీడీపీకి 4.77 లక్షల ఓట్లు వచ్చాయి. దీంతో టీడీపీ ఓటు బ్యాంకుపై దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్‌.. ఆ పార్టీలో బలమైన నేతగా ఉన్న తుమ్మలను బీఆర్‌ఎస్ లో చేర్చుకుని ఎమ్మెల్సీ స్థానాన్ని, మంత్రి పదవిని కట్టబెట్టారు. ఆ తర్వాత పాలేరుకు జరిగిన ఉప ఎన్నికలో తుమ్మల నాగేశ్వరరావు భారీ ఆధిక్యంతో గెలిచారు. ఆపై జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున టీడీపీ నేతలను బీఆర్‌ఎస్ లోకి తీసుకువచ్చారు. దీంతో 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ కు 6.77 లక్షల ఓట్లు వచ్చాయి. అయినా.. ఆ ఎన్నికల్లో జిల్లాలోని ఖమ్మం మినహా అన్ని స్థానాల్లోనూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఓటమి పాలైంది. పాలేరులో తుమ్మలపై కాంగ్రెస్‌ నుంచి గెలిచిన కందాళ ఉపేందర్‌రెడ్డి ఆ తర్వాత బీఆర్‌ఎస్ లో చేరారు. వచ్చే ఎన్నికలకుగాను పాలేరు టికెట్‌ ఉపేందర్‌రెడ్డికే ఖరారు కావడంతో జిల్లా వ్యాప్తంగా తుమ్మల పట్ల సానుభూతి పెల్లుబికింది. ఇదే అదనుగా చక్రం తిప్పిన కాంగ్రెస్‌ అధిష్ఠానం.. తుమ్మలను తమ పార్టీలో చేరేలా ఒప్పించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాపాటు జీహెచ్‌ఎంసీ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లోనూ తుమ్మల ప్రభావం ఉంది. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలపై గురి పెట్టిన నేపథ్యంలో తుమ్మల వంటి బలమైన నేత ఆ పార్టీలో చేరడం బీఆర్‌ఎస్ కు పెద్ద దెబ్బేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే తుమ్మలను ఖమ్మం నుంచి పోటీచేయించాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం భావిస్తుండగా.. ఆయన మాత్రం పాలేరునుంచి పోటీ చేసేందుకే మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది.