Telangana Elections 2023: తెలంగాణలో జనసేన అభ్యర్థుల ఖరారు.. శేరిలింగంపల్లి విషయంలో సందిగ్ధత

జనసేనకు కేటాయించిన సీట్లలో బిజెపి ఆశావాహులు సైతం ఎక్కువ మంది ఉన్నారు. పొత్తులో భాగంగా సీట్లు కోల్పోవడంతో బిజెపి నేతలు అసంతృప్తి లోనయ్యారు. చాలామంది అలకపాన్పు ఎత్తారు.

Written By: Dharma, Updated On : November 8, 2023 12:05 pm

Telangana Elections 2023

Follow us on

Telangana Elections 2023: తెలంగాణలో జనసేన పోటీ చేసే నియోజకవర్గం ఫుల్ క్లారిటీ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 8 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయనుంది. ఎన్నికల్లో బిజెపితో జనసేన పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ పొత్తులో భాగంగా జనసేనకు ఎనిమిది సీట్లను బిజెపి కేటాయించింది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పేరుతో ఒక ప్రకటన విడుదలైంది. 8 నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేశారు. గత రెండు రోజులుగా కూకట్పల్లి నియోజకవర్గం విషయంలో జరుగుతున్న ప్రచారానికి తెరదించుతూ అక్కడ ప్రేమ్ కుమార్ అనే నేతకు టికెట్ కేటాయించారు. ఇప్పటికే 32 నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. బిజెపితో పొత్తు కుదరడంతో తొలుత 12 స్థానాలు జనసేనకు కేటాయించనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ చివరకు ఎనిమిది స్థానాలనే ఖరారు చేశారు.

భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు 108 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో 9 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేయవలసి ఉంది. ముఖ్యంగా హైదరాబాదులోని శేరిలింగంపల్లి సీటు విషయంలో సందిగ్ధత నెలకొంది. శేరిలింగంపల్లి స్థానాన్ని తమకు కేటాయించాలని జనసేన పట్టుబడుతుండగా.. బిజెపి నేతలు సైతం తమకే కావాలని కోరుతున్నారు. నామినేషన్లకు ఇంకా రెండు రోజుల సమయం ఉంది. వీలైనంత త్వరగా మిగతా స్థానాలు విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

జనసేనకు అధినేత పవన్ ఎనిమిది నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేస్తూ ప్రత్యేక ప్రకటన జారీ చేశారు. కూకట్పల్లి కి సంబంధించి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, కోదాడకు మేకల సతీష్ రెడ్డి, తాండూర్ కు నేమూరి శంకర్ గౌడ్, ఖమ్మం కు మిర్యాల రామకృష్ణ, కొత్త గూడానికి లక్కినేని సురేందర్ రావు, అశ్వరావుపేట ఎస్టి నియోజకవర్గానికి మూయబోయిన ఉమాదేవి, వైరా ఎస్టీ నియోజకవర్గానికి డాక్టర్ తేజావత్ సంపత్ నాయక్, నాగర్ కర్నూల్ కు వంగల లక్ష్మణ్ గౌడ్ అభ్యర్థిత్వలను ఖరారు చేస్తూ పవన్ కళ్యాణ్ పేరిట ప్రత్యేక ప్రకటన విడుదలైంది.

జనసేనకు కేటాయించిన సీట్లలో బిజెపి ఆశావాహులు సైతం ఎక్కువ మంది ఉన్నారు. పొత్తులో భాగంగా సీట్లు కోల్పోవడంతో బిజెపి నేతలు అసంతృప్తి లోనయ్యారు. చాలామంది అలకపాన్పు ఎత్తారు. ముఖ్యంగా కూకట్పల్లి నియోజకవర్గం బిజెపి నేతలు ఇష్టపడలేదు. అయితే ఆ సీటు విషయంలో జనసేన సైతం అదే పట్టు కొనసాగించడంతో.. హై కమాండ్ పెద్దలు కలుగజేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 32 నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. హై కమాండ్ పెద్దల కోరిక మేరకు పవన్ తన సీట్లను తగ్గించుకున్నారు. అయితే కూకట్పల్లి విషయంలో.. సెటిలర్స్ అధికము. ఏపీ రాజకీయాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ నియోజకవర్గం విషయంలో పవన్ పట్టు పట్టినట్లు సమాచారం. దీంతో బీజేపీ హై కమాండ్ వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. శేరిలింగంపల్లి విషయంలో కూడా అదే పరిస్థితి నెలకొంది. వీలైనంత త్వరగా స్పష్టత ఇవ్వాలని రెండు పార్టీల శ్రేణులు కోరుతున్నాయి.