
Kavitha Vs ED: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇంతమంది అరెస్టయినా రాని చర్చ… కేవలం కవిత విచారణకు హాజరైతేనే దేశవ్యాప్తంగా సంచలనానికి దారి తీసింది. లోకల్ మీడియా నుంచి నేషనల్ మీడియా వరకు ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా జాతీయ మీడియా అయితే ఉదయం నుంచి కవిత ఈ డి ఆఫీస్ నుంచి బయటకు వచ్చేంతవరకు మినిట్ టు మినిట్ అప్డేట్ ఇచ్చింది. తెలుగు మీడియా అయితే ఏకంగా ఈడి ప్రశ్నిస్తున్న తీరు లైవ్ లో పెట్టినట్టు సొంత భాష్యం చెప్పింది.. నిజంగా కవితను ఈ డి ఏం అడిగింది?! దానికి కవిత ఏం చెప్పింది? ఈ కుంభకోణంలో ఇంకా ఎటువంటి విషయాలపై కూపి లాగింది?! విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..

మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. మూడురోజుల క్రితం అందిన సమన్ల మేరకు శనివారం ఉదయం 11 గంటలకు ఏపీజే అబ్దుల్ కలాం రోడ్‌లో విద్యుత్ లేన్‌లో ఉన్న ప్రవర్తన్ భవన్‌లో ఈడీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. బీఆర్‌ఎస్, భారత్ జాగృతి కార్యకర్తల నిరసనల నడుమ హాజరైన కవితను ఈడీ అధికారులు దాదాపు తొమ్మిది గంటలపాటు ప్రశ్నించారు. రాత్రి 8 గంటల వరకు విచారించిన ఈడీ అధికారులు.. లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. ప్రధానంగా, ‘‘ఢిల్లీ మద్యం వ్యాపారంతో మీకు సంబంధమేంటి? మద్యం కుంభకోణంలో మీ పాత్ర ఏమిటి? మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్రపిళ్లై మీ బినామీయా? కాదా? ఈ వ్యాపారంలో మీరు ఎంత మేరకు పెట్టుబడులు పెట్టారు? ఇండో స్పిరిట్‌లో 32.5 శాతం వాటాతోపాటు పెర్నాడ్ రికార్డ్ పంపిణీదారుగా కూడా మీకు భాగస్వామ్యం ఉందా? సౌత్ గ్రూప్‌లో మీ వాటా ఎంత? ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? హవాలా ద్వారా ఢిల్లీకి పంపిన డబ్బులు ఎవరివి? ఢిల్లీ ఒబెరాయ్ హోటల్‌లో మద్యం వ్యాపారులు, ఆప్ నేతలతో మీరు సమావేశమయ్యారా? అక్కడ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, ఆప్ కమ్యూనికేషన్ ఇన్‌చార్జి విజయ్ నాయర్‌లను కలుసుకున్నారా? ఆప్‌తో మీకు ఉన్న రాజకీయ సంబంధాలేమిటి? పంజాబ్, గోవా ఎన్నికల్లో ఆప్‌కు నిధుల సహాయం చేశారా? హైదరాబాద్‌లో కూడా మీ నివాసంలో ఇండో స్పిరిట్ యజమాని సమీర్ మహేంద్రును కలుసుకున్నారా? లేదా? దాదాపు పది ఫోన్లను ఎందుకు మార్చాల్సి వచ్చింది? లేదా ధ్వంసం చేయాల్సి వచ్చింది? హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్‌లో అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబు తదితరులు విజయ్ నాయర్‌తో మీ ప్రేరణతోనే చర్చలు జరిపారా?’’ వంటి ప్రశ్నలను ఈడీ అధికారులు సంధించినట్లు సమాచారం.
Also Read: Kavitha – KCR – ED : కెసిఆర్ కు కర్మ సిద్ధాంతాన్ని పరిచయం చేసిన ఈడి
విజయ్ నాయర్, అరుణ్ రామచంద్ర పిళ్లై, ఆడిటర్ బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లి తదితరులు ఇచ్చిన వాంగ్మూలాలను కూడా కవిత ముందు పెట్టి.. వాటి ఆధారంగా నిజానిజాలను వివరించాలని కూడా ఈడీ ఒత్తిడి చేసినట్లు తెలిసింది. రామచంద్ర పిళ్లై ఈడీ కస్టడీలోనే ఉన్నా.. శనివారం ఆయనను ముఖాముఖి గా ప్రవేశపెట్టలేదని తెలుస్తోంది. అయితే విచారణ ఇంతటితో ముగియలేదని, 16న మరోసారి హాజరు కావాలని ఈడీ అధికారులు కవితకు సూచించారు.
కవిత ఈడీ కార్యాలయానికి వెళ్లిన కొద్దిసేపటికే ఆమె బయోమెట్రిక్, ఐరిస్ వివరాలను సిబ్బంది సేకరించారు. సమన్ల వెరిఫికేషన్ తర్వాత కొన్ని ఫారాలపై సంతకాలు తీసుకున్నారు. ఆ తర్వాత రెండో అంతస్తుకు తీసుకెళ్లి ఆమెను ఒక గదిలో కూర్చోబెట్టారు. దర్యాప్తు అధికారి జోగీందర్ నేతృత్వంలో ముగ్గురు అధికారుల బృందం ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించిందని, అందులో ఒక మహిళా అధికారి కూడా ఉన్నారని తెలుస్తోంది. మధ్య మధ్యలో వారు బయటకు వెళ్లి పై అధికారుల నుంచి ఆదేశాలు తీసుకునివచ్చి మళ్లీ ప్రశ్నించడం మొదలుపెట్టారని సమాచారం.
కాగా కవితను ప్రశ్నిస్తున్న సమయంలో ఒక అధికారి.. ఆమె ప్రస్తుతం వాడుతున్న మొబైల్ ఫోన్ ఇవ్వాల్సిందిగా అడిగారు. అయితే తాను తుగ్లక్‌రోడ్‌లోని ఇంట్లో వదిలివచ్చానని కవిత చెప్పడంతో ఆమె డ్రైవర్‌ను ఇంటికి పంపి ఆ ఫోన్‌ను తెప్పించుకున్నారు. ఆ తర్వాత దానిని వారు స్వాధీనపర్చుకున్నారు. సాయంత్రం 4గంటల వేళ విచారణకు విరామం ఇచ్చి ఈడీ క్యాంటీన్‌లో ఫలహారం తీసుకునేందుకు అనుమతించినట్లు తెలిసింది. ఆ తర్వాత మళ్లీ విచారణ కొనసాగించారు. రాత్రి 8గంటల సమయంలో విచారణ ముగిసిన తర్వాత కవిత నేరుగా సీఎం కేసీఆర్ అధికారిక నివాసానికి వెళ్లిపోయారు.
Also Read: MLC Elections : ఉత్తరాంధ్రలో కాకరేపిన కాపు మీటింగ్, వైసీపీకి ఎదురీత తప్పదా?