Jammi Chettu Pooja: విజయ దశమి రోజు జమ్మి చెట్టును పూజించడం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. శమీ పూజ చేసి జమ్మి ఆకులను పెద్దలకు పంచి వారి ఆశీర్వాదం తీసుకోవడం ఎన్నో ఆనవాయితీగా వస్తోంది. ఇలా దసరా రోజు జమ్మి ఆకులను బంగారంలా పంచుకుంటారని మనందరికీ తెలుసు. అయితే జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తారు? శమీ పూజ తర్వాత జమ్మి ఆకులను ఎందుకు పంచుకుంటారనే కారణం మాత్రం తెలియదు. కానీ దీని వెనుక పురాణ గాథలు అనేకం ఉన్నాయి. మరి అవేంటి? జమ్మి చెట్టుకు ఉన్న ప్రత్యేకత ఏంటో ఒకసారి చూద్దాం..
పురాణాల్లో ఇలా..
– రుగ్వేద కాలం నుంచి జమ్మి ప్రస్తావన ఉంది. జమ్మి చెట్టును సంస్కృతంలో శమీ వృక్షం అని పిలుస్తారు. అమృతం కోసం దేవ దానవులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు దేవతా వృక్షాలు ఉద్భవించాయట. అందులో శమీ వృక్షం కూడా ఒకటి. అప్పట్లో ఈ చెట్టును అగ్నిని పుట్టించే సాధనంగా ఉపయోగించేవారు. అందుకే దీన్ని అరణి అని కూడా పిలుస్తారు.
– త్రేతా యుగంలో లంకకు వెళ్లే ముందు శ్రీరాముడు శమీ పూజ చేసి వెళ్లాడంట. అందుకే రావణుడి మీద విజయం సాధించాడని రామాయణ గాథ చెప్తోంది.
– మహా భారతంలో పాండవులు అజ్ఞాత వాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను ఒక మూటలో కట్టి శమీ వృక్షంపై ఉంచారు. తమ అజ్ఞాత వాసం పూర్తయ్యే వరకు తమ ఆయుధాలను జాగ్రత్తగా కాపాడమని శమీ వృక్షాన్ని కోరి నమస్కరించి వెళ్లారంట. అజ్ఞాత వాసం పూర్తయిన తర్వాత జమ్మి చెట్టు వద్దకు వచ్చిన పాండవులు శమీ వృక్షానికి పూజ చేసి తమ ఆయుధాలను తీసుకున్నారు. అనంతరం కౌరవులతో యుద్ధంలో పాల్గొని వారిని ఓడించారు. అప్పట్నుంచి విజయ దశమి రోజున శమీ వృక్షాన్ని పూజిస్తే అపజయం ఉండదని ఒక నమ్మకంగా మారింది.
ఈ శ్లోకం పటిస్తే అంతా మంచే..
దసరా రోజు సాయంత్రం సమయంలో జమ్మి చెట్టు వద్ద అపరాజితా దేవిని పూజించి..
శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశినీ
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియ దర్శనం
.. అని శ్లోకం చదివి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ చెట్టు ఆకులను తుంచుకుని వాటిని బంగారంలా ఇంటికి తీసుకెళ్తారు. దసరా రోజు శమీ పూజ తర్వాత జమ్మి చెట్టు కొమ్మలను కొట్టే సమయంలో అక్కడికి రాలేని పెద్దలకు ఆ ఆకులను ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకుంటారు. జమ్మి ఆకులకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత రీత్యా వాటిని బంగారంతో సమానంగా భావిస్తారు. జమ్మిని పూజించడం అంటే జీవితంలో సకల విజయాలు సాధించాలని కోరుకోవడమనే అందరూ నమ్ముతారు.
జమ్మి చెట్టులో ఆరోగ్య గుణాలు..
జమ్మి చెట్టు ఎలాంటి వాతావరణంలోనైనా సరే సులువుగా పెరుగుతుంది. నీటి లభ్యత లేకున్నా కూడా ఎక్కువకాలం బతుకుతుంది. ఈ జమ్మి చెట్టు నుంచి రాలిపోయే ఆకులు రాలుతుంటే కొత్త ఆకులు వస్తూనే ఉంటాయి. పూర్తిగా ఆకులు రాలి చెట్టు బోసిపోయినట్లు ఎప్పుడూ కనిపించదు. ఇప్పటి యువతకు, నగరవాసులకు ఈ చెట్టు ఉపయోగాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ గ్రామీణ జీవితంలో జమ్మి చెట్టుకు ఎంతో అనుబంధం ఉంటుంది. ఈ చెట్టు వేళ్లు భూసారాన్ని పెంచుతాయి. జమ్మి చెట్టులోని ప్రతి భాగం నాటు వైద్యంలో ఔషధంగా ఉపయోగపడుతుంది. ఈ చెట్టు గాలి పీలిస్తే ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతారు. అందుకే శమీ వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేయాలని చెబుతుంటారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే దసరా నాడు రైతులు కూడా తమ పశుపక్ష్యాదుల ఆరోగ్యం కోసం జమ్మి చెట్టును పూజిస్తారు.
Web Title: Do you know why we worship jammi chettu on dussehra day
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com