Jr NTR Vs TDP: కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అందరి దూల తీర్చేస్తుంది. ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతుంటాయి. ఒకప్పుడు దేశానికి ప్రధానులను.. రాష్ట్రపతులను నియమించిన 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబును ఇప్పుడు డమ్మీని చేసి ఆడిస్తోంది. ఢిల్లీకి వెళితే కనీసం ప్రధాని కాదు కదా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వని దుస్థితికి బాబు గారు దిగజారారు. అందుకే చంద్రబాబులో ఆ ఆగ్రహం, ఆవేదన, అక్కసు తన్నుకొస్తోంది. తనకు దక్కనది.. తను వెలివేసిన జూనియర్ ఎన్టీఆర్ కు దక్కేసరికి తట్టుకోలేకపోతున్నాడట.. అందుకే జూనియర్ ఎన్టీఆర్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ నిర్వహిస్తున్నట్టు భోగట్టా..

జూనియర్ ఎన్టీఆర్ పై పకడ్బందీగా టీడీపీ బ్యాచ్ ట్రోలింగ్ నిర్వహిస్తోందని టాక్ వినిపిస్తోంది. తనకు పోటీ అయిన జూనియర్ పై చంద్రబాబు వారసుడు లోకేష్ బాబు దగ్గరుండి మరీ ఇదంతా చేయిస్తున్నాడని సమాచారం. లోకేష్ ‘ఫ్రెండ్’ యే టీడీపీ సోషల్ మీడియా ఇన్ చార్జి. సో లోకేష్ ప్రోద్బలంతోనే ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారట.. దీనికి జూనియర్ అభిమానులు కూడా కౌంటర్లతో విరుచుకుపడుతున్నారు.
చంద్రబాబుకు కూడా దొరకని అమిత్ షా అపాయింట్ మెంట్ ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ కు దొరకడం.. జూనియర్ ను కలిసేందుకు స్వయంగా అమిత్ షా పిలవడంతో చంద్రబాబు రగిలిపోతున్నట్టు సమాచారం. తనకు దక్కని గౌరవాన్ని జూనియర్ పొందుతుండడంతో తట్టుకోలేక బాబు.. ఆయన పుత్రుడే ఈ ట్రోలింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ‘ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ’ పేరు మార్పుపై జూనియర్ హుందాగా స్పందించినా కూడా వైఎస్ఆర్ ను పొగిడారంటూ జూనియర్ పై తెలుగు తమ్ముళ్లు అంతా దుమ్మెత్తిపోస్తున్నారు.దీనివెనుక లోకేష్ కుట్ర కుతంత్రాలు ఉన్నాయంటున్నారు. ఎప్పుడూ లేనిది జూనియర్ పై ఈ రేంజ్ లో టార్గెట్ చేయడానికి ఆ అక్కసే కారణమంటున్నారు.
జూనియర్ పై ఈ అక్కసు ఈనాడు మొదలైంది కాదు. నాడు సింహాద్రి, ఆది తర్వాత మాస్ హీరోగా వెలుగొందుతున్న జూ.ఎన్టీఆర్.. ఎక్కడ బాలకృష్ణను మించిపోతారని నాడు ఇదే టీడీపీ బ్యాచ్ ‘నరసింహా’ సినిమాపై చేసిన కుట్రలు అన్నీ ఇన్నీకావు. టీడీపీ ఒత్తిళ్లకు ఆ దర్శకుడు పారిపోయి.. అసిస్టెంట్ దర్శకుడితో సినిమా తీయడం.. నిర్మాత అప్పుల బాధతో హుస్సేన్ సాగర్ లో దూకడం ఎవరూ మరిచిపోలేరు. ‘నరసింహ’ సినిమా బ్లాక్ బస్టర్ అయితే బాలకృష్ణను జూ.ఎన్టీఆర్ అధిగమిస్తాడన్న ఒకే కారణంతోనే నాడు తొక్కేశారని అంటారు.ఆ సినిమాను ఆడకుండా కూడా చేశారని ఇండస్ట్రీలో చెప్పుకుంటారు.
ఈరోజు ఇటు సినిమాల్లో ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదగడం.. కేంద్ర హోంమంత్రియే వచ్చి కలవడంతో జూ.ఎన్టీఆర్ రేంజ్ పతాకస్థాయికి చేరింది. ఆయన ఉన్నతిని తట్టుకోలేక టీడీపీ ఇలా టార్గెట్ చేసిందా? అని అందరూ అనుమానిస్తున్నారు. ఎంత తొక్కినా కూడా ఎవరి టాలెంట్ ఎవరూ ఆపలేరు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఆపడం కష్టం. ఇప్పుడు జూ.ఎన్టీఆర్ కూడా సూర్యుడు అంత ఎత్తుకు ఎదిగాడు. అతడి కోసం ప్యాన్ ఇండియా డైరెక్టర్లు.. దేశపు నంబర్ 1 రాజకీయవేత్తలు క్యూ కడుతున్నారు. ఈ తండ్రీ కొడుకుల (బాబు-లోకేష్) ద్వయం ఎన్ని కుట్రలు , కుతంత్రాలు చేసినా జూ.ఎన్టీఆర్ ను ఏమీ చేయలేరని.. ఈ ఊకదంపుడు సోషల్ మీడియా ట్రోలింగ్ కు కృంగిపోయే మనస్తత్వం జూనియర్ ది కాదని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. ఇప్పటికైనా బాబు, లోకేష్ లు ఈ కుట్రలు ఆపాలని హితవు పలుకుతున్నారు.