FIFA World Cup 2022 Semi Final: ఒంటి చేత్తో అర్జెంటీనాను సెమీస్ కు చేర్చిన మెస్సి ఒకవైపు.. సమష్టి పోరాటంతో అంచనాలను తారు మారు చేస్తున్న క్రొయేషియా ఒకవైపు.. సమ ఉజ్జీల సెమీస్ పోరులో ఎవరు ఫైనల్ వెళతారు అనేది నేడు తేలనుంది.. ఇప్పటికే సాకర్ స్టార్లు నెయిమార్, క్రిస్టియానో రొనాల్డో కన్నీళ్ళతో టోర్నీ వీడారు. మరో దిగ్గజం వరల్డ్ కప్ కల నేడు కరిగిపోనుంది. అది మెస్సీ దా? లేదా మోద్రిచ్ దా? మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.

తడబడినా పుంజుకుంది
సాకర్ కప్ లో హాట్ ఫేవరెట్ గా అర్జెంటీనా బరిలోకి దిగింది. కానీ మొదట్లో తడబడింది. తర్వాత పుంజుకుంది. టైటిల్ వేటలో నిలిచింది. గత రెండు ప్రపంచ కప్ ల్లో ఒక్కోసారి 2014 లో అర్జెంటినా, 2018లో క్రొయేషియా రన్నరప్ లుగా నిలిచాయి.. ఇప్పుడు ఈ రెండు జట్ల పోరు ఆసక్తికరంగా ఉంది. ఇప్పటికే అర్జెంటీనా 1978, 1986 లో సాకర్ కప్ లు గెలుచుకుంది. అయితే ఇప్పటివరకు సెమీస్ లో అర్జెంటినాకు ఓటమి అన్నదే లేదు. అయితే ఆరో ప్రపంచకప్ ఆడుతున్న క్రొయేషియా.. అసాధారణ ప్రదర్శన కొనసాగించాలనే లక్ష్యంతో ఉంది. గత ప్రపంచకప్ గ్రూప్ దశలో క్రోయేషియా 3_0 తేడాతో అర్జెంటీనాపై గెలిచింది. మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది.
ఓటమి అన్నదే లేదు
గత 36 మ్యాచులను అర్జెంటీనా వరుసగా గెల్చుకుంటూ వచ్చింది. కోపా కప్ కూడా దక్కించుకుంది. ఆ జట్టు సెమీస్ వెళ్లడంలో కెప్టెన్ మెస్సీ ది కీలకపాత్ర. ఇప్పటికే అతడు ఈ టోర్నీలో నాలుగు గోల్స్ సాధించాడు. ఈ టోర్నీలో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాళ్ళ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక అతడి సహచరులు గోల్స్ చేయడంలో సహకరిస్తున్నారు. ఇక సెమీస్ పోరు లోనూ అర్జెంటినా జట్టు ఆశలు మొత్తం అతనిపైనే పెట్టుకుంది.. ఎంతమంది ఎదురుగా ఉన్నప్పటికీ బంతిని డ్రిబ్లింగ్ చేస్తూ గోల్స్ సాధించడంలో అతడికి అతడే సాటి. క్వార్టర్లో నెదర్లాండ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో… ఆట తీరుతోనే కాదు, ఆవేశం లోనూ అతడు చర్చనీయాశంగా మారాడు. ఆ మ్యాచ్ ఫెనాల్టీ షూట్ అవుట్ లో గెలిచిన అర్జెంటీనా సెమీస్ లో క్రొయేషియాకు చెక్ పెట్టాలని యోచిస్తోంది. అయితే డిఫెన్స్ లో మెరుగయితేనే ఇది సాధ్యం అవుతుంది.

బ్రెజిల్ కు షాక్ ఇచ్చి
క్వార్టర్ ఫైనల్లో బ్రెజిల్ జట్టుకు షాక్ ఇచ్చిన క్రొయేషియా.. బ్రెజిల్ జట్టు కెప్టెన్ నెయిమార్ కలలను కూల్చే సింది. క్రొయేషియా జట్టు లో కెప్టెన్ లూకా మోద్రిచ్ ప్రధాన ఆటగాడు. ఇప్పటి వరకూ టోర్నీ లో అతను ఒక్క గోల్ కూడా కొట్టకున్నా, గోల్ చేయడంలో సాయ పడకున్నా అతన్ని తక్కువ చేసి చూడటానికి లేదు. బంతి పై జట్టు నియంత్రణ సాధించడంలో అతడికి అతడే సాటి. అతడితో పాటు కొవా సిచ్, బ్రోజోవిచ్ తో మిడ్ ఫీల్డ్ పటిష్ఠంగా ఉంది. క్రమారిచ్, మార్కో, లోవ్రో, పెరిసిచ్, పెట్కో విచ్, మిస్లావ్ కూడా సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. గోల్ కీపర్ డొమినిక్ లివ కోవిచ్ గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. ప్రపంచ కప్ లో క్రొయేషియా ఇప్పటి వరకూ అడిన నాలుగు పెనాల్టీ షూట్ ఔట్ ల్లోనూ గెలిచింది. అయితే ఈ రోజు మ్యాచ్ లో సెమీస్ లో ఓటమి అన్నదే లేని అర్జెంటీనా గెలుస్తుందా? సంచలనాల క్రొయేషియా గెలుస్తుందా? అనేది కొద్ది గంటల్లో తెలిపోనుంది.