AP Early Elections: ఏపీలో జగన్ ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారా? ఇదే కరెక్ట్ టైముగా భావిస్తున్నారా? ఏమాత్రం ఆలస్యం చేసినా అసలుకే ఎసరు వస్తుందని భయపడుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అనుమానాలకు నిజం చేకూరుస్తున్నాయి. ప్రస్తుతం అటు పాలనాపరంగా, ఇటు పార్టీపరంగా జగన్ కు మైనస్ మార్కులే లభిస్తున్నాయి. అటు కేంద్రం నుంచి సహాయ నిరాకరణ, ఇటు రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులతో జగన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అటు ఆర్థికంగా కూడా పరిస్థితి బాగాలేకపోవడంతో ముందస్తు ఎన్నికలకు వెళితేనే గట్టెక్కగలమని ఆయన భావిస్తున్నారు. లేకుంటే మాత్రం అపజయం తప్పదన్న ఆందోళనతో ఉన్నారు. వీలైనంత త్వరగా గవర్నమెంట్ ను డిజాల్వ్ చేసి ఎన్నికలకు వెళ్లాలని జగన్ భావిస్తున్నారు.

అయితే అన్నింటికంటే ముఖ్యంగా జగన్ కు తనపై ఉన్న కేసులు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. దేశంలో ఏ నాయకుడిపై లేనంతగా జగన్ పై హై రిస్కు కేసులు కొనసాగుతున్నాయి. రేపోమాపో హీయరింగ్ కు వచ్చే అవకాశం ఉంది. ఇన్నాళ్లూ కేంద్ర ప్రభుత్వ ప్రాపకంతో నెట్టుకొస్తూ వచ్చారు. అయితే ఇక్కడ నుంచి అంతా ఈజీ కాదన్నట్టుగా పరిస్థితి ఉంది. గాలి జనార్థనరెడ్డి కేసులను సత్వర విచారణ జరిపించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో జగన్ కేసులకు కూడా కదలిక వచ్చే అవకాశం ఉంది. వీలైనంత త్వరగా పెండింగ్ కేసులకు క్లీయరెన్స్ చూపాలని న్యాయ కోవిదులు ఆలోచిస్తున్నారు. ఈ తరుణంలో ఎటూ తప్పించుకోలేనన్న స్టేజ్ కి జగన్ వచ్చారు. అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లి.. మరోసా అధికారంలోకి వస్తే కేసులను ఎదుర్కొవచ్చని భావిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ కానీ.. కాంగ్రెస్ కానీ అధికారంలోకి వస్తే వారి సహకారంతో మరో ఐదేళ్ల పాటు ఎటువంటి కేసుల భయం లేకుండా సాగవచ్చన్న ప్లాన్ అమలుచేస్తున్నారు.
ఏపీలో ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్నా ప్రజా వ్యతిరేకత మాత్రం తప్పడం లేదు. సంక్షేమ పథకాల రూపంలో వేల కోట్ల రూపాయలు పంచిపెడుతున్నా..ప్రజల నుంచి సంతృప్తి కనిపించడం లేదు. అన్నివర్గాల నుంచి వ్యతిరేకత పెల్లుబికుతోంది. సర్వేల్లో కూడా అదే వ్యక్తమవుతోంది. అటు ప్రభుత్వ నిఘా వర్గాలు సైతం దీనినే పసిగట్టి జగన్ చెవిట్లో వేస్తున్నాయి. పీకే ఐ ప్యాక్ టీమ్ మూడు సార్లు వడబోర్చి సర్వేచేసినా అవే ఫలితాలు వెలువడ్డాయి. ఏ మాత్రమూ మార్పు లేదు. అటు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటున్న గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో కూడా నిలదీతలే ఎదురవుతున్నాయి. మాకు సంక్షేమ పథకాలు వద్దు.. మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రజల నుంచి డిమాండ్ వస్తుండడంతో.. ఇది ముదిరితే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని జగన్ భావిస్తున్నారు. ఈ టెన్సన్ మాకొద్దు.. ఫ్రెష్ గా ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అవుతున్నారు.

ఇన్నాళ్లూ పరస్పర సహకారంతో నెట్టుకొచ్చిన జగన్ చేతులెత్తేశారు. ఇందుకు ప్రధాని మోదీ సహాయ నిరాకరణే ప్రధాన కారణం. కేంద్రం పట్టించుకోకపోవడంతో ఏపీ సర్కారు ఆర్థిక క్రమశిక్షణ కట్టుదాటింది. ఆర్థిక సంవత్సరంలో విధించి రుణ పరిమితి.. కేవలం ఆరు నెలల్లోనే ఏపీ ప్రభుత్వం దాటేసిందంటే అప్పులు ఏ స్థాయిలో చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. నెలకు రూ.4 వేల కోట్లు అప్పు చేస్తే కానీ… ఉద్యోగులకు జీతాలు,. పెన్షనర్స్ కు పింఛన్లు ఇచ్చుకోలేని దయనీయ స్థితిలో సర్కారు ఉంది. విమర్శలు చుట్టుముట్టడంతో మోదీ సర్కారు ఇప్పుడు ప్రతీదానికి ఏపీ ప్రభుత్వానికి లెక్క అడుగుతోంది. ఇన్నాళ్లు స్వేచ్ఛగా అప్పులు చేసుకుంటూ వచ్చిన జగన్ సర్కారుకు ఇదిమింగుడపడని అంశంగా మారింది. మరోవైపు ఏపీలో రాజకీయ శత్రువులందరూ ఒక్కటవుతున్నారు. వారికి కేంద్రం సహకరిస్తుందన్న అనుమానం జగన్ లో బలపడుతోంది. అందుకే ముందస్తు ఎన్నికలకు సిద్ధపడుతున్నట్టు సమాచారం.