
Kavitha – KCR – ED : మనం ఏం చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది.. దీన్నే కర్మ సిద్ధాంతం అంటారు.. పువ్వు విసిరితే వస్తుంది.. రాయి విసిరితే రాయే వస్తుంది. సో ఏం చేయాలనేది మన విచక్షణ మీదే ఆధారపడి ఉంటుంది.. అలాంటప్పుడు కాస్త విజ్ఞతతో ఆలోచించాలి.. కాదు కూడదు అధికారం ఉంది, ఏదైనా చేసేస్తా, ఎవరినైనా తొక్కేస్తా అని అనుకుంటే బూమారాంగ్ అవుతుంది. ఇప్పుడు కేసీఆర్ కు ఇది బోధపడుతోంది. ప్రజాస్వామ్యం గురించి, విలువల గురించి మాట్లాడే కెసిఆర్ అండ్ కో ఇవాళ ఈ స్థాయిలో ఉక్కపోతకు గురవుతుందంటే దానికి వారి స్వయంకృతాపరాధమే.
-భారత రాష్ట్ర సమితిని కుదిపేసింది
ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారణ చేయడం బీఆర్‌ఎస్ పార్టీని కుదిపేసింది. అగ్రశ్రేణి నేతల నుంచి కార్యకర్తల వరకు ఆందోళనకు గురయ్యారు. మొదటిసారి ఇలాంటి అనుభవం ఎదురుకావడంతో ఒకింత ఉత్కంఠ చోటు చేసుకున్నది. సీఎం కేసీఆర్, మంత్రులు నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు టెన్షన్ టెన్షన్‌గా గడిపారు. అసలు ఏం జరుగుతోంది, ఈడీ ఏమని ప్రశ్నిస్తోంది, ఎంత సమయం తీసుకుంటుంది, కవిత పరిస్థితి ఏమిటి అంటూ కేసీఆర్ మినిట్ టు మినిట్ ఆరా తీశారు. ఎప్పుడూ లేని విధంగా సొంత కూతురు ఈడీ ప్రశ్నలను ఎదుర్కొనాల్సి రావడంతో ఆయన నెర్వస్ అయినట్లు తెలిసింది. రోజంతా దిగాలుగా కనిపించినట్లు సమాచారం. ఈ అంశం కవితకే కాకుండా పార్టీ ఇమేజీని కూడా దెబ్బతీసేలా కనిపిస్తుండడంతో ఆయన కొంత నొచ్చుకున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. పైకి గంభీరంగా కనపడుతున్నా… లోలోన మదన పడుతున్నారని అంటున్నాయి.
-మంత్రులంతా అక్కడే
ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ శనివారం ఢిల్లీలో ఎమ్మెల్సీ కవితను విచారించింది. ఆమె సోదరుడు, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు శనివారం ఉదయమే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈడీ విచారణ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అక్కడే మకాం వేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే వారు ఢిల్లీకి వెళ్లినట్లు తెలిసింది. కేసీఆర్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రగతి భవన్ నుంచి మంత్రులు కేటీఆర్, హరీశ్‌తో మాట్లాడారు. ఈడీ ప్రశ్నల సరళి, ఏ అంశాలకు సంబంధించి అడుగుతున్నారన్న వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో మంత్రులు కూడా ఈడీ కార్యాలయం నుంచి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. తమకు తెలిసిన ప్రతి పాయింట్‌ను కేసీఆర్‌కు చేరవేశారు. సీఎం రోజంతా ఇదే పనిలో ఉన్నారు. సమాచారాన్ని తెలుసుకుంటూ మంత్రులకు అవసరమైన మార్గనిర్దేశం చేశారు. విచారణ ముగియగానే అరెస్టు చేస్తే ఏం చేయాలన్న అంశాల గురించి వివరించినట్లు తెలిసింది. పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదంటూ ధైర్యం చెప్పారని సమాచారం.
-ధర్నాల్లో మంత్రులు
మరో ఐదుగురు మంత్రులు కూడా ఢిల్లీలోనే మకాం వేశారు. మంత్రులు మహమూద్ అలీ, ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ శనివారం ఢిల్లీకి వెళ్లి ఈడీ విచారణ గురించి ఆరా తీశారు. మరో ఇద్దరు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ గురువారమే ఢిల్లీకి వెళ్లారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గురువారం క్యాబినెట్ భేటీ మధ్యలోంచి వెళ్లిపోయారు. శుక్రవారం కవిత ఢిల్లీలో చేపట్టిన దీక్షలో పాల్గొని అక్కడే ఉండిపోయారు. ఇలా ఏడుగురు మంత్రులు ఢిల్లీకి వెళ్లి కవిత విచారణను పరిశీలించడం గమనార్హం. రాష్ట్రంలో ఉన్న మిగతా మంత్రులు శనివారం బిజీ బిజీగా గడిపారు. కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్‌ఎస్ శ్రేణులు చేపట్టిన ధర్నాలు, ఆందోళనల్లో పాల్గొన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నగరంలోని ఈడీ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో పాల్గొన్నారు. అయితే బీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఎదురయ్యే పరిస్థితులను ముందుగానే అంచనా వేసిన ఈడీ హైదరాబాద్‌లోని తన కార్యాలయం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. మొత్తానికి మద్యం కుంభకోణంలో కవితను ఈడి విచారించడం కర్మ సిద్ధాంతాన్ని కెసిఆర్ కు పరిచయం చేసింది.